హైదరాబాద్ : రాష్ట్రంలోని పార్టీలన్నీ హస్తిన బాట పట్టాయి. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి సూచనలు, సలహాలు చెప్పేందుకు వివిధ పార్టీల నేతలు నేడు, రేపు జీవోఎంతో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయల్దేరారు. కొందరు నాయకులు ఇప్పటికే హస్తిన చేరుకోగా... మరికొందరు ఇవాళ, రేపు వెళ్లనున్నారు. మరోవైపు ఎవరి ప్రాంతాలకు అనుగుణంగా వారు జీవోఎం ముందు వాదనలు వినిపించేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు.
జీవోఎం మంగళ, బుధవారాల్లో రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో చర్చల ప్రక్రియ చేపడుతోంది. జీవోఎం మంగళవారం ఉదయం 11 గంటలకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయాలు తెలుసుకుంటుంది. 11.30కు బిజెపి ప్రతినిధులు కిషన్ రెడ్డి, హరిబాబుతో సంప్రదింపులు జరపనుంది. మధ్యాహ్నం 12కు సిపిఐ ప్రతినిధులు నారాయణ, గుండా మల్లేష్ అభిప్రాయాలు తెలుసుకుంటుంది.
సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ అభిప్రాయాలు తెలుసుకుంటుంది. తరువాత తెరాస తరఫున పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, సీనియర్ నేత కె కేశవరావు వాదన వింటుంది. బుధవారం వైకాపా ప్రతినిధి ఎంవి మైసూరారెడ్డి, సిపిఎం ప్రతినిధులు పార్టీ కార్యదర్శి రాఘవులు అభిప్రాయాలు వింటుంది. ఈనెల 18న సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో జీవోఎం భేటీ కానుంది.
ఈ సమావేశం కోసం అధికార కాంగ్రెస్ నుంచి సీమాంధ్ర ప్రతినిధిగా మంత్రి వట్టి వసంత్‌కుమార్ సోమవారమే ఢిల్లీ వెళ్లారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఈ ఉదయం హస్తిన చేరుకోనున్నారు. ఇద్దరు తమ ప్రాంతాల వాదనలు వినిపించే అవకాశాలున్నాయి. అయితే సీడబ్ల్యూసీ తీర్మానానికే పార్టీ కట్టుబడి ఉన్నందున సమైక్యమనే బదులు సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలనే అంశంపై ఆ ప్రాంత ప్రతినిధులు వాదనలు వినిపించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక టీఆర్‌ఎస్ నుంచి అధినేత కేసీఆర్ స్వయంగా జీవోఎం ముందు వాదనలు వినిపించనున్నారు. ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావుతో కలసి ఆయన ఢిల్లీ వెళ్లారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు... హైదరాబాద్ అంశంపై పార్టీ వైఖరిని కేసీఆర్ వెల్లడించనున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిన అవసరం లేదంటూనే.. సీమాంధ్రుల భద్రతపైనా సమగ్రంగా నివేదించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ సహా మరికొందరు జేఏసీ నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు.
భేటీ కోసం సీపీఐ తరపున రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్సీ జల్లీ విల్సన్ నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ నేత హరిబాబు ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా కిషన్‌రెడ్డి ఇవాళ వెళ్తున్నారు. సీపీఎం తరపున రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు బుధవారం, మరోనేత జూలకంటి రంగారెడ్డి ఈ సాయంత్రం వెళ్తున్నారు.
వైఎస్సార్సీపీ నేతలు మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావులు ఈరోజు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఆ పార్టీ నిర్ణయించింది. ఇక టీడీపీ జీవోఎంతో భేటీని బహిష్కరించింది.