మానవత్వం మంట కలిసింది
- క్షతగాత్రుల సెల్‌ఫోన్లను తస్కరించారు
- మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: తోటి మనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కాపాడాల్సింది పోయి వారి వద్దనున్న నగదు, సెల్‌ఫోన్లను తస్కరించి వారిని మృత్యుఒడికి చేరువ చేసిన సంఘటన మంగళవారం రాత్రి కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులు మదనపల్లెలోనే ఉన్నప్పటికీ కుమారుడు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సుమారు 7 గంటలకు పైగా మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. సమాచారం లేకపోవడం వల్లే తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమారుడిని కాపాడుకోలేక పోయారు.
కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన రమణ, వసుంధర దంపతులకు కుమారుడు రెడ్డిశేఖర్ (21), కుమార్తె జయశ్రీ ఉన్నారు. రమణ దంపతులు పదేళ్లక్రితం మదనపల్లెలో స్థిరపడ్డారు. రెడ్డిశేఖర్ కారుడ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా కలికిరి మండలం గుట్టపాళెంకు చెందిన రెడ్డెప్ప కుమారుడు రెడ్డిభాస్కర్(22) స్థానిక నీరుగట్టువారిపల్లె మాయాబజార్‌లో అద్దె రూములో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు.
రెడ్డిభాస్కర్, రెడ్డిశేఖర్ ఇద్దరూ స్నేహితులు. మంగళవారం సాయంత్రం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై అంగళ్లుకు వెళ్లారు. రాత్రి 11.50 గంటలకు మదనపల్లెకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని అంగళ్లు గొర్రెలసంత వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రెడ్డిశేఖర్, రెడ్డిభాస్కర్ రోడ్డుపై పడి కొట్టుమిట్టాడుతున్నారు.
సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. వారి ప్రాణాలను కాపాడాల్సిందిపోయి డబ్బు, సెల్‌ఫోన్లను తస్కరించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించారు. బాధితుల వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయా, ఉంటే ఎవరైనా తీసుకున్నారా అని స్థానికులను అడిగినా అందరూ తెలియదంటూ జారుకున్నారు.
ఆ తర్వాత బాధితులను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు వెంటిలేటర్ సదుపాయంతో చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుల సంబంధీకులు తెలియక బయటి ఆస్పత్రికి రెఫర్ చేయలేక ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తంటాలు పడ్డారు. ఉదయం 6 గంటలకు సమాచారం అందుకున్న రెడ్డిభాస్కర్ బంధువులు ఆస్పత్రికి చేరుకుని వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లారు.
పట్టణంలోనే ఉన్న రెడ్డి శేఖర్ తల్లిదండ్రులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని అంబులెన్స్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా కుమారుడు మృతి చెందాడు. ‘అయ్యో నేనెవ్వరికీ ఎలాంటి మోసం చేయలేదే.. నాకెందుకు దేవుడు ఇంత కడుపుకోత విధించాడంటూ’ రెడ్డిశేఖర్ తల్లి గుండెలు బాదుకుంటూ విలపించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.