మాఫీపై బాబుకు నిరసనల సెగ
తొలిరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు గాజువాక, అనకాపల్లి, చోడవరంలో పర్యటించగా పలుచోట్ల రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీపై చంద్రబాబు ముందు తమ నిరసనలు వ్యక్తం చేశారు. బ్యాంకులు తిరిగి రుణాలు చెల్లించమంటూ ఒత్తిడి చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం రుణమాఫీపై ప్రశ్నించినవారిపై తీవ్రంగా ఊగిపోయారు. అనకాపల్లికి సమీపంలోని తుమ్మపాల చెరకు ఫ్యాక్టరీ రైతులతో జరిగిన ముఖాముఖీలో మాఫీపై ప్రశ్నించిన ఓ రైతును యూజ్‌లెస్‌ఫెలో అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గంధవరం గ్రామంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ మహిళ డ్వాక్రా మహిళలపై నిరసన వ్యక్తం చేయగా... చేసేవాళ్లు ఉంటే అడిగేవారు ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఈడీ పట్టభద్రులు, ప్రస్తుతం కోర్సు చదువుతున్న నిరుద్యోగులకు ఎస్‌జీటీలుగా అవకాశం కల్పించాలని, ప్రస్తుతం డీఎడ్ అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న డీఎస్సీలో అవకాశం కల్పించాలని చోడవరంలో విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. 14 నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్నామని వెలుగు సీఏలు గజపతినగరం గ్రామంలో విన్నవించారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.