కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: వాతావరణం నాడీ అంతుచిక్కడం లేదు. పగలంతా భగభగ మండే ఎండ.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతలోనే వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటోంది. సాయంత్రం అవుతుండగానే ఆకాశమంతా మబ్బులు కమ్ముకుంటూ చిటపట చినుకులతో వరుణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు.
కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ విచిత్ర పరిస్థితులను అటుంచితే.. వరుణుడు కరుణ రైతులకు ఒకింత మేలు చేకూరుస్తోంది. మంగళవారం రాత్రి 13 మండలాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఆళ్లగడ్డలో 79 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా మిడుతూరులో 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 126 మి.మీ కాగా.. మొదటి 11 రోజులకే 122.6 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. జూన్ నెలలో 13 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో 11 శాతం, ఆగస్టులో 1 శాతం అధిక వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల వరి, మొక్కజొన్న.. ఇతర పంటలు భారీగా నీట మునిగాయి. ఇప్పటి వరకు కురిసిన వర్షం పంటలకు మేలు చేసినా.. ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందేనని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జూన్ నెల మొదటి పక్షంలో వేసిన వేరుశెనగ పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. మరో పది రోజుల్లో పెరకడానికి రైతులు సిద్ధమవుతున్నారు. అయితే వర్షాలు తెరిపివ్వకపోతే భూమిలోని కాయలు తిరిగి మొలకెత్తే ప్రమాదం లేకపోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కర్నూలులో భారీ వర్షం: నగరంలో బుధవారం భారీ వర్షం కురవడంతో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. మురుగునీటి కాల్వలు పొంగి పొర్లాయి. ఈ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పలు ఉత్పత్తులు నీట మునగడంతో రైతులకు నష్టం వాటిల్లింది. వెల్దుర్తి, డోన్, కల్లూరు తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది.
పగలు భగభగ.. సాయంత్రం చిటపట
Published Thu, Sep 12 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement