జిల్లా తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకూ గుంపుల గొడవలు ఎక్కువైపోతున్నాయి.
తెలుగు తమ్ముళ్ల గిల్లి కజ్జాలు భలే ఆసక్తి రేపుతున్నాయి.. తెలంగాణవాదం వినిపించడంలో పార్టీ అధినాయకత్వం అనుసరించిన ‘రెండు కళ్ల’ సిద్ధాంతంతో జిల్లాలో టీడీపీది రెండు కళ్లూ లొట్టపోయిన పరిస్థితి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఉన్న మూడు సీట్లలో ఎన్ని కాపాడుకుంటుందో సమాధానం దొరకని ప్రశ్న. వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి కుంపట్లు రాజేస్తున్న ఓ సీనియర్ నేత తీరు విమర్శల పాలవుతోంది. ఇక ఆయనతో ఏగలేమంటూ కొందరు అధినేతకు ఫిర్యాదు కూడా చేశారని సమాచారం..!!
- సాక్షిప్రతినిధి, నల్లగొండ
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకూ గుంపుల గొడవలు ఎక్కువైపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అసమ్మతి రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఒకటీ రెండు నియోజకవర్గాలు మినహా ప్రతి చోటా గ్రూపులు పనిచేస్తున్నాయి. జిల్లాలో పార్టీ పరిస్థితిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎవరికి వారు తమకే టికెట్, తామే పోటీ చేసేది అన్నంత స్థాయిలో వ్యవహరించడం వల్లే గొడవలు పెరిగిపోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని జిల్లా పార్టీపై పట్టు బిగించేందుకు ఓ సీనియర్ నాయకుడు శతావిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల భువనగిరి నియోజకవర్గంలో కొందరు మండల స్థాయి నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ‘భువనగిరి టీడీపీ నాయకురాలు, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి కావాలనే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని పనిగట్టుకుని సస్పెండ్ చేయిస్తున్నారు..’ అని ఆ పార్టీలోని ఓ బీసీ నేత వ్యాఖ్యానించారు. కానీ, పార్టీలోని ఓ సీనియర్ నాయకుడు మరోవర్గాన్ని తయారు చేయడంలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యేకు చికాకు పుట్టిస్తున్నారని చెబుతున్నారు. ‘ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కావాలనే ఆశ ఉంది. కానీ, మనస్థాయి కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఏ స్థానం అన్నది గమనిం చాలి. మాధవరెడ్డి బ్యాక్‌గ్రౌండ్, మూడుమార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన నాయకురాలిని కాదని, వేరేవారికి టి కెట్ ఇస్తారా..? అది తెలిసి కూడా అవాకులు చవాకులు పేలితే ఎలా..’ అని భువనగిరి నాయకుల సస్పెన్షన్ వివాదంపై పార్టీకి చెందిన మరో నాయకుడు ప్రతిస్పందించారు. అయితే, భువనగిరి ఉదంతం తాజా ఉదాహరణగా నిలుస్తున్నా, నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ తదితర నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు స్పష్టంగానే కనిపిస్తోంది.
హుజూర్‌నగర్ ఇన్‌చార్జ్ వంగాల స్వామిగౌడ్‌ను వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని మండలాల నుంచి పార్టీ నాయకులు అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇక, కోదాడలో ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఈసారి టికెట్ ఆశిస్తున్న బొల్లం మల్లయ్యయాదవ్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మునుగోడులో రెండువర్గాలు బయటకు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా, లోన కత్తులు దూస్తూనే ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో ఇన్‌చార్జ్ తేరా చిన్నపురెడ్డికి పొగబెట్టే పని కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఓ సీనియర్ నాయకుడి కనుసన్నల్లో, ఆయన ప్రోద్భలంతోనే జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తమ తమ నియోజకవర్గాల్లో లేని అసమ్మతిని రాజేస్తూ, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న సదరు నాయకుని తీరుపై కొందరు సీనియర్లు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం. పార్టీలో పెత్తనం కోసం, అంతా తన కనుసన్నల్లోనే నడవాలని, అంతా తన వర్గీయులే ఉండాలని ఆ సీనియర్ చేష్టలతో పార్టీ అవకాశాలు దెబ్బతింటాయని, ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని డిమాండ్ చేస్తూ పార్టీలోని మరో సీనియర్ బాబుకు ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాల సమాచారం.