ఫ్యాక్షన్‌కు చెక్! | for faction check! | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షన్‌కు చెక్!

Published Sat, Dec 28 2013 2:59 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

for faction check!

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేతలను కట్టడి చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో ప్రజాప్రతినిధులు కాని వారికి గన్‌మన్ సౌకర్యాన్ని ఉపసంహరించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీకి చెందిన కొందరు నేతలు గన్‌మెన్లను అడ్డుపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదే కారణాన్ని చూపి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మినహా ఇతర నేతలు ఎవరికీ గన్‌మన్ సౌకర్యం కల్పించకూడదని నిర్ణయించారు. ప్రజాప్రతినిధులకు కేటాయించిన గన్‌మన్‌లను దుర్వినియోగం చేస్తే.. వారికి సైతం భద్రతను ఉపసంహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ ప్రసాదరావుకు శుక్రవారం ఎస్పీ సెంథిల్‌కుమార్ నివేదిక పంపడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.
 
  ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లాలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు వర్గ కక్షలు పురివిప్పుతాయి. శాంతిభద్రతల పరిరక్షణకు సవాల్‌గా మారుతాయి. ఇది పసిగట్టిన ఎస్‌పీ సెంథిల్‌కుమార్ ఫ్యాక్షనిస్టుల కదలికపై డేగకన్ను వేశారు. క్రియాశీలకంగా ఉన్న ఫ్యాక్షనిస్టులను గుర్తించి.. పోలీసు పద్ధతుల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. నేరచరితులు, వివిధ కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లకూ ఇదే పద్ధతుల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు ప్రజాప్రతినిధులు, కొందరు కాంగ్రెస్, టీడీపీ నేతలు గన్‌మన్‌లను అడ్డుపెట్టుకుని సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు కేటాయించిన గన్‌మెన్‌లను వారి అనుచరులు తీసుకెళ్లి.. వారిని అడ్డంపెట్టుకుని పంచాయతీలు చేస్తున్నట్లు నిర్ధారించాయి.
 
 ఆ మేరకు పక్కా ఆధారాలను కూడా సేకరించాయి. ఆ నేతలకు తక్షణం గన్‌మన్‌లను ఉపసంహరించకపోతే ఎన్నికల్లో శాంతిభద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. నిఘా వర్గాల నివేదిక మేరకు గన్‌మన్‌లను దుర్వినియోగం చేస్తోన్న ప్రజాప్రతినిధులకు ఆ సౌకర్యాన్ని ఉపసంహరించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు కాని వారికి గన్‌నన్‌లను తక్షణమే ఉపసంహరించాలని భావిస్తున్నారు. ఆ మేరకు డీజీపీ ప్రసాదరావుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ శుక్రవారం నివేదిక పంపారు.
 
 ఇద్దరు ఎమ్మెల్యేలకూ గన్‌మన్లు కట్!
 జిల్లాలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు గన్‌మెన్ సౌకర్యం కల్పించారు. ప్రజాప్రతినిధుల కోటాలో గన్‌మెన్‌లు పొందిన ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తనకు కేటాయించిన గన్‌మెన్‌లను దుర్వినియోగం చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఆ ఎమ్మెల్యే సమీప బంధువులు, అనుచరులు గన్‌మెన్‌లను అడ్డం పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారని నిర్ధారిస్తున్నాయి. మరో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సైతం ఇదే పద్ధతుల్లో పయనిస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. వారిద్దరికీ గన్‌మెన్ సౌకర్యాన్ని ఉపసంహరించాలని ప్రతిపాదించాయి.
 
  అధిక శాతం ప్రజాప్రతినిధులకు ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి గన్‌మెన్‌లుగా వ్యవహరిస్తున్నారని.. ఇది సమస్యలకు దారితీస్తోందని నిఘా విభాగం పేర్కొంది. ప్రజాప్రతినిధులకు కేటాయించిన గన్‌మెన్‌లను ప్రతి మూడు నెలలకు ఒక సారి నిక్కచ్చిగా మార్పు చేయాలని సూచించాయి. నిఘా వర్గాలు చేసిన ప్రతిపాదనల్లో గన్‌మెన్‌లను మార్చే ప్రక్రియను తక్షణమే అమలుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లను ఉపసంహరించేందుకు అనుమతించాలని డీజీపీ ప్రసాదరావుకు నివేదిక పంపారు.
 
 రాజకీయనేతలకు ఉపసంహరణ
 ప్రజాప్రతినిధి కాని నేతల కోటాలో కాంగ్రెస్ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, రాగే పరశురాం, బోగాతి నారాయణరెడ్డి, వజ్జల మల్లికార్జున.. టీడీపీ నేతలు కందిగోపుల మురళి, పయ్యావుల శ్రీనివాసులు తదితరులకు గన్‌మెన్ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో అధిక శాతం నేతలకు గన్‌మన్ సౌకర్యం కల్పించవద్దని ఆదిలోనే నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులకు నివేదించాయి. దాంతో.. అప్పట్లోనే వారికి గన్‌మన్‌లు కేటాయించేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. కానీ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి గన్‌మన్‌లను కేటాయింపజేసుకోవడంలో ఆ నేతలు సఫలీకృతులయ్యారు. గన్‌మన్ సౌకర్యం పొందిన కొందరు నేతలు వారిని అడ్డంపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధియేతరులైన నేతలకు తక్షణమే గన్‌మెన్‌లను ఉపసంహరించాలని నిఘా వర్గాలు సూచించాయి. నిఘా వర్గాలు అభ్యంతరం చెప్పడం వల్ల గతంలో జిల్లాలో అధిక శాతం ఫ్యాక్షనిస్టులకు ప్రభుత్వం గన్‌మన్‌లను కేటాయించలేదు.
 
 ఈ నేపథ్యంలో బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో గన్ లెసైన్సు ఉన్న వారిని నెల సరి వేతనంపై ఫ్యాక్షనిస్టులు, కొందరు రాజకీయ నేతలు ప్రైవేటు గన్‌మన్‌లుగా నియమించుకున్నారు. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు గన్‌మెన్‌లను నియమించుకుని.. ప్రైవేటు సైన్యాన్ని కొందరు నేతలు నడపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తక్షణమే ప్రైవేటు గన్‌మన్‌లను జిల్లా సరిహద్దులు దాటించాలని కూడా ప్రతిపాదించగా దీని అమలుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధి కాని వారికి కేటాయించిన గన్‌మెన్‌లను నెలాఖరులోగా ఉపసంహరించుకోనున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement