Sidhal kumar
-
చూశారనే చంపేశాడు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : మడకశిరలో ఈ నెల మూడో తేదీన సంచలనం రేకెత్తించిన చిన్నారుల హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడు నరసింహప్పను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.74 వేలు విలువ చేసే 26 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చిన్నారులకు స్వయానా బంధువు కావడం గమనార్హం. తాను దొంగతనం చేస్తుండగా చిన్నారులు చూశారనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు. మడకశిరలోని తలారి వీధిలో టీచర్ ఆనందప్ప కుటుంబం నివాసం ఉంటోంది. ఆనందప్పకు బంధువైన నీలకంఠాపురానికి చెందిన ఎన్.నరసింహప్ప తరచూ వీరి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. వివాహితుడైన ఇతడికి కర్ణాటక రాష్ర్టం పావగడ తాలూకాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన ఆర్థిక అవసరాల కోసం ప్రియురాలి ఆభరణాలను ఓ నగల దుకాణంలో తాకట్టుపెట్టాడు. అయితే ఇటీవల కాలంలో నగలు విడిపించాలని ఆమె నుంచి ఒత్తిడి పెరిగింది. ఏమి చేయాలో పాలుపోని నరసింహప్ప దొంగత నమే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ నెల మూడో తేదీన టీచర్ దంపతులు ఆనందప్ప, సాకమ్మ స్కూలుకు వెళ్లాక వీరి ఇంటికి వచ్చాడు. పిల్లలు మంజువాణి (13), రంగనాథ్ (8)లు ఇంటికి గడియ పెట్టి సమీపంలోని దుకాణానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నరసింహప్ప సరిగ్గా 11.30 గంటల సమయంలో ఆ ఇంట్లోకి ప్రవే శించాడు. అందుబాటులో ఉన్న తాళాలతో బీరువా తెరిచి రూ.74 వేలు విలువ చేసే బంగారు గొలుసు, డాలర్, ఉంగరం జేబులో వేసుకున్నాడు. ఇంతలో రంగనాథ్ ఇంట్లోకి వచ్చి చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను గమనించాడు. అక్కడే ఉన్న నరసింహప్ప.. ఆ బాలుడు తన గుట్టు ఎక్కడ విప్పుతాడోనని టవల్‌తో గొంతు బిగించి చంపేశాడు. కాసేపటి తర్వాత తమ్ముడిని పిలుస్తూ బయటి నుంచి మంజువాణి లోపలికి వచ్చింది. ఆ బాలిక ను కూడా నిర్దాక్షిణ్యంగా చున్నీతో గొంతు బిగించి హతమార్చి.. చోరీ చేసిన సొమ్ముతో ఉడాయించాడు. అభం శుభం తెలియని చిన్నారుల హత్య సంచలనం రేపింది. వారం వరకు చిన్న క్లూ కూడా లభించక పోవడంతో పోలీసుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసును ఎస్పీ సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయించారు. అదనపు ఎస్పీ టి.రామప్రసాదరావు పర్యవేక్షణలో పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, మడకశిర, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు నాగరాజు, హరినాథ్, ఎస్ఐలు ధరణి కిశోర్, సద్గురుడు, ఆంజనేయులు, ఏఎస్ఐ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేపట్టింది. బుధవారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మడకశిర కోర్టులో హాజరు పరిచారు. మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో నిందితున్ని హిందూపురం సబ్‌జైలుకు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఎస్పీ దూకుడు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సెంథిల్‌కుమార్ దూకుడు మరింత పెంచారు. ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరి వ్యక్తిగత పనితీరును అంచనా వేస్తున్నారు. పనితీరులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఎప్పటికప్పుడు చార్జ్‌మెమోలు జారీ చేస్తూ దారిలో పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు అదే రీతిలో మెమోలు జారీ చేశారు. ప్రాదేశిక ఎన్నికల్లోనూ పనితీరును అంచనా వేసి.. నడత మార్చుకోని అధికారులపై వేటు వేసి సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా.. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అనంతపురం కార్పొరేషన్ సహా 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటే ఎస్పీ సెంథిల్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లా చరిత్రలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం, తాడిపత్రిలో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. బందోబస్తును నిర్వహిస్తోన్న అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆ సంఘటనలు చోటుచేసుకున్నాయనే నిర్ధారణకు వచ్చిన ఎస్పీ.. ఆ అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనంతపురంలోని ముగ్గురు సీఐలు, తాడిపత్రిలో ఓ ఉన్నతాధికారి, మరో ఎస్ఐకి మెమోలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనంతపురం, తాడిపత్రిలో ఇద్దరు అధికారులు ఓ పార్టీకి మద్దతుగా పనిచేసినట్లు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంపై ఎస్పీ ప్రత్యేకంగా విచారణ నిర్వహిస్తున్నారు. విచారణలో తేలితే ఆ ఇద్దరు అధికారులను ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌లోగా విధుల నుంచి తప్పించి.. వీఆర్‌కు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు దన్నుగా నిలిచే అధికారులకు ఇదో హెచ్చరికగా పనిచేస్తుందని ఎస్పీ భావిస్తున్నారు. ఈ నెల 6న తొలి విడత, 11న మలి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ బందోబస్తులో కూడా అధికారుల పనితీరుపై ప్రత్యేకంగా నిఘా వేయనున్నారు. ప్రాదేశిక పోలింగ్‌లో తోకజాడించే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా, సార్వత్రిక ఎన్నికల నాటికి పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తేనే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్వేచ్ఛాయుత.. శాంతియుత వాతావరణంలో నిర్వహించవచ్చు. ఓటర్లలో ధైర్యం నింపవచ్చు. ఇది ఓటింగ్ శాతం పెరగడానికి దారితీస్తుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఇది నిరూపితమైంది కూడా. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడాలన్నది ఎస్పీ సెంథిల్‌కుమార్ లక్ష్యంగా తెలుస్తోంది. -
నిఘా పెంచుదాం
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ‘రానున్న రోజులు ఎంతో కష్టతరమైనవి.. అత్యంత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది.. ఇప్పటి నుంచే నిఘా తీవ్రతరం చేయండి.. ఏ చిన్న విషయాన్నీ తేలికగా తీసుకోకండి.. గ్రామాలపై దృష్టి సారించండి..’ అంటూ ఎస్పీ సెంథిల్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జిల్లాలోని సీఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత గతంలో మహిళలపై జరిగిన ఘటనలు, అకృత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, కిడ్నాప్‌లు, దోపిడీ కేసులు, తదితరాలతో పాటు సర్కిల్స్ వారీగా అధికారుల పని తీరు, వారికి ని ర్దేశించిన లక్ష్యాలపై సమీక్ష జరిపారు. ఆయా కేసుల్లో నిందితులను అరెస్టు చేశారా? లేదా? వాటి పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు అడ్డుకట్ట వేయాలని సీఐలను ఆదేశించారు. చోరీలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు చోరీ కేసుల్లో రికవరీలపై దృష్టి సారించాలని, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా పెంచాలని, వాహనాల తనిఖీలు, నాకాబందీ, ఆకస్మిక తనిఖీలు చేపట్డడం, అసాంఘిక కార్యకలాపాల స్థావరాలపై దాడులు ముమ్మరం చేయడం వంటివి నిర్వహించాలన్నారు. పలు కేసుల్లో నాన్‌బెయిలబుల్(ఎన్బీడబ్ల్యూ)ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పోలీసు స్టేషన్లలోని రిసెప్షన్ కేంద్రాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఉండాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించి, వారి బాధలను విని చట్టపర చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల మండలాల్లో వారానికోసారి నిర్వహించే ప్రజల చెంతకు పోలీసు కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో అవినీతి, అక్రమాలపై సమాచారం సేకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ప్రజా సహకారం’ విభాగం ఫోన్ నంబర్ 9553707070, డీ జీపీ కంట్రోల్లోని టోల్ ఫ్రీ నంబర్ డయల్ 100పై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎన్.శ్వేత, సీఐలు పాల్గొన్నారు. -
ఘనతంత్రం
ఆదివారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలు అంబరాన్ని తాకాయి. రొద్దంలో 1200 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని పోలీసుపరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ సేవలకు గాను 240 మంది అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. స్టాల్లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ప్రతిమ ఆకట్టుకుంది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం వందేమాతరం, జనగణమన గీతాలాపన గావించారు. తరువాత డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు సాంబమూర్తి, గంగిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. 9.15 నుంచి 9.40 గంటల వరకు తన సందేశాన్ని వినిపించారు. వివిధ పథకాల ప్రగతి తెలియజేశారు. దేశభక్తి చాటుతూ సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించడానికి అందరం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... ఈ ఏడాది ఖరీఫ్, రబీలో 10.89 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. వర్షాభావం వల్ల వేరుశనగ దిగుబడి తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 59 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేందుకు వీలుగా పంట నష్టం అంచనా వేసి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో పంట రుణాల కింద రూ.3,127 కోట్లకు గాను రూ.2,896 కోట్లు ఇచ్చాం. తద్వారా 6.40 లక్షల మందికి లబ్ధిచేకూర్చాం. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి వంద శాతం వడ్డీరాయితీ పొందాలి. 2012లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.648.88 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైంది. అందులో తొలివిడతగా రూ.407 కోట్లు విడుదల చేయగా... రూ.390 కోట్లు 3.79 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. రెండో విడతగా వారంలోగా 2.09 లక్షల మంది రైతులకు రూ.221 కోట్లు పంపిణీ చేస్తాం. అలాగే 2011కు సంబంధించి 67,010 మందికి రూ.42.27 కోట్లు వారంలోగా ఇస్తాం. జిల్లా రైతాంగాన్ని శాశ్వతంగా ఆదుకోవాలనే ఆశయంతో ఐసీఏఆర్ సిఫారసులో రూ.7,676 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది రూ.100 కోట్లతో 14 గ్రామాల్లో ప్రాజెక్టు అమలు చేస్తాం. వేరుశనగ స్థానంలో కినోవా పంటను ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తాం. ఏపీఎంఐపీ ద్వారా రూ.68.34 కోట్లతో 11 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందజేస్తాం. ఉద్యానశాఖ ద్వారా రూ.12 కోట్లు ఖర్చు చేసి పండ్లతోటల రైతులను ఆదుకుంటాం. పశుక్రాంతి పథకం కింద 25 శాతం రాయితీతో 238 మినీ డెయిరీలు, ఆరు మోడల్ డెయిరీల ఏర్పాటు, సునందిని పథకం కింద రూ.1.20 కోట్లతో దూడల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. జలయజ్ఞం కింద రూ.6,850 కోట్లతో చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) మొదటి దశపూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.68 టీఎంసీల నీళ్లు ఇచ్చాం. అలాగే పీఏబీఆర్‌కు 0.30 టీ ఎంసీలు, గుంతకల్లు ప్రాంతంలోని మూడు చెరువులకు 0.60 టీఎంసీలు ఇచ్చాం. 10వ పంప్‌హౌస్ నుం చి పేరూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నాం. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా 49 చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాల కింద 15 సమగ్ర మంచినీటి పథకాల పను లు వేగంగా సాగుతున్నాయి. కొత్తగా రూ.34.71 కోట్లతో 210 గ్రామాలకు నీటి సదుపాయం కల్పిస్తున్నాం. త్వరలో కొత్తగా 600 అంగన్వాడీ కార్యకర్తల నియామకాలు చేపడతాం ఏడో విడత భూపంపిణీలో 6,253 మందికి 11,088 ఎకరాలు పంపిణీ చేశాం. మొత్తమ్మీద ఇప్పటివరకు 34,750 మందికి 79,027 ఎకరాలు పంపిణీ చేశాం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలోనే మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆర్వీఎం ద్వారా 1,202 పాఠశాలల్లో రూ.147 కోట్లతో 2,487 అదనపు గదుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. తొలివిడత పల్స్‌పోలియో 102 శాతం విజయవం తం చేశాం. త్వరలో రెండో విడత కార్యక్రమం ఉం టుంది. ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు పీసీ-పీఎస్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. బీఆర్జీఎఫ్ కింద రూ.37.22 కోట్లతో 1,833 పనులు చేపడతాం. 178 రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.151 కోట్లు కేటాయించాం. రూ.23.74 కోట్లతో 1,003 గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రూ.4.84 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 28.86 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. గణతంత్ర వేడుకల్లో అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కొట్రికె మధుసూదన్‌గుప్తా, పల్లె రఘునాథ్‌రెడ్డితో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
దూకుడుకు కళ్లెం
‘ఏం బావా.. ఏంటి కథ! పెళ్లి కొడుకులా తయారయ్యావ్’ అంటూ మంత్రి జుట్టును సరిచేస్తూ పలకరించారు ఓ సీఐ. ‘అదేం లేదులేరా..’ అంటూ స్పందించాడు మంత్రి. ఇంతలోనే ఆ సీఐ అందుకుంటూ ‘బావా మొన్న ఒకటి అడిగా.. గుర్తుందా’ అన్నారు. ‘ఆ.. ఎందుకు గుర్తులేదురా! పోస్టింగే కదా?! నీకుగాకపోతే ఎవరికి ఇప్పిస్తారా’ అంటూ హామీ ఇచ్చేశారు ఆ మంత్రి. ఇదంతా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే జరిగింది. మంత్రి సిఫారసుతో ఓ కీలక ప్రాంతంలో సీఐ పోస్టింగ్‌ను దక్కించుకున్నారు. ఆ మంత్రి పేరు చెప్పుకొని సెటిల్మెంట్లు చేయడంలో ఆరితేరిపోయారు. మట్కా బీటర్లు మొదలుకుని వైన్ షాపుల యజమానుల దాకా అందరి నుంచి మామూళ్లు గుంజడంలో మేటిగా నిలిచారు. దారితప్పిన ఆ సీఐకి ఎస్పీ సెంథిల్‌కుమార్ నాలుగు మెమోలు ఇచ్చారు. అయినా తీరు మారలేదు. చివరకు ఎస్పీ నిలదీశారు. తన వెనుక మంత్రి ఉన్నారన్న ధైర్యంతో ఏకంగా డీఐజీ, ఎస్పీపైనే ఆ సీఐ ఎదురుతిరిగారు. ఇలాంటి పోలీస్ అధికారులకు ‘గుణపాఠం’ నేర్పడానికి డీఐజీ, ఎస్పీ కసరత్తు ప్రారంభించారు. అందుకోసం వారు ఏమి చేస్తున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే! ఖద్దరు దన్నుతో ఖాకీవనంలో వేళ్లూనుకుపోయిన గంజాయి మొక్కలను ఏరిపారేయడానికి డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ నడుం బిగించారు. దీంతో జిల్లా పోలీసు శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నలుగురు సీఐలు సినీఫక్కీలో సెటిల్మెంట్లు చేస్తుండగా.. ఐదుగురు సీఐలు ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారు. ఒక సీఐ నకిలీ కరెన్సీ చలామణి ముఠాతో చేతులు కలిపారు. వారిని చూసుకుని కొందరు ఎస్‌ఐలూ అదే బాట పట్టారు. ఇద్దరు ఎస్ఐలు ఎర్రచందనం స్మగ్లర్లుగా రూపాంతరం చెందగా.. ఎనిమిది మంది ఇసుక స్మగ్లర్లుగా మారారు. మరో నలుగురు సెటిల్మెంట్లలో మునిగి తేలుతున్నారు. వీరంతా ఖద్దరు దన్నుతో పోస్టింగ్‌లు పొందిన వారే. మంత్రులు, అధికార, విపక్ష ఎమ్మెల్యేల సిఫారసులతో అత్యంత ప్రధానమైన కేంద్రాల్లో పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. ఫలితంగా నిజాయతీతో పనిచేసే పోలీసు అధికారులకు సరైన ప్రాంతాల్లో పోస్టింగ్‌లు దక్కలేదనే భావన ఆ శాఖలోనే బలంగా వ్యక్తమవుతోంది. కొందరు సీఐలు, ఎస్ఐలే దారి తప్పడంతో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలే దుస్థితి దాపురించింది. ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ కొరడా ఝళిపిస్తున్నారు. దారితప్పిన 14 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలకు మెమోలు ఇచ్చారు. ఇందులో ఏడెనిమిది మెమోలు తీసుకున్న సీఐలు, ఎస్ఐలు కూడా ఉండటం గమనార్హం. ఖద్దరు దన్నుతో ఆ సీఐలు, ఎస్ఐలు లెక్క చేయకపోవడం వల్లే ఉన్నతాధికారులు పదే పదే మెమోలు జారీ చేసినట్లు పోలీసుశాఖ వర్గాలు వెల్లడించాయి. మెమోలను తేలిగ్గా తీసుకుంటుండటాన్ని డీఐజీ, ఎస్పీలు తీవ్రంగా పరిగణించారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడం ద్వారా ఆ సీఐలు, ఎస్ఐల్లో మార్పుతేవాలని భావించారు. అందులో భాగంగా విస్తృతంగా పోలీసుస్టేషన్లలో తనిఖీలు చేపడుతున్నారు. దారితప్పిన వారు తీరుమార్చుకోవాలని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘ప్రజల చెంతకు పోలీసు’ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. ఇది కొంత సానుకూల ఫలితాలను ఇస్తోంది. కొందరు సీఐలు, ఎస్ఐలు తీరుమార్చుకున్నారు. కానీ.. మరి కొందరు మాత్రం ఖాతరు చేయడం లేదు. జిల్లాలో వెకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న 19 మంది సీఐలు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. 16 మంది ఎస్ఐలు వీఆర్‌లో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేసిన సీఐలను సరిహద్దులు దాటించాల్సి ఉంది. ఒకే నియోజకవర్గంలో పాతుకుపోయిన ఎస్ఐలకు కూడా స్థానచలనం కల్పించాల్సి వుంది. ఇదంతా ఎన్నికల సంఘం కనుసన్నల్లో జరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకుని మాట వినని కొందరు సీఐలు, ఎస్ఐల పని పట్టాలని డీఐజీ, ఎస్పీ నిర్ణయించారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వారికి బదిలీలతో గుణపాఠం చెప్పి.. వీఆర్‌లో ఉన్న వారందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. సీఐలకు స్థానచలనం కల్పిస్తూ.. ఆరోపణలున్న కొందరు సీఐలపై వేటువేస్తూ డీఐజీ బాలకృష్ణ రాయలసీమ ఐజీ రాజీవ్త్రన్కు నివేదిక పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 55 మంది ఎస్ఐలకు కూడా స్థానచలనం కల్పించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్‌తో కలిసి డీఐజీ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆరోపణలున్న ఎస్ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిజాయతీపరులైన అధికారులకు అత్యంత కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిశ్చయించారు. డీఐజీ, ఎస్పీ దూకుడుగా ముందుకెళ్తోండటంతో పోలీసు శాఖలో కలకలం రేగుతోంది. -
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్
పెద్దపప్పూరు, న్యూస్‌లైన్ : వైశాల్యంలో అనంతపురం జిల్లా పెద్దదని, సరిహద్దు గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలను తన దృష్టికి తీసుకొని రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక్క రోజు తానే ఏదో ఒక మండల కేంద్రానికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. శనివారం పెద్దపప్పూరు మండల కేంద్రంలోని ముచ్చుకోట పోలీస్‌స్టేషన్‌లో ప్రజల చెంతకే పోలీసులు అనే నినాదంతో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చాలా చిన్న సమస్యలు కూడా పరిష్కరించకపోతే అవి జఠిలంగా మారే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ హెల్ప్‌లైన్-100కి రోజూ దాదాపు 70 వరకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికి ఫ్యాక్షనిస్టులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే చోట బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, బుక్కరాయసముద్రం, పామిడి మండలాలకు చెందిన 100 మందికి పైగా అర్జీలు ఇచ్చారు. రెవెన్యూ సమస్యలపైనే ఎక్కువ అర్జీలు రావడం విశేషం. ప్రజలు ఇచ్చిన అర్జీలను తహశీల్దార్ రమాదేవికి అప్పజెప్పారు. మరికొన్నింటిని సంబంధిత మండలాల ఎస్ఐలకు అప్పగించి, విచారణ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రమాదేవి, డీఎస్పీ నాగరాజు, సీఐలు లక్ష్మీనారాయణ, రాఘవన్, తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యల్లనూరు, పామిడి, పుట్లూరు ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఆ పోలీస్ వల్ల అనాథలయ్యాం
పెద్దపప్పూరు, న్యూస్‌లైన్ : ‘జమేదార్ వెంకటేశ్వర్లు మద్యం మత్తులో బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో 2013 సెప్టెంబర్‌లో చేనేత కార్మికుడైన నా భర్త చనిపోయాడు. నేను, నా పిల్లలు అనాథలయ్యాం. కుటుంబ పోషణ భారమైంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పోలీస్ అయినందున విచారణ కూడా చేయలేదు. ఆ పోలీస్ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది’ అంటూ చిన్నపప్పూరుకు చెందిన రాఘవేంద్రమ్మ ఎస్పీ సెంథిల్‌కుమార్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యింది. ముచ్చుకోట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ‘ప్రజల చెంతకే పోలీసులు’ అన్న నినాదంతో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆమె తన సమస్యను విన్నవించారు. జమేదార్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన రాఘవేంద్రమ్మకు ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం వచ్చేలా చూస్తామని తహశీల్దార్ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, సీఐలు లక్ష్మీనారాయణ, రాఘవన్ తదితరులు హాజరయ్యారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, బుక్కరాయసముద్రం, పామిడి మండలాలకు చెందిన ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు బారులుతీరారు. ఇందులో ఎక్కువగా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు రావడం గమనార్హం. అన్ని సమస్యలపైనా వందకు పైగా అర్జీలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితం నా భర్త దివాకర్‌రెడ్డి చనిపోయారు. ఆస్తి ఇవ్వకుండా ఆత్తామామలు ఇబ్బందులు పెడుతున్నారు. మేమెలా బతకాలి.. మీరే న్యాయం చేయండి. - చంద్రావతి, మేడిమాకులపల్లి, పెద్దవడుగూరు మండలం ఎస్పీ స్పందన : విచారణ జరిపి సమస్యను పరిష్కరించాల్సిందిగా పెద్దవడుగూరు ఎస్ఐ శివశంకర్‌రెడ్డికి సూచించారు. సాగు చేసుకున్న సపోట చెట్లను 2011లో నరికివేశారు. కేసు నమోదైనా ఇంత వరకు న్యాయం జరగలేదు. - శంకర్‌రెడ్డి, పెద్దెక్కలూరు, పెద్దపప్పూరు మండలం ఎస్పీ స్పందన : విచారణ జరపాలని పెద్దపప్పూరు ఎస్ఐ రాజును ఆదేశించారు. నా భూమిలో అక్రమంగా గనుల తవ్వకాలు చేపడుతున్నారు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు, న్యాయం చేయండి. - నర సింహులు, శింగనగుట్టపల్లిగ్రామం, పెద్దపప్పూరు మండలం తహశీల్దార్ రమాదేవి స్పందన : ముందుగా పొలం సర్వేకి దరఖాస్తు చేసుకోండి. గనుల తవ్వకాలు నిర్వహిస్తుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పెన్నా ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోండి. - చింతా పురుషోత్తం, చితంబరస్వామి కాలనీ, పెద్దపప్పూరు తహశీల్దార్ రమాదేవి : ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయించాం. ఆక్రమణదారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. -
సమస్య చెప్పుకోండి
ముఠా కక్ష్యలు, హత్యలు, దాడులు.. ప్రతి దాడులకు పెట్టింది పేరు తాడిపత్రి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల ప్రోత్సాహంతో ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో ఆధిపత్య పోరు సాగుతోంది. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బ తీయడానికి తోటల్లోని చెట్లను నరికివేయడం ఇక్కడ పరిపాటి. తాజాగా ఎర్ర చందనం అక్రమ రవాణా, ఇసుక మాఫియా ఈ ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి ప్రాంతం నుంచే తొలిసారిగా ‘ప్రజా దర్బార్’కు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. తాడిపత్రి సబ్ డివిజన్లోని పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్లో ప్రజల నుంచి స్వయంగా ఆయనే ఫిర్యాదులు స్వీకరిస్తారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఫిర్యాదు చేస్తే.. బాధితుల భద్రతపై పోలీసులు ఇచ్చే భరోసాపైనే ఈ కార్యక్రమం హిట్టా.. పట్టా అనేది ఆధారపడి ఉంది. తాడిపత్రి, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమస్యాత్మక ప్రాంతాలపై పట్టు బిగించేందుకు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించాలని నిర్ణయించుకున్న ఆయన, ఈ కార్యక్రమాన్ని తొలుత తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రత్యేక కారణాలే ఉన్నాయి. 2013 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించిన సెంథిల్‌కు మొదట తాడిపత్రి ప్రాంతం వాసులే తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. నేరుగా ఫోన్ చేసి తమ దీనగాథలను వెల్లడించారు. మొదటి రోజే తాడిపత్రిలోని ఓ మద్యం సిండకేట్ కార్యాలయంలో పేకాట ఆడుతున్నారని, పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ అనంతపురానికి చెందిన ప్రత్యేక బృందంతో దాడులు చేయించి నిందితులను, పెద్ద మొత్తంలో నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డీఎస్పీ, సీఐలను మందలించి చార్జ్‌మెమోలు కూడా ఇచ్చారు. ఇక అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని, బాధితుల ఫిర్యాదులు స్వీకరించడం లేదని పోలీసు టోల్‌ఫ్రీ నంబర్లకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తులుగా మారడంతో ఇద్దరు సీఐలను కూడా ఎన్నికల కమిషన్ కొద్ది రోజుల పాటు పక్కన పెట్టింది. ఇటీవల పెద్దవడుగూరు సహకార సంఘాల ఎన్నికల్లో బరిలో ఉన్న గిరిజన మహిళపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేయడం.. దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఎస్పీ దృష్టికి తీసుకె ళ్లారు. ఇలాంటి దారుణాలు చాలానే ఉన్నాయి. ప్రత్యర్థుల చెట్లను నరికే సంస్కృతి కూడా అధికంగా ఉంది. తాజాగా పెన్నా, చిత్రావతి నదుల నుంచి రాయలసీమ జిల్లాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఇక్కడ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. పెద్ద ఎత్తున ఇసుక మాఫియా ఇక్కడ రాజ్యమేలుతోంది. నెలకు కనీనం 50 నుంచి 100 వాహనాలను సీజ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రచందనం రవాణాలో కూడా ఈ ప్రాంత నేతల అనుచరుల హస్తం ఉంది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. ఎర్రచందనం దుంగలను తోటల్లో, పరిశ్రమల్లో దాచి.. వీలు కుదిరినప్పుడు రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందన్న విమర్శలు ఉన్నాయి. పరోక్షంగా రాజకీయ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎస్పీ ఇక్కడి నుంచి ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. ప్రజలు ఫిర్యాదు చేస్తారా? ప్రజాదర్బార్‌లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సమస్యలపై గానీ, తమకు జరిగిన అన్యాయం గురించి గానీ ఫిర్యాదు చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి తెలుసు. అందుకే చాలా మంది ‘ప్రజాదర్బార్’పై ఎటూ చెప్పలేకపోతున్నారు. ఫిర్యాదు చేసిన బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. లేదంటే బాధితులపై రాజకీయ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు. గతంలోలా చేయరు కదా? ‘ప్రజాదర్బార్’ ఉంటుందన్న విషయం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు. దీంతో చాలా మందికి ఈ విషయం చేరకపోవచ్చు. అయినా ఎస్పీ నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు అభినందిస్తున్నారు. కానీ ఆచరణలో ఎలా ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఫిర్యాదులు తీసుకుని ‘ఇది మా పరిధిలోకి రాదు.. మేం చేయలేం.. కోర్టులను ఆశ్రయించండి’ అన్న సందర్భాలు ఉన్నాయి. ఎవరెవరు ఫిర్యాదు చేయొచ్చంటే.. పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలీసు ప్రజాదర్బార్ పేరుతో ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు సేకరిస్తారు. పెద్దపప్పూరు, తాడిపత్రి, తాడిపత్రి రూరల్, యాడికి, పెద్దవడుగూరు, పామిడి, పుట్లూరు, యల్లనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రజలు నేరుగా ఫిర్యాదులు అందజేయవచ్చని తాడిపత్రి డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు హాజరవుతారు. -
ఆపరేషన్ - 2014
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘ఆపరేషన్ - 2014’కు శ్రీకారం చుట్టారు. గత ఎస్పీ శ్యాంసుందర్ రద్దు చేసిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ)ను పునరుద్ధరించారు. విధి నిర్వహణలో నిజాయితీ, చిత్తుశుద్ధితో వ్యవహరించే యువ ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు ఎస్ఓజీలో స్థానం కల్పించారు. నియోజకవర్గాల వారీగా క్రియాశీలకంగా ఉన్న ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లు, నేరప్రవృత్తి కలిగిన వారి పేర్లతో కూడిన జాబితాను రూపొందించారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పనిలో పనిగా పోలీసు శాఖలో గాడితప్పిన సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను గుర్తించి, నివేదిక ఇచ్చే బాధ్యతను కూడా ఎస్ఓజీకే అప్పగించారు. ఎస్ఓజీని పునరుద్ధరిస్తూ ఎస్పీ సెంథిల్‌కుమార్ తీసుకున్న నిర్ణయం అటు అసాంఘిక శక్తుల్లోనూ.. ఇటు పోలీసు శాఖలోనూ ప్రకంపనలను రేపుతోంది. రాయలసీమలో ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. కానీ.. పదేళ్లుగా ఫ్యాక్షన్ కక్షలు తగ్గుముఖం పట్టాయి. వర్గ కక్షలతో సర్వం కోల్పోవడం, పిల్లలు చదువుకుని ఉన్నత స్థానానికి చేరడం వంటివి ఫ్యాక్షన్ కక్షల తీవ్రత తగ్గడానికి దారితీశాయని చెప్పవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు చెలరేగే అవకాశాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిఘా వర్గాల ద్వారా ఈ అంశాన్ని గుర్తించిన ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆపరేషన్- 2014కు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ప్రజాప్రతినిధులు కాని వారికి గన్మెన్లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ప్రైవేటు వ్యక్తులను గన్మెన్లుగా నియమించుకున్న నేతలకు.. తక్షణమే వారిని పంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఫ్యాక్షన్ నేపథ్యమున్న నేతలను ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఓజీని పున రుద్ధరిస్తూ ఎస్పీ తీసుకున్న నిర్ణయం అసాంఘిక శక్తుల్లో కలవరం రేపింది. విధి నిర్వహణలో నిజాయితీ, చిత్తుశుద్ధి, మంచి ట్రాక్ రికార్డు ఉన్న యువ ఎస్ఐలు, కానిస్టేబుళ్లను 20 మందిని గుర్తించిన ఎస్పీ.. వారితో ఎస్ఓజీని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇతర వర్గాల ద్వారా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించి.. క్రియాశీలకంగా ఉన్న ఫ్యాక్షనిస్టులను గుర్తించారు. తోక విప్పుతోన్న రౌడీషీటర్లను, నేరచరిత్ర కలిగిన నేతలను గుర్తించి... జాబితా రూపొందించారు. ఇటీవల ఉద్రిక్త వాతావరణం నెలకొన్న గ్రామాలనూ గుర్తించారు. అదే జాబితాను ఎస్ఓజీకి అప్పగించారు. తోక విప్పుతోన్న ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు రహస్య కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ఉద్రిక్త వాతావారణం ఏర్పడిన గ్రామాల్లో.. అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ, ధర్మవరం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయించారు. అసాంఘిక శక్తులు(ట్రబుల్ మేకర్స్)ను గుర్తించారు. ఆ జాబితాలో ఉన్న నేతలపై ప్రత్యేక నిఘా వేయించారు. ఎస్ఓజీ కార్యకలాపాలు పూర్తిగా ఎస్పీ కనుసన్నల్లోనే జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే గ్రామాల్లో పరిస్థితిని చక్కదిద్దడం ద్వారా.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించవచ్చునని ఎస్పీ భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతోనే కోడ్ అమల్లోకి వస్తుంది. ఆలోగా జిల్లాలో మూడేళ్లకు మించి పని చేసిన సీఐలను బదిలీ చేయనున్నారు. ఒకే ప్రాంతంలో పనిచేస్తోన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లను కూడా బదిలీ చేయనున్నారు. బదిలీల తర్వాత పోలీసు సిబ్బంది పనితీరుపై కూడా ఎస్‌ఓజీతో నిఘా వేయిస్తారు. ఏ పార్టీకైనా కొమ్ముకాస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఓజీ వేగంగా అడుగులు వేస్తోండటం అసాంఘిక శక్తుల్లో కలవరం రేపుతోంది. -
పుట్టపర్తి నుంచి బయలుదేరిన 10 నిమిషాల్లోనే ప్రమాదం
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : శనివారం తెల్లవారు జామున 3.20 నిమిషాలకు పుట్టపర్తి రైల్వే స్టేషన్‌ను దాటిన రైలు 10 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైందని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ డెరైక్టర్ శారదా అవధాని బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ఈ బృందం ఉదయమే ఘటన స్థలానికి చేరుకుని రీజనల్, జిల్లా బృందాలతో కలసి ప్రమాదానికి దారి తీసిన కారణాలపై పరిశీలన జరిపింది. బీ1 బోగీలో కొన్ని ఆధారాలను సేకరించిన బృందం.. పుట్టపర్తి నుంచి బయలుదేరిన 10 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైనట్లు గుర్తించింది. రైలు ప్రమాదం సమాచారం అందగానే కొత్తచెరువు పోలీసులు హైదారాబాద్ డీజీ కంట్రోల్ రూమ్‌కు విషయాన్ని చేరవేశారని ఎస్పీ సెంథిల్ కుమార్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల సమాచారంతో పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, అనంతపురం పోలీసు అధికారులు, ఆయా స్టేషన్ల పరిధిలోని సుమారు 500 మంది స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. స్పెషల్ పార్టీ బృందాలు క్షతగాత్రులతో పాటు మృతదేహాలను వెలికి తీయడంలో సేవలందించారని ఎస్పీ తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ఓ వైపు భద్రత కల్పిస్తూనే, మరో వైపు సేవా కార్యక్రమాల్లో పోలీసులు నిమగ్నమయ్యారన్నారు. -
తెల్లారిన బతుకులు
‘కేకలు.. ఆరుపులు.. కాపాడండంటూ ఆర్తనాదాలు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. టాయ్‌లెట్ వాకిలి తెరిచి బయటకు తొంగిచూస్తే పొగ గుప్పుమంది.. ఏదో జరగరానిది జరిగిందని భయపడుతూ అడుగు బయటకు పెట్టాను.. ఆలోచించడానికే సమయం లేదు.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ఇక్కడే సజీవ సమాధి ఖాయం.. వాకిలి తెరుచుకోలేదు.. తిరిగి టాయ్లెట్లోకి వెళ్లి కిటికీని గట్టిగా కాలితో నాలుగు తన్నులు తన్నాను.. అద్దం పగిలిపోయింది.. బోగీ లోపల మంటలు ఎగిసిపడుతూ మీదకొస్తున్నాయి.. అందరూ ఇటు రండంటూ గట్టిగా కేకలు వేశా.. అప్పటికే ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.. కిటికీలోంచి దూకేయండంటూ పురమాయించాను.. వేడిమి భరించడం వీలుకాక నేనూ బయటకు దూకేశాను’ అంటూ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శరణ్ బసవ బెంగళూరు - నాందేడ్ రైలు బోగీ దగ్ధమైన ఘటనను భయం భయంగా వివరించారు. ఈ ఘటనలో ఆయన తన భార్య, మామను మాత్రం కాపాడుకోలేకపోయాడు. సంఘటన స్థలం మరుభూమిగా మారింది. మృతదేహాలు ఒక్కోటి బయటకు తీస్తుంటే స్థానికుల ఒళ్లు జలదరించింది. దేవుడా.. ఇక ఆ బోగీలో మృతదేహాలు ఉండకూడదంటూ ప్రార్థించారు. కొత్తచెరువు/పుట్టపర్తిటౌన్, న్యూస్‌లైన్ : శనివారం తెల్లవారుజాము.. అప్పుడప్పుడే తొలి కోడి కూసింది.. రైతు కుటుంబాల వారు నిద్రలేస్తున్నారు. అంతలోనే రైలు బోగీ అంటుకుందన్న వార్తతో కొత్తచెరువు, పుట్టపర్తి వాసులు ఉలిక్కి పడ్డారు. పరుగు పరుగున సంఘటన స్థలానికి తరలివెళ్లారు. బోగీ మంటల్లో తగలబడుతూ కనిపించింది. ఎవరికి చేతనైంది వారు చేసి ప్రయాణికులను కాపాడటానికి ఉపక్రమించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులో బయలు దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1 ఏసీ బోగీ ఇక్కడ తగలబడిన సంఘటనలో 26 మంది మృతి చెందారని తెలియగానే జిల్లాలోని ప్రముఖులందరూ తరలివచ్చారు. కాసేపటికి రైల్వే అధికారులూ వచ్చారు. ఉదయం 11 గంటల సమయానికి ఆ రైలులో ప్రయాణించిన వారి బంధులు సైతం కొందరు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 26మంది మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రులను పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామసుబ్బారావు ఆధ్వర్యంలో సంఘటన స్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చే సి స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేయించారు. మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప, మంత్రి రఘువీరా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నేత హరికృష్ణ తదితరులు సంఘటన స్థలిని పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని కాలిపోయిన రైలు బోగీని పరిశీలించి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అనంతపురం నగరం నీలిమీ థియేటర్ సమీపంలోని డోర్ నెంబర్ 1-333 ఇంట్లో ఉంటున్న పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ కుమారుడు శ్రీనివాస్ (28), కోడలు (26) శ్రీలత బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. మంత్రాలయం వెళ్లాలనుకుని ఈ రైలులో బయలుదేరారు. ఇపుడు వారి ఆచూకీ తెలియడం లేదు. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వారి బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
ఫ్యాక్షన్‌కు చెక్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేతలను కట్టడి చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో ప్రజాప్రతినిధులు కాని వారికి గన్‌మన్ సౌకర్యాన్ని ఉపసంహరించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీకి చెందిన కొందరు నేతలు గన్మెన్లను అడ్డుపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదే కారణాన్ని చూపి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మినహా ఇతర నేతలు ఎవరికీ గన్‌మన్ సౌకర్యం కల్పించకూడదని నిర్ణయించారు. ప్రజాప్రతినిధులకు కేటాయించిన గన్మన్లను దుర్వినియోగం చేస్తే.. వారికి సైతం భద్రతను ఉపసంహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ ప్రసాదరావుకు శుక్రవారం ఎస్పీ సెంథిల్‌కుమార్ నివేదిక పంపడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లాలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు వర్గ కక్షలు పురివిప్పుతాయి. శాంతిభద్రతల పరిరక్షణకు సవాల్‌గా మారుతాయి. ఇది పసిగట్టిన ఎస్పీ సెంథిల్‌కుమార్ ఫ్యాక్షనిస్టుల కదలికపై డేగకన్ను వేశారు. క్రియాశీలకంగా ఉన్న ఫ్యాక్షనిస్టులను గుర్తించి.. పోలీసు పద్ధతుల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. నేరచరితులు, వివిధ కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లకూ ఇదే పద్ధతుల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు ప్రజాప్రతినిధులు, కొందరు కాంగ్రెస్, టీడీపీ నేతలు గన్మన్లను అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు కేటాయించిన గన్మెన్లను వారి అనుచరులు తీసుకెళ్లి.. వారిని అడ్డంపెట్టుకుని పంచాయతీలు చేస్తున్నట్లు నిర్ధారించాయి. ఆ మేరకు పక్కా ఆధారాలను కూడా సేకరించాయి. ఆ నేతలకు తక్షణం గన్మన్లను ఉపసంహరించకపోతే ఎన్నికల్లో శాంతిభద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. నిఘా వర్గాల నివేదిక మేరకు గన్మన్లను దుర్వినియోగం చేస్తోన్న ప్రజాప్రతినిధులకు ఆ సౌకర్యాన్ని ఉపసంహరించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు కాని వారికి గన్నన్లను తక్షణమే ఉపసంహరించాలని భావిస్తున్నారు. ఆ మేరకు డీజీపీ ప్రసాదరావుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ శుక్రవారం నివేదిక పంపారు. ఇద్దరు ఎమ్మెల్యేలకూ గన్మన్లు కట్! జిల్లాలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు గన్‌మెన్ సౌకర్యం కల్పించారు. ప్రజాప్రతినిధుల కోటాలో గన్మెన్లు పొందిన ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తనకు కేటాయించిన గన్మెన్లను దుర్వినియోగం చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఆ ఎమ్మెల్యే సమీప బంధువులు, అనుచరులు గన్మెన్లను అడ్డం పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారని నిర్ధారిస్తున్నాయి. మరో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సైతం ఇదే పద్ధతుల్లో పయనిస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. వారిద్దరికీ గన్‌మెన్ సౌకర్యాన్ని ఉపసంహరించాలని ప్రతిపాదించాయి. అధిక శాతం ప్రజాప్రతినిధులకు ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి గన్మెన్లుగా వ్యవహరిస్తున్నారని.. ఇది సమస్యలకు దారితీస్తోందని నిఘా విభాగం పేర్కొంది. ప్రజాప్రతినిధులకు కేటాయించిన గన్మెన్లను ప్రతి మూడు నెలలకు ఒక సారి నిక్కచ్చిగా మార్పు చేయాలని సూచించాయి. నిఘా వర్గాలు చేసిన ప్రతిపాదనల్లో గన్మెన్లను మార్చే ప్రక్రియను తక్షణమే అమలుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను ఉపసంహరించేందుకు అనుమతించాలని డీజీపీ ప్రసాదరావుకు నివేదిక పంపారు. రాజకీయనేతలకు ఉపసంహరణ ప్రజాప్రతినిధి కాని నేతల కోటాలో కాంగ్రెస్ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, రాగే పరశురాం, బోగాతి నారాయణరెడ్డి, వజ్జల మల్లికార్జున.. టీడీపీ నేతలు కందిగోపుల మురళి, పయ్యావుల శ్రీనివాసులు తదితరులకు గన్‌మెన్ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో అధిక శాతం నేతలకు గన్‌మన్ సౌకర్యం కల్పించవద్దని ఆదిలోనే నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులకు నివేదించాయి. దాంతో.. అప్పట్లోనే వారికి గన్మన్లు కేటాయించేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. కానీ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి గన్మన్లను కేటాయింపజేసుకోవడంలో ఆ నేతలు సఫలీకృతులయ్యారు. గన్‌మన్ సౌకర్యం పొందిన కొందరు నేతలు వారిని అడ్డంపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధియేతరులైన నేతలకు తక్షణమే గన్మెన్లను ఉపసంహరించాలని నిఘా వర్గాలు సూచించాయి. నిఘా వర్గాలు అభ్యంతరం చెప్పడం వల్ల గతంలో జిల్లాలో అధిక శాతం ఫ్యాక్షనిస్టులకు ప్రభుత్వం గన్మన్లను కేటాయించలేదు. ఈ నేపథ్యంలో బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో గన్ లెసైన్సు ఉన్న వారిని నెల సరి వేతనంపై ఫ్యాక్షనిస్టులు, కొందరు రాజకీయ నేతలు ప్రైవేటు గన్మన్లుగా నియమించుకున్నారు. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు గన్మెన్లను నియమించుకుని.. ప్రైవేటు సైన్యాన్ని కొందరు నేతలు నడపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తక్షణమే ప్రైవేటు గన్మన్లను జిల్లా సరిహద్దులు దాటించాలని కూడా ప్రతిపాదించగా దీని అమలుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధి కాని వారికి కేటాయించిన గన్మెన్లను నెలాఖరులోగా ఉపసంహరించుకోనున్నారు.