సాక్షి ప్రతినిధి, అనంతపురం : పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సెంథిల్‌కుమార్ దూకుడు మరింత పెంచారు. ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరి వ్యక్తిగత పనితీరును అంచనా వేస్తున్నారు. పనితీరులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఎప్పటికప్పుడు చార్జ్‌మెమోలు జారీ చేస్తూ దారిలో పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు అదే రీతిలో మెమోలు జారీ చేశారు.
ప్రాదేశిక ఎన్నికల్లోనూ పనితీరును అంచనా వేసి.. నడత మార్చుకోని అధికారులపై వేటు వేసి సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా.. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అనంతపురం కార్పొరేషన్ సహా 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటే ఎస్పీ సెంథిల్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లా చరిత్రలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం, తాడిపత్రిలో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. బందోబస్తును నిర్వహిస్తోన్న అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆ సంఘటనలు చోటుచేసుకున్నాయనే నిర్ధారణకు వచ్చిన ఎస్పీ.. ఆ అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనంతపురంలోని ముగ్గురు సీఐలు, తాడిపత్రిలో ఓ ఉన్నతాధికారి, మరో ఎస్‌ఐకి మెమోలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనంతపురం, తాడిపత్రిలో ఇద్దరు అధికారులు ఓ పార్టీకి మద్దతుగా పనిచేసినట్లు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంపై ఎస్పీ ప్రత్యేకంగా విచారణ నిర్వహిస్తున్నారు. విచారణలో తేలితే ఆ ఇద్దరు అధికారులను ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌లోగా విధుల నుంచి తప్పించి.. వీఆర్‌కు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు దన్నుగా నిలిచే అధికారులకు ఇదో హెచ్చరికగా పనిచేస్తుందని ఎస్పీ భావిస్తున్నారు. ఈ నెల 6న తొలి విడత, 11న మలి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ పోలింగ్ బందోబస్తులో కూడా అధికారుల పనితీరుపై ప్రత్యేకంగా నిఘా వేయనున్నారు. ప్రాదేశిక పోలింగ్‌లో తోకజాడించే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా, సార్వత్రిక ఎన్నికల నాటికి పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తేనే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్వేచ్ఛాయుత.. శాంతియుత వాతావరణంలో నిర్వహించవచ్చు. ఓటర్లలో ధైర్యం నింపవచ్చు. ఇది ఓటింగ్ శాతం పెరగడానికి దారితీస్తుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఇది నిరూపితమైంది కూడా. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడాలన్నది ఎస్పీ సెంథిల్‌కుమార్ లక్ష్యంగా తెలుస్తోంది.