అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ‘రానున్న రోజులు ఎంతో కష్టతరమైనవి.. అత్యంత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది.. ఇప్పటి నుంచే నిఘా తీవ్రతరం చేయండి.. ఏ చిన్న విషయాన్నీ తేలికగా తీసుకోకండి.. గ్రామాలపై దృష్టి సారించండి..’ అంటూ ఎస్పీ సెంథిల్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ జిల్లాలోని సీఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత గతంలో మహిళలపై జరిగిన ఘటనలు, అకృత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, కిడ్నాప్‌లు, దోపిడీ కేసులు, తదితరాలతో పాటు సర్కిల్స్ వారీగా అధికారుల పని తీరు, వారికి ని ర్దేశించిన లక్ష్యాలపై సమీక్ష జరిపారు.
ఆయా కేసుల్లో నిందితులను అరెస్టు చేశారా? లేదా? వాటి పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు అడ్డుకట్ట వేయాలని సీఐలను ఆదేశించారు. చోరీలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు చోరీ కేసుల్లో రికవరీలపై దృష్టి సారించాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్ బాగా పెంచాలని, వాహనాల తనిఖీలు, నాకాబందీ, ఆకస్మిక తనిఖీలు చేపట్డడం, అసాంఘిక కార్యకలాపాల స్థావరాలపై దాడులు ముమ్మరం చేయడం వంటివి నిర్వహించాలన్నారు. పలు కేసుల్లో నాన్‌బెయిలబుల్(ఎన్‌బీడబ్ల్యూ)ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
పోలీసు స్టేషన్లలోని రిసెప్షన్ కేంద్రాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఉండాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించి, వారి బాధలను విని చట్టపర చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల మండలాల్లో వారానికోసారి నిర్వహించే ప్రజల చెంతకు పోలీసు కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో అవినీతి, అక్రమాలపై సమాచారం సేకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ప్రజా సహకారం’ విభాగం ఫోన్ నంబర్ 9553707070, డీ జీపీ కంట్రోల్‌లోని టోల్ ఫ్రీ నంబర్ డయల్ 100పై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎన్.శ్వేత, సీఐలు పాల్గొన్నారు.
నిఘా పెంచుదాం
Published Fri, Feb 21 2014 2:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement