దూకుడుకు కళ్లెం | Aggressive in dampened | Sakshi
Sakshi News home page

దూకుడుకు కళ్లెం

Published Mon, Jan 20 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

Aggressive in dampened

‘ఏం బావా.. ఏంటి కథ! పెళ్లి కొడుకులా తయారయ్యావ్’ అంటూ మంత్రి జుట్టును సరిచేస్తూ పలకరించారు ఓ సీఐ. ‘అదేం లేదులేరా..’ అంటూ స్పందించాడు మంత్రి. ఇంతలోనే ఆ సీఐ అందుకుంటూ ‘బావా మొన్న ఒకటి అడిగా.. గుర్తుందా’ అన్నారు. ‘ఆ.. ఎందుకు గుర్తులేదురా! పోస్టింగే కదా?! నీకుగాకపోతే ఎవరికి ఇప్పిస్తారా’ అంటూ హామీ ఇచ్చేశారు ఆ మంత్రి. ఇదంతా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే జరిగింది.
 
 మంత్రి సిఫారసుతో ఓ కీలక ప్రాంతంలో సీఐ పోస్టింగ్‌ను దక్కించుకున్నారు. ఆ మంత్రి పేరు చెప్పుకొని సెటిల్‌మెంట్లు చేయడంలో ఆరితేరిపోయారు. మట్కా బీటర్లు మొదలుకుని వైన్ షాపుల యజమానుల దాకా అందరి నుంచి మామూళ్లు గుంజడంలో మేటిగా నిలిచారు. దారితప్పిన ఆ సీఐకి ఎస్పీ సెంథిల్‌కుమార్ నాలుగు మెమోలు ఇచ్చారు. అయినా తీరు మారలేదు. చివరకు ఎస్పీ నిలదీశారు. తన వెనుక మంత్రి ఉన్నారన్న ధైర్యంతో ఏకంగా డీఐజీ, ఎస్పీపైనే ఆ సీఐ ఎదురుతిరిగారు.
 
 ఇలాంటి పోలీస్ అధికారులకు ‘గుణపాఠం’ నేర్పడానికి డీఐజీ, ఎస్పీ కసరత్తు ప్రారంభించారు. అందుకోసం వారు ఏమి చేస్తున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే!
 
 ఖద్దరు దన్నుతో ఖాకీవనంలో వేళ్లూనుకుపోయిన గంజాయి మొక్కలను ఏరిపారేయడానికి డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ నడుం బిగించారు. దీంతో జిల్లా పోలీసు శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నలుగురు సీఐలు సినీఫక్కీలో సెటిల్‌మెంట్లు చేస్తుండగా.. ఐదుగురు సీఐలు ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారు.
 
 ఒక సీఐ నకిలీ కరెన్సీ చలామణి ముఠాతో చేతులు కలిపారు. వారిని చూసుకుని కొందరు ఎస్‌ఐలూ అదే బాట పట్టారు. ఇద్దరు ఎస్‌ఐలు ఎర్రచందనం స్మగ్లర్లుగా రూపాంతరం చెందగా.. ఎనిమిది మంది ఇసుక స్మగ్లర్లుగా మారారు. మరో నలుగురు సెటిల్‌మెంట్లలో మునిగి తేలుతున్నారు. వీరంతా ఖద్దరు దన్నుతో పోస్టింగ్‌లు పొందిన వారే. మంత్రులు, అధికార, విపక్ష ఎమ్మెల్యేల సిఫారసులతో అత్యంత ప్రధానమైన కేంద్రాల్లో పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. ఫలితంగా నిజాయతీతో పనిచేసే పోలీసు అధికారులకు సరైన ప్రాంతాల్లో పోస్టింగ్‌లు దక్కలేదనే భావన ఆ శాఖలోనే బలంగా వ్యక్తమవుతోంది. కొందరు సీఐలు, ఎస్‌ఐలే దారి తప్పడంతో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలే దుస్థితి దాపురించింది. ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ కొరడా ఝళిపిస్తున్నారు. దారితప్పిన 14 మంది సీఐలు, 24 మంది ఎస్‌ఐలకు మెమోలు ఇచ్చారు. ఇందులో ఏడెనిమిది మెమోలు తీసుకున్న సీఐలు, ఎస్‌ఐలు కూడా ఉండటం గమనార్హం.
 
 ఖద్దరు దన్నుతో ఆ సీఐలు, ఎస్‌ఐలు లెక్క చేయకపోవడం వల్లే ఉన్నతాధికారులు పదే పదే మెమోలు జారీ చేసినట్లు పోలీసుశాఖ వర్గాలు వెల్లడించాయి. మెమోలను తేలిగ్గా తీసుకుంటుండటాన్ని డీఐజీ, ఎస్పీలు తీవ్రంగా పరిగణించారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడం ద్వారా ఆ సీఐలు, ఎస్‌ఐల్లో మార్పుతేవాలని భావించారు. అందులో భాగంగా విస్తృతంగా పోలీసుస్టేషన్లలో తనిఖీలు చేపడుతున్నారు. దారితప్పిన వారు తీరుమార్చుకోవాలని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘ప్రజల చెంతకు పోలీసు’ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. ఇది కొంత సానుకూల ఫలితాలను ఇస్తోంది.
 
 కొందరు సీఐలు, ఎస్‌ఐలు తీరుమార్చుకున్నారు. కానీ.. మరి కొందరు మాత్రం ఖాతరు చేయడం లేదు. జిల్లాలో వెకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న 19 మంది సీఐలు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. 16 మంది ఎస్‌ఐలు వీఆర్‌లో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేసిన సీఐలను సరిహద్దులు దాటించాల్సి ఉంది. ఒకే నియోజకవర్గంలో పాతుకుపోయిన ఎస్‌ఐలకు కూడా స్థానచలనం కల్పించాల్సి వుంది. ఇదంతా ఎన్నికల సంఘం కనుసన్నల్లో జరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకుని మాట వినని కొందరు సీఐలు, ఎస్‌ఐల పని పట్టాలని డీఐజీ, ఎస్పీ నిర్ణయించారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వారికి బదిలీలతో గుణపాఠం చెప్పి.. వీఆర్‌లో ఉన్న వారందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని భావిస్తున్నారు.
 
 ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. సీఐలకు స్థానచలనం కల్పిస్తూ.. ఆరోపణలున్న కొందరు సీఐలపై వేటువేస్తూ డీఐజీ బాలకృష్ణ  రాయలసీమ ఐజీ రాజీవ్త్రన్‌కు నివేదిక పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 55 మంది ఎస్‌ఐలకు కూడా స్థానచలనం కల్పించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్‌తో కలిసి డీఐజీ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆరోపణలున్న ఎస్‌ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిజాయతీపరులైన అధికారులకు అత్యంత కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిశ్చయించారు. డీఐజీ, ఎస్పీ దూకుడుగా ముందుకెళ్తోండటంతో పోలీసు శాఖలో కలకలం రేగుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement