settle ments
-
ఇక్కడా నకిలీల హల్చల్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలోనూ నకిలీ మానవహక్కుల సంఘాలు వేళ్లూనుకుని ఉన్నాయి. గుంటూరులో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడుతున్నా యి. ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల తగవులలో జోక్యం చేసుకుంటూ సొమ్ము దండుకుంటున్నాయి. కార్పొరేట్ స్థాయిలో కార్యాలయం, నంబర్ ప్లేట్‌పై రంగుల్లో హ్యూమన్‌రైట్స్ అనే పేరు, హోదా కనపడే విధంగా ఖరీదైన కార్లు, కొనిపెట్టుకున్న దర్జాదర్పంతో సామాన్యులను ఇట్టే బోల్తా కొట్టిస్తుంటారు. ఇవన్నీ చూసిన బాధితులు ఇదేదో చట్టపరమైన సంస్థలా భావించి తమ సమస్యలు పరిష్కరించాలని నేరుగా వారి కార్యాలయాలకు వెళ్లి చేతులు జోడిస్తుంటారు. ఇదంతా ఓ ఎత్తయితే, మరి కొన్ని వివాదాలను పోలీస్ స్టేషన్ల నుంచి తమదైన మార్గంలో తెలుసుకుని పరిష్కారాలు, తీర్పులు చెపుతుంటారు. సహజంగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కేసు విచారణలో జరిగే ఆలస్యాన్ని నకిలీ సంఘాలు తమకు అవకాశంగా మలచుకొంటాయి. ఇరువర్గాల వివరాలు తెలుసుకుని, అధికంగా సొమ్ము ఇచ్చే వర్గానికి మద్దతుగా నిలిచి సమస్యలు పరిష్కరిస్తుంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో హ్యూమన్ రైట్స్ సంస్థ పేరుతో హోంమంత్రి చినరాజప్ప బంధువునంటూ అవినాష్ అనే వ్యక్తి చేసిన అరాచకాలు వెలుగులోకి రావడంతో గుంటూరులోని ఈ తరహా సంస్థల కార్యకలాపాలపై చర్చ నడుస్తోంది. కేసులు పరిష్కారం పేరుతో వేధింపులకు పాల్పడిన నకిలీ సంస్థలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు ఇప్పుడు కోరుతున్నారు. సొంత వివాదాల్లో ఉన్న తాము, మరో తలనొప్పిని తెచ్చుకునే ఉద్దేశం లేక అప్పట్లో వాటి గురించి ఫిర్యాదు చేయలేదని, అవినాష్ సందర్భం వచ్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి నకిలీ సంస్థలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఎన్ఆర్ఐ వివాహ వివాదానికి సంబంధించి యువకుడి కుటుంబాన్ని ఓ సంస్థ బ్లాక్‌మెయిల్‌కు యత్నించిన విధానాన్ని కొందరు వివరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎన్ఆర్ఐకు గుంటూరు రూరల్‌కు చెందిన ఒక యువతితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. రెండేళ్లకే వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకొంది.దాంతో ఆ వివాహిత తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఎన్ఆర్ఐ మాత్రం యుఎస్ఏలో ఉద్యోగం చేసుకుంటున్నారు. వివాహిత తన భర్తపై ఏ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేయలేదు. ఇలా నాలుగేళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు.అప్పట్లోఈ వివాదం గురించి తెలుసుకున్న గుంటూరులోని ఒక హ్యూమన్ రైట్స్ సంస్థ రంగంలోకి దిగింది. వివాహిత తరఫున వకాల్తా పుచ్చుకుని, యుఎస్ఏలో ఉద్యోగం చేసు కుంటున్న యువకుడి తల్లితండ్రులకు ఫోన్ చేశారు. ‘ మీ కోడలు మా సంస్థకు ఫిర్యాదు చేశారు. మా కార్యాలయానికి వచ్చి కలవండి’ అని చెప్పారు. దీంతో హడావుడిగా యువకుని తల్లితండ్రులు, సన్నిహితులు గుంటూరులోని ఈ సంస్థ ప్రతినిధులను కలిశారు. వివాహితకు జరిగిన అన్యాయానికి, యువకుడి తరఫు ఆస్తిలో సగం ఆమెకు చెల్లే విధంగా కేసు సెటిల్ చేసుకోవాలని, లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వివాహిత తరఫున వకాల్తా పుచ్చుకుంటామని బెదిరించారు. వారం రోజుల సమయం కావాలని కోరిన యువకుని తల్లితండ్రులు అప్పటికి అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ తరువాత ఆ సంస్థ చట్టబద్ధత, ఇతర వివరాలను సేకరించిన యువకుడి తల్లిదండ్రులు ఆ సంస్థ నుంచి వచ్చే కాల్స్‌కు సమాధానం ఇవ్వకుండా సన్నిహితుల మధ్య భార్యాభర్తల వివాదాన్ని పరిష్కరించుకున్నారు. విద్యావంతులైన ఎన్ఆర్ఐ కుటుంబాన్నే బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ సంస్థ ప్రయత్నించిందంటే, దీని బారినపడి ఎంత మంది సామాన్యులు మోసపోయి ఉంటారో అంచనా వేయవచ్చు. -
దూకుడుకు కళ్లెం
‘ఏం బావా.. ఏంటి కథ! పెళ్లి కొడుకులా తయారయ్యావ్’ అంటూ మంత్రి జుట్టును సరిచేస్తూ పలకరించారు ఓ సీఐ. ‘అదేం లేదులేరా..’ అంటూ స్పందించాడు మంత్రి. ఇంతలోనే ఆ సీఐ అందుకుంటూ ‘బావా మొన్న ఒకటి అడిగా.. గుర్తుందా’ అన్నారు. ‘ఆ.. ఎందుకు గుర్తులేదురా! పోస్టింగే కదా?! నీకుగాకపోతే ఎవరికి ఇప్పిస్తారా’ అంటూ హామీ ఇచ్చేశారు ఆ మంత్రి. ఇదంతా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే జరిగింది. మంత్రి సిఫారసుతో ఓ కీలక ప్రాంతంలో సీఐ పోస్టింగ్‌ను దక్కించుకున్నారు. ఆ మంత్రి పేరు చెప్పుకొని సెటిల్మెంట్లు చేయడంలో ఆరితేరిపోయారు. మట్కా బీటర్లు మొదలుకుని వైన్ షాపుల యజమానుల దాకా అందరి నుంచి మామూళ్లు గుంజడంలో మేటిగా నిలిచారు. దారితప్పిన ఆ సీఐకి ఎస్పీ సెంథిల్‌కుమార్ నాలుగు మెమోలు ఇచ్చారు. అయినా తీరు మారలేదు. చివరకు ఎస్పీ నిలదీశారు. తన వెనుక మంత్రి ఉన్నారన్న ధైర్యంతో ఏకంగా డీఐజీ, ఎస్పీపైనే ఆ సీఐ ఎదురుతిరిగారు. ఇలాంటి పోలీస్ అధికారులకు ‘గుణపాఠం’ నేర్పడానికి డీఐజీ, ఎస్పీ కసరత్తు ప్రారంభించారు. అందుకోసం వారు ఏమి చేస్తున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే! ఖద్దరు దన్నుతో ఖాకీవనంలో వేళ్లూనుకుపోయిన గంజాయి మొక్కలను ఏరిపారేయడానికి డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ నడుం బిగించారు. దీంతో జిల్లా పోలీసు శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నలుగురు సీఐలు సినీఫక్కీలో సెటిల్మెంట్లు చేస్తుండగా.. ఐదుగురు సీఐలు ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారు. ఒక సీఐ నకిలీ కరెన్సీ చలామణి ముఠాతో చేతులు కలిపారు. వారిని చూసుకుని కొందరు ఎస్‌ఐలూ అదే బాట పట్టారు. ఇద్దరు ఎస్ఐలు ఎర్రచందనం స్మగ్లర్లుగా రూపాంతరం చెందగా.. ఎనిమిది మంది ఇసుక స్మగ్లర్లుగా మారారు. మరో నలుగురు సెటిల్మెంట్లలో మునిగి తేలుతున్నారు. వీరంతా ఖద్దరు దన్నుతో పోస్టింగ్‌లు పొందిన వారే. మంత్రులు, అధికార, విపక్ష ఎమ్మెల్యేల సిఫారసులతో అత్యంత ప్రధానమైన కేంద్రాల్లో పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. ఫలితంగా నిజాయతీతో పనిచేసే పోలీసు అధికారులకు సరైన ప్రాంతాల్లో పోస్టింగ్‌లు దక్కలేదనే భావన ఆ శాఖలోనే బలంగా వ్యక్తమవుతోంది. కొందరు సీఐలు, ఎస్ఐలే దారి తప్పడంతో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలే దుస్థితి దాపురించింది. ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ కొరడా ఝళిపిస్తున్నారు. దారితప్పిన 14 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలకు మెమోలు ఇచ్చారు. ఇందులో ఏడెనిమిది మెమోలు తీసుకున్న సీఐలు, ఎస్ఐలు కూడా ఉండటం గమనార్హం. ఖద్దరు దన్నుతో ఆ సీఐలు, ఎస్ఐలు లెక్క చేయకపోవడం వల్లే ఉన్నతాధికారులు పదే పదే మెమోలు జారీ చేసినట్లు పోలీసుశాఖ వర్గాలు వెల్లడించాయి. మెమోలను తేలిగ్గా తీసుకుంటుండటాన్ని డీఐజీ, ఎస్పీలు తీవ్రంగా పరిగణించారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడం ద్వారా ఆ సీఐలు, ఎస్ఐల్లో మార్పుతేవాలని భావించారు. అందులో భాగంగా విస్తృతంగా పోలీసుస్టేషన్లలో తనిఖీలు చేపడుతున్నారు. దారితప్పిన వారు తీరుమార్చుకోవాలని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘ప్రజల చెంతకు పోలీసు’ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. ఇది కొంత సానుకూల ఫలితాలను ఇస్తోంది. కొందరు సీఐలు, ఎస్ఐలు తీరుమార్చుకున్నారు. కానీ.. మరి కొందరు మాత్రం ఖాతరు చేయడం లేదు. జిల్లాలో వెకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న 19 మంది సీఐలు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. 16 మంది ఎస్ఐలు వీఆర్‌లో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేసిన సీఐలను సరిహద్దులు దాటించాల్సి ఉంది. ఒకే నియోజకవర్గంలో పాతుకుపోయిన ఎస్ఐలకు కూడా స్థానచలనం కల్పించాల్సి వుంది. ఇదంతా ఎన్నికల సంఘం కనుసన్నల్లో జరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకుని మాట వినని కొందరు సీఐలు, ఎస్ఐల పని పట్టాలని డీఐజీ, ఎస్పీ నిర్ణయించారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వారికి బదిలీలతో గుణపాఠం చెప్పి.. వీఆర్‌లో ఉన్న వారందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. సీఐలకు స్థానచలనం కల్పిస్తూ.. ఆరోపణలున్న కొందరు సీఐలపై వేటువేస్తూ డీఐజీ బాలకృష్ణ రాయలసీమ ఐజీ రాజీవ్త్రన్కు నివేదిక పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 55 మంది ఎస్ఐలకు కూడా స్థానచలనం కల్పించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్‌తో కలిసి డీఐజీ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆరోపణలున్న ఎస్ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిజాయతీపరులైన అధికారులకు అత్యంత కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిశ్చయించారు. డీఐజీ, ఎస్పీ దూకుడుగా ముందుకెళ్తోండటంతో పోలీసు శాఖలో కలకలం రేగుతోంది.