సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలోనూ నకిలీ మానవహక్కుల సంఘాలు వేళ్లూనుకుని ఉన్నాయి. గుంటూరులో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతున్నా యి. ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల తగవులలో జోక్యం చేసుకుంటూ సొమ్ము దండుకుంటున్నాయి. కార్పొరేట్ స్థాయిలో కార్యాలయం, నంబర్ ప్లేట్‌పై రంగుల్లో హ్యూమన్‌రైట్స్ అనే పేరు, హోదా కనపడే విధంగా ఖరీదైన కార్లు, కొనిపెట్టుకున్న దర్జాదర్పంతో సామాన్యులను ఇట్టే బోల్తా కొట్టిస్తుంటారు. ఇవన్నీ చూసిన బాధితులు ఇదేదో చట్టపరమైన సంస్థలా భావించి తమ సమస్యలు పరిష్కరించాలని నేరుగా వారి కార్యాలయాలకు వెళ్లి చేతులు జోడిస్తుంటారు. ఇదంతా ఓ ఎత్తయితే, మరి కొన్ని వివాదాలను పోలీస్ స్టేషన్ల నుంచి తమదైన మార్గంలో తెలుసుకుని పరిష్కారాలు, తీర్పులు చెపుతుంటారు. సహజంగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కేసు విచారణలో జరిగే ఆలస్యాన్ని నకిలీ సంఘాలు తమకు అవకాశంగా మలచుకొంటాయి.
ఇరువర్గాల వివరాలు తెలుసుకుని, అధికంగా సొమ్ము ఇచ్చే వర్గానికి మద్దతుగా నిలిచి సమస్యలు పరిష్కరిస్తుంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో హ్యూమన్ రైట్స్ సంస్థ పేరుతో హోంమంత్రి చినరాజప్ప బంధువునంటూ అవినాష్ అనే వ్యక్తి చేసిన అరాచకాలు వెలుగులోకి రావడంతో గుంటూరులోని ఈ తరహా సంస్థల కార్యకలాపాలపై చర్చ నడుస్తోంది. కేసులు పరిష్కారం పేరుతో వేధింపులకు పాల్పడిన నకిలీ సంస్థలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు ఇప్పుడు కోరుతున్నారు.
సొంత వివాదాల్లో ఉన్న తాము, మరో తలనొప్పిని తెచ్చుకునే ఉద్దేశం లేక అప్పట్లో వాటి గురించి ఫిర్యాదు చేయలేదని, అవినాష్ సందర్భం వచ్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి నకిలీ సంస్థలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఎన్‌ఆర్‌ఐ వివాహ వివాదానికి సంబంధించి యువకుడి కుటుంబాన్ని ఓ సంస్థ బ్లాక్‌మెయిల్‌కు యత్నించిన విధానాన్ని కొందరు వివరించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐకు గుంటూరు రూరల్‌కు చెందిన ఒక యువతితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. రెండేళ్లకే వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకొంది.దాంతో ఆ వివాహిత తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఎన్‌ఆర్‌ఐ మాత్రం యుఎస్‌ఏలో ఉద్యోగం చేసుకుంటున్నారు. వివాహిత తన భర్తపై ఏ పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయలేదు. ఇలా నాలుగేళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు.అప్పట్లోఈ వివాదం గురించి తెలుసుకున్న గుంటూరులోని ఒక హ్యూమన్ రైట్స్ సంస్థ రంగంలోకి దిగింది.
వివాహిత తరఫున వకాల్తా పుచ్చుకుని, యుఎస్‌ఏలో ఉద్యోగం చేసు కుంటున్న యువకుడి తల్లితండ్రులకు ఫోన్ చేశారు. ‘ మీ కోడలు మా సంస్థకు ఫిర్యాదు చేశారు. మా కార్యాలయానికి వచ్చి కలవండి’ అని చెప్పారు. దీంతో హడావుడిగా యువకుని తల్లితండ్రులు, సన్నిహితులు గుంటూరులోని ఈ సంస్థ ప్రతినిధులను కలిశారు. వివాహితకు జరిగిన అన్యాయానికి, యువకుడి తరఫు ఆస్తిలో సగం ఆమెకు చెల్లే విధంగా కేసు సెటిల్ చేసుకోవాలని, లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వివాహిత తరఫున వకాల్తా పుచ్చుకుంటామని బెదిరించారు. వారం రోజుల సమయం కావాలని కోరిన యువకుని తల్లితండ్రులు అప్పటికి అక్కడి నుంచి బయటపడ్డారు.
ఆ తరువాత ఆ సంస్థ చట్టబద్ధత, ఇతర వివరాలను సేకరించిన యువకుడి తల్లిదండ్రులు ఆ సంస్థ నుంచి వచ్చే కాల్స్‌కు సమాధానం ఇవ్వకుండా సన్నిహితుల మధ్య భార్యాభర్తల వివాదాన్ని పరిష్కరించుకున్నారు. విద్యావంతులైన ఎన్‌ఆర్‌ఐ కుటుంబాన్నే బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ సంస్థ ప్రయత్నించిందంటే, దీని బారినపడి ఎంత మంది సామాన్యులు మోసపోయి ఉంటారో అంచనా వేయవచ్చు.
ఇక్కడా నకిలీల హల్‌చల్!
Published Thu, Mar 12 2015 1:48 AM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM
Advertisement