పేదల గోడ.. | The District Police Department is flowing with innovative programs. | Sakshi
Sakshi News home page

పేదల గోడ..

Published Fri, Jul 7 2017 3:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

పేదల గోడ..

పేదల గోడ..

జిల్లా ఎస్పీ వినూత్న కార్యక్రమం
వాల్‌ ఆఫ్‌ గాడ్‌తో పేదలకు వస్తువుల అందజేత
పట్టణంలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ బలోపేతంపై దృష్టి

ఆదిలాబాద్‌:  జిల్లా పోలీసు శాఖ ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ సారథ్యంలో వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. ఇటు నేరాలు అదుపునకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే.. మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. సాధారణంగా 24 గంటలు కేసులు, కోర్టులు అంటూ తిరిగే పోలీసుల ఆలోచన విధానం ప్రజాసేవకు మారుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పిస్తోంది.

ఆ శాఖకు నిధులతోపాటు అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యులను చేస్తోంది. తమ విధులు నిర్వర్తించడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువచేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు పోలీసులు మిషన్‌ కాకతీయ, హరితహారం, వంటి కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదలకు తమ వంతు సహాయంగా ఎస్పీ ఆధ్వర్యంలో వాల్‌ ఆఫ్‌ గాడ్‌ పేరుతో పాత వస్తువులను పేదలకు ఉపయోగపడేలా వెలుగులోకి తీసుకొచ్చారు.

పాత వస్తువులు ఎంతో ఉపయోగం..
జిల్లాలో పేదలకు సహాయం చేయడానికి జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. స్థానిక టూటౌన్‌ ఎదుట జూన్‌ 25న ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదల కోసం ‘వాల్‌ ఆఫ్‌ గాడ్‌’ ప్రారంభించారు. ఇంట్లో అనవసరమైన అనేక వస్తువులు ఉంటాయి, వాటిని పేదలకు, అవసరమున్న వారికి అందించడానికి ఈ వాల్‌ ఆఫ్‌ గాడ్‌ ఉపయోగపడుతోంది. ఇంట్లో ఉన్న పాత వస్తువులు, బట్టలు, చెప్పులు, పుస్తకాలు, దుప్పట్లు, బ్యాగులు ఇతర ఏవైనా నిరుపయోగ వస్తువులు ఈ వాల్‌ ఆఫ్‌ గాడ్‌ వద్ద ఉంచితే ఎవరైన అవసరం ఉన్న వారు వారికి కావాల్సిన వస్తువులను తీసుకెళ్తున్నారు.

మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఉన్నా ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారనే.. ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారికి ఈ వాల్‌ ఆఫ్‌ గాడ్‌తో వారు అనుకున్నది చేయగలుగుతారు. ఈ ప్రక్రియ ప్రపంచంలో మొదటిసారిగా ఇరాన్‌ దేశంలో ప్రారంభమైంది. ఆ దేశంలో 1997లో కరువు వచ్చిన సమయంలో ఓ మహిళ ఆలోచనలో నుంచి ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. తన వద్ద ఉన్న పాత వస్తువులను ఒక దగ్గర చేర్చి బహిరంగంగా ఏర్పాటు చేశారు. తద్వారా ఎవరికి అవసరమైన వస్తువులు వారు తీసుకెళ్లారు. ఇలా ఈ కార్యక్రమం ప్రపంచమంత పాకింది. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోలీసుశాఖతో కలిసి ఇటీవలే ప్రారంభించారు. జిల్లాలో మొదటి సారిగా ఈ కార్యక్రయాన్ని ఎస్పీ ప్రారంభించడం గమనార్హం.

రద్దీ ప్రాంతంలో ఏర్పాటుతో మరింత మెరుగు..
ప్రస్తుతం వాల్‌ఆఫ్‌ గాడ్‌ను టూటౌన్‌ ఎదుట ఏర్పాటు చేశారు. ఇలాంటివి పట్టణంలో మరికొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎస్పీ ఆలోచన చేశారు. రద్దీ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా బస్టాండ్, పాత బస్టాండ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఈ ప్రాంతాల్లో నిరాశ్రయులు, నిరుపేదలు చాలామంది ఉంటారు, ఇలాంటి వారు పోలీసు స్టేషన్‌ వెళ్లేందుకు బయపడుతారు. అదే బహిరంగంగా జనం ఉన్నచోట పెడితే వారికి అవసరమైన కచ్చితంగా తీసుకెళ్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement