‘ఆర్డర్లీ’ వ్యవహారంలో కుట్ర : ఎస్పీ
ఎస్పీ నవీన్ కుమార్
తాండూరు: జిల్లా పోలీసు శాఖలో సంచలనం కలిగించిన హోంగార్డుల ఆర్డర్లీ వ్యవహారంపై ఎస్పీ డా.బీ.నవీన్ కుమార్ స్పందించారు. బుధవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరు విచ్చేసిన ఎస్పీ.. స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తనపై కుట్ర జరిగిందన్నారు. నవాబుపేట, తాండూరు, యాలాల, వికారాబాద్ డీటీసీకి చెందిన నలగురు హోంగార్డులు ఒక పథకం ప్రకారం జిల్లా ఎస్పీ కార్యాయానికి వచ్చి కార్యాలయం వెనుక భాగంలో ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు విడుదల చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ఈ నలుగురు హోంగార్డులకు జిల్లా ఎస్పీ కార్యాలయం, రెసిడెన్సీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో డీఐజీ ఆధ్వర్యంలో ఉన్నతస్థారుు విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. సదరు నలుగురు హోంగార్డులపై విచారణ అనంతరం తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
సిన్సియర్‌గా పని చేసే పోలీసు అధికారులకు ఇబ్బందులు తప్పవన్నారు. పోలీసు శాఖలో పని చేయడం కత్తిమీద సాములాంటిదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సవాలుగా తీసుకుంటూ ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఎస్పీ జిల్లా పోలీసు కుటుంబానికి పెద్ద (హెడ్) అని అన్నారు. కుటుంబ పెద్ద తన పిల్లలను ఎలాచూసుకుంటారో పోలీసు కుటుంబాన్ని తాను అలా ముందుకు నడిపించడానికి పాటుపడుతున్నట్టు చెప్పారు.
పోలీసులు సరిగా విధులు నిర్వర్తించేలావారికి మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమన్నారు. ఏ కేటగిరి హోంగార్డులు రెగ్యులర్ పోలీసుల మాదిరిగానే పెట్రోలింగ్, గార్డు తదితర డ్యూటీలు, బీ కేటగిరిలో హోంగార్డులు కార్పెంటర్, బార్బర్, కుకింగ్, ఎలక్టిష్రీయన్ తదితర స్కిల్డు పనులు చేస్తారన్నారు. వీరు జిల్లాలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వికారాబాద్ సమీపంలోని ధన్నారం వద్ద హౌసింగ్ సొసైటీలో కొందరి పోలీసుల ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ చందనదీప్తి పాల్గొన్నారు.