తెల్లారిన బతుకులు | Short-circuit may have caused Nanded Express blaze | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Published Sun, Dec 29 2013 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

 ‘కేకలు.. ఆరుపులు.. కాపాడండంటూ ఆర్తనాదాలు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. టాయ్‌లెట్ వాకిలి తెరిచి బయటకు తొంగిచూస్తే పొగ గుప్పుమంది.. ఏదో జరగరానిది జరిగిందని భయపడుతూ అడుగు బయటకు పెట్టాను.. ఆలోచించడానికే సమయం లేదు.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ఇక్కడే సజీవ సమాధి ఖాయం.. వాకిలి తెరుచుకోలేదు.. తిరిగి టాయ్‌లెట్‌లోకి వెళ్లి కిటికీని గట్టిగా కాలితో నాలుగు తన్నులు తన్నాను.. అద్దం పగిలిపోయింది.. బోగీ లోపల మంటలు ఎగిసిపడుతూ మీదకొస్తున్నాయి.. అందరూ ఇటు రండంటూ గట్టిగా కేకలు వేశా.. అప్పటికే ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.. కిటికీలోంచి దూకేయండంటూ పురమాయించాను.. వేడిమి భరించడం వీలుకాక నేనూ బయటకు దూకేశాను’ అంటూ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శరణ్ బసవ బెంగళూరు - నాందేడ్ రైలు బోగీ దగ్ధమైన ఘటనను భయం భయంగా వివరించారు. ఈ ఘటనలో ఆయన తన భార్య, మామను మాత్రం కాపాడుకోలేకపోయాడు.

సంఘటన స్థలం మరుభూమిగా మారింది. మృతదేహాలు ఒక్కోటి బయటకు తీస్తుంటే స్థానికుల ఒళ్లు జలదరించింది. దేవుడా.. ఇక ఆ బోగీలో మృతదేహాలు ఉండకూడదంటూ ప్రార్థించారు.
 
 కొత్తచెరువు/పుట్టపర్తిటౌన్, న్యూస్‌లైన్ :  శనివారం తెల్లవారుజాము.. అప్పుడప్పుడే తొలి కోడి కూసింది.. రైతు కుటుంబాల వారు నిద్రలేస్తున్నారు. అంతలోనే రైలు బోగీ అంటుకుందన్న వార్తతో కొత్తచెరువు, పుట్టపర్తి వాసులు ఉలిక్కి పడ్డారు. పరుగు పరుగున సంఘటన స్థలానికి తరలివెళ్లారు. బోగీ మంటల్లో తగలబడుతూ కనిపించింది. ఎవరికి చేతనైంది వారు చేసి ప్రయాణికులను కాపాడటానికి ఉపక్రమించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులో బయలు దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1 ఏసీ బోగీ ఇక్కడ తగలబడిన సంఘటనలో 26 మంది మృతి చెందారని తెలియగానే జిల్లాలోని ప్రముఖులందరూ తరలివచ్చారు. కాసేపటికి రైల్వే అధికారులూ వచ్చారు. ఉదయం 11 గంటల సమయానికి ఆ రైలులో ప్రయాణించిన వారి బంధులు సైతం కొందరు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 26మంది మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రులను పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామసుబ్బారావు ఆధ్వర్యంలో సంఘటన స్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చే సి స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేయించారు.
 
 మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప, మంత్రి రఘువీరా, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నేత హరికృష్ణ తదితరులు సంఘటన స్థలిని పరిశీలించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి  సంఘటన స్థలికి చేరుకుని కాలిపోయిన రైలు బోగీని పరిశీలించి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.  
 
 అనంతపురం నగరం నీలిమీ థియేటర్ సమీపంలోని డోర్ నెంబర్ 1-333 ఇంట్లో ఉంటున్న పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ కుమారుడు శ్రీనివాస్ (28), కోడలు (26) శ్రీలత బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. మంత్రాలయం వెళ్లాలనుకుని ఈ రైలులో బయలుదేరారు. ఇపుడు వారి ఆచూకీ తెలియడం లేదు. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వారి బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement