సమస్య చెప్పుకోండి | Express the problems | Sakshi
Sakshi News home page

సమస్య చెప్పుకోండి

Published Sat, Jan 18 2014 2:30 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM

Express the problems

ముఠా కక్ష్యలు, హత్యలు, దాడులు.. ప్రతి దాడులకు పెట్టింది పేరు  తాడిపత్రి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల ప్రోత్సాహంతో ఎన్నో ఏళ్లుగా  గ్రామాల్లో ఆధిపత్య పోరు సాగుతోంది. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బ తీయడానికి తోటల్లోని చెట్లను నరికివేయడం ఇక్కడ పరిపాటి. తాజాగా ఎర్ర చందనం అక్రమ రవాణా, ఇసుక మాఫియా ఈ ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తోంది.
 
 ఇలాంటి ప్రాంతం నుంచే తొలిసారిగా ‘ప్రజా దర్బార్’కు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. తాడిపత్రి సబ్ డివిజన్‌లోని పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో ప్రజల నుంచి స్వయంగా ఆయనే ఫిర్యాదులు స్వీకరిస్తారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఫిర్యాదు చేస్తే.. బాధితుల భద్రతపై పోలీసులు ఇచ్చే భరోసాపైనే ఈ కార్యక్రమం హిట్టా.. పట్టా అనేది ఆధారపడి ఉంది.
 
 తాడిపత్రి, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమస్యాత్మక ప్రాంతాలపై పట్టు బిగించేందుకు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించాలని నిర్ణయించుకున్న ఆయన, ఈ కార్యక్రమాన్ని తొలుత తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రత్యేక కారణాలే ఉన్నాయి.
 
 2013 డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన సెంథిల్‌కు మొదట తాడిపత్రి ప్రాంతం వాసులే తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. నేరుగా ఫోన్ చేసి తమ దీనగాథలను వెల్లడించారు. మొదటి రోజే తాడిపత్రిలోని ఓ మద్యం సిండకేట్ కార్యాలయంలో పేకాట ఆడుతున్నారని, పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ అనంతపురానికి చెందిన ప్రత్యేక బృందంతో దాడులు చేయించి నిందితులను, పెద్ద మొత్తంలో నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డీఎస్పీ, సీఐలను మందలించి చార్జ్‌మెమోలు కూడా ఇచ్చారు.
 
 ఇక అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని, బాధితుల ఫిర్యాదులు స్వీకరించడం లేదని పోలీసు టోల్‌ఫ్రీ నంబర్లకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తులుగా మారడంతో ఇద్దరు సీఐలను కూడా ఎన్నికల కమిషన్ కొద్ది రోజుల పాటు పక్కన పెట్టింది. ఇటీవల పెద్దవడుగూరు సహకార సంఘాల ఎన్నికల్లో బరిలో ఉన్న గిరిజన మహిళపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేయడం.. దీన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎస్పీ దృష్టికి తీసుకె ళ్లారు. ఇలాంటి దారుణాలు చాలానే ఉన్నాయి. ప్రత్యర్థుల చెట్లను నరికే సంస్కృతి కూడా అధికంగా ఉంది. తాజాగా పెన్నా, చిత్రావతి నదుల నుంచి రాయలసీమ జిల్లాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఇక్కడ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. పెద్ద ఎత్తున ఇసుక మాఫియా ఇక్కడ రాజ్యమేలుతోంది. నెలకు కనీనం 50 నుంచి 100 వాహనాలను సీజ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రచందనం రవాణాలో కూడా ఈ ప్రాంత నేతల అనుచరుల హస్తం ఉంది.
 
 నాలుగు నెలల వ్యవధిలో నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. ఎర్రచందనం దుంగలను తోటల్లో, పరిశ్రమల్లో దాచి.. వీలు కుదిరినప్పుడు రవాణా  చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందన్న విమర్శలు ఉన్నాయి. పరోక్షంగా రాజకీయ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎస్పీ ఇక్కడి నుంచి ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు.
 
 ప్రజలు ఫిర్యాదు చేస్తారా?
 ప్రజాదర్బార్‌లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సమస్యలపై గానీ, తమకు జరిగిన అన్యాయం గురించి గానీ ఫిర్యాదు చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి తెలుసు. అందుకే చాలా మంది ‘ప్రజాదర్బార్’పై ఎటూ చెప్పలేకపోతున్నారు. ఫిర్యాదు చేసిన బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. లేదంటే బాధితులపై రాజకీయ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు.
 
 గతంలోలా చేయరు కదా?
 ‘ప్రజాదర్బార్’ ఉంటుందన్న విషయం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు. దీంతో చాలా మందికి ఈ విషయం చేరకపోవచ్చు.
 అయినా ఎస్పీ నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు అభినందిస్తున్నారు. కానీ ఆచరణలో ఎలా ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఫిర్యాదులు తీసుకుని ‘ఇది మా పరిధిలోకి రాదు.. మేం చేయలేం.. కోర్టులను ఆశ్రయించండి’ అన్న సందర్భాలు ఉన్నాయి.   
 
 ఎవరెవరు ఫిర్యాదు చేయొచ్చంటే..
 పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలీసు ప్రజాదర్బార్ పేరుతో ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు సేకరిస్తారు. పెద్దపప్పూరు, తాడిపత్రి, తాడిపత్రి రూరల్, యాడికి, పెద్దవడుగూరు, పామిడి, పుట్లూరు, యల్లనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రజలు నేరుగా ఫిర్యాదులు అందజేయవచ్చని తాడిపత్రి డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు హాజరవుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement