ఆ పోలీస్ వల్ల అనాథలయ్యాం | 'Jamedar alcohol level, repeatedly hit the front of the bike... | Sakshi
Sakshi News home page

ఆ పోలీస్ వల్ల అనాథలయ్యాం

Published Sun, Jan 19 2014 2:43 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

'Jamedar alcohol level, repeatedly hit the front of the bike...

పెద్దపప్పూరు, న్యూస్‌లైన్ : ‘జమేదార్ వెంకటేశ్వర్లు మద్యం మత్తులో బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో 2013 సెప్టెంబర్‌లో చేనేత కార్మికుడైన నా భర్త చనిపోయాడు. నేను, నా పిల్లలు అనాథలయ్యాం. కుటుంబ పోషణ భారమైంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పోలీస్ అయినందున విచారణ కూడా చేయలేదు. ఆ పోలీస్ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది’ అంటూ చిన్నపప్పూరుకు చెందిన రాఘవేంద్రమ్మ ఎస్పీ సెంథిల్‌కుమార్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యింది. ముచ్చుకోట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ‘ప్రజల చెంతకే పోలీసులు’ అన్న నినాదంతో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆమె తన సమస్యను విన్నవించారు. జమేదార్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన రాఘవేంద్రమ్మకు ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇన్సూరెన్‌‌స వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం వచ్చేలా చూస్తామని తహశీల్దార్ రమాదేవి తెలిపారు.
 
 ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, సీఐలు లక్ష్మీనారాయణ, రాఘవన్ తదితరులు హాజరయ్యారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, బుక్కరాయసముద్రం, పామిడి మండలాలకు చెందిన ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు బారులుతీరారు. ఇందులో ఎక్కువగా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు రావడం గమనార్హం. అన్ని సమస్యలపైనా వందకు పైగా అర్జీలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
 
  మూడు నెలల క్రితం నా భర్త దివాకర్‌రెడ్డి చనిపోయారు. ఆస్తి ఇవ్వకుండా ఆత్తామామలు ఇబ్బందులు పెడుతున్నారు. మేమెలా బతకాలి.. మీరే న్యాయం చేయండి.
 - చంద్రావతి, మేడిమాకులపల్లి,
 
 పెద్దవడుగూరు మండలం
 ఎస్పీ స్పందన : విచారణ జరిపి సమస్యను పరిష్కరించాల్సిందిగా పెద్దవడుగూరు ఎస్‌ఐ శివశంకర్‌రెడ్డికి సూచించారు.
 
  సాగు చేసుకున్న సపోట చెట్లను 2011లో నరికివేశారు. కేసు నమోదైనా ఇంత వరకు న్యాయం జరగలేదు.
 - శంకర్‌రెడ్డి, పెద్దెక్కలూరు,
 
 పెద్దపప్పూరు మండలం
  ఎస్పీ స్పందన : విచారణ జరపాలని పెద్దపప్పూరు ఎస్‌ఐ రాజును ఆదేశించారు.
  నా భూమిలో అక్రమంగా గనుల తవ్వకాలు చేపడుతున్నారు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు, న్యాయం చేయండి.
 - నర సింహులు, శింగనగుట్టపల్లిగ్రామం,
 పెద్దపప్పూరు మండలం
 తహశీల్దార్ రమాదేవి స్పందన : ముందుగా పొలం సర్వేకి దరఖాస్తు చేసుకోండి. గనుల తవ్వకాలు నిర్వహిస్తుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
   పెన్నా ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోండి.
 - చింతా పురుషోత్తం,
 
 చితంబరస్వామి కాలనీ, పెద్దపప్పూరు
 తహశీల్దార్ రమాదేవి : ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయించాం. ఆక్రమణదారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement