పాస్‌పోర్టుల కోసం దళారులు, ఏజెన్సీలను ఆశ్రయించొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): పాస్‌పోర్టు కోసం తప్పుడు డాక్యుమెంట్లు, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇబ్బందుల్లో పడవద్దని పాస్‌పోర్టు రీజినల్ అధికారి అశ్వని సత్తారు తెలిపారు. పాస్‌పోర్టుల అవసరం పెరిగిందని, వీటిని అందరికీ త్వరగా, పారదర్శకంగా ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పాస్‌పోర్టుల కోసం ఏజెన్సీలను, దళారీలను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు.
శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో 2 రోజుల పాస్‌పోర్టు సేవ శిబిరాన్ని ఆమె జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు రీజినల్ అధికారి మాట్లాడుతూ ఈ ఏడాది ఇంతవరకు పాస్‌పోర్టు కోసం 7.10 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 6.9 లక్షల పాస్‌పోర్టులు ఇచ్చామని తెలిపారు. పోలీస్ వెరిఫికేషన్ త్వరగా అవుతుండటం వల్ల ఎటువంటి జాప్యం లేకుండా ఇస్తున్నామన్నారు.
ఈ ఏడాది నవంబర్ 25 తర్వాత హ్యాండ్ రిటర్న్ పాస్‌పోర్టులు చెల్లుబాటు కావని, వాటిని మిషన్ రీడబుల్ పాస్‌పోర్టులుగా మార్చుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా నుంచి పాస్ పోర్టు కోసం 300 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, డాక్యుమెంట్లు, ధృవపత్రాల వెరిఫికేషన్ కోసం తీవ్ర వ్యయప్రయాసాలకు గురై హైదరాబాదుకు రాకుండా భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశాల మేరకు కర్నూలులో సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రతి జిల్లాలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని తెలిపారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నా రానివారు ఏజెన్సీలు, బ్రోకర్లను ఆశ్రయించరాదని, ఎందుకు రాలేదో స్వయంగా సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రతి పనిదినం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు సంప్రదించవచ్చని తెలిపారు. విమానాల్లో ప్రయాణించేవారు ప్రయాణించే వాటికి పాస్‌పోర్టు చెల్లుబాటు(వ్యాలిడిటీ) కనీసం ఆరు నెలలు ఉండాలన్నారు.
మైనర్లకు పాస్‌పోర్టు ఐదేళ్ల వ్యాలిడిటీతో ఇస్తామన్నారు. తర్వాత వాటిని పదేళ్ల వ్యాలిడిటీకి మార్చుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా బయోమెట్రిక్ ఇ-పాస్‌పోర్టులు రానున్నాయని తెలిపారు. సరైన డాక్యుమెంట్లు, ధృవపత్రాలు, వివరాలు ఇస్తే జాప్యం లేకుండా పాస్‌పోర్టులు ఇస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కర్నూలు ఆర్థిక రాజధాని కానుందని, ఇందుకు తగిన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ పాస్‌పోర్టు కోసం వచ్చిన దరఖాస్తులను 21 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి రవికోసూరి కూడా పాల్గొన్నారు. మొదటి రోజు 150 దరఖాస్తుదారుల ధ్రువపత్రాలను వెరిఫికేషన్ చేశారు. ఆదివారం కూడా సేవా శిబిరం కొనసాగనుంది.