భూమికోసం బలిదానం | For the land sacrifice | Sakshi
Sakshi News home page

భూమికోసం బలిదానం

Published Thu, Jul 9 2015 2:53 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

భూమికోసం బలిదానం - Sakshi

భూమికోసం బలిదానం

♦ ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురు రైతుల్లో ఇద్దరు మృతి
♦ ఉసురు తీసిన భూముల వేలం
♦ అన్నదాతలకు అండగా వైఎస్సార్ సీపీ, రైతు సంఘాల నేతలు
♦ గుంటూరులో రెండు గంటలపైగా రోడ్డుపై బైఠాయింపు
♦ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, భూమిని సాగుచేసుకునే  హక్కు : కలెక్టర్ కాంతిలాల్‌దండే
 
 భూమి జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాల్లో దేవాదాయశాఖ వేలం వ్యవహారం చిచ్చురేపింది. ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించిన భూమిని కోల్పోయాక బతుకెందుకు? అనుకున్న రైతులు ఉసురు తీసుకున్నారు. పురుగుమందు తాగిన ఆరుగురు రైతుల్లో రోజు వ్యవధిలో ఇద్దరు మృతిచెందటం విషాదం.
 
 తెనాలి : వారసత్వంగా వస్తున్న భూమిని కోల్పోయామనే బాధ ఒకరిదైతే, సొంత పొలాన్ని అమ్మి కొనుగోలు చేసిన ఆలయ భూమిని పోగొట్టుకున్నామనే దుఃఖభారం మరొక రైతుది. అమృతలూరు మండలం కోరుతాడిపర్రులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయం భూములకు దేవాదాయశాఖ ఈనెల 6న కౌలుహక్కుల వేలం నిర్వహించింది. ఆ భూమిని ఎంతోకాలంగా సాగుచేసుకుంటున్న రైతులు దూపాటి శివనాగేశ్వరరావు, నక్కా ఏడుకొండలు, రెడ్డి వెంకటసుబ్బమ్మ, గొడవర్తి నాగేశ్వరరావు, తాళ్లూరి బోసుబాబు, వీర్ణపు చెత్తయ్యలు పురుగుమందు తాగారు. తెనాలిలో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు వైద్యశాలకు తరలించారు. చికిత్స చేసినా ప్రయోజనం లేక వీరిలో బోసుబాబు, చెత్తయ్యలు మృతిచెందారు.

 సొంత పొలాన్ని తెగనమ్మాడు... చుండూరు మండలం ఆలపాడు రైతు వర్ణపు చెత్తయ్య (58) సన్నకారు రైతు. గ్రామం వెలుపల రహదారి వెంట అందుబాటులో ఉన్న 60 సెంట్ల పొలం యజమాని. భార్య దయమ్మ, అర్జునరావు, రాజేష్ అనే ఇద్దరు మగబిడ్డలతో కలిగినంతలో కలోగంజో తాగుతూ హాయిగా జీవిస్తున్న కుటుంబమది. కొన్నేళ్లక్రితం కోరుతాడిపర్రు గ్రామంలోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయ భూముల యజమానులు బేరం పెట్టారని తెలిసింది.

భార్య సమ్మతంతో పొలం అమ్మి, రెండు ఎకరాలు కొనుగోలు చేశాడు. మరో 1.10 ఎకరాల ఆలయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. మొత్తం 3.10 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ భూముల వేలంకు దిగటం, కోర్టు వాజ్యాలు తీవ్ర మనస్తాపాన్ని కలించింది. వేలంలో భూమిని దక్కించుకున్న కౌలుదారులు, పోలీసుల సాయంతో ఖాళీచేయించారు. పిల్లలిద్దరూ పెళ్లీడుకొచ్చారు. ఏం చేయలేని నిస్సహాయతతో చెత్తయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

 తిండికీ ఇబ్బందిపడ్డారు... అమృతలూరు మండలం వామనగుంటపాలెం రైతు తాళ్లూరి బోసుబాబు (65)కు సొంత పొలం సెంటు కూడా లేదు. తరాలుగా పెద్దలనుంచి సంక్రమించిన శ్రీచెన్నకేశవస్వామి ఆలయ భూమి 1.04 ఎకరాలను సాగుచేసుకుంటున్నాడు. భార్య లక్ష్మికి మోకాళ్లనొప్పులు. పెద్దకొడుకు మూగ. రెండో కొడుకు తెనాలిలో ఆటోమెకానిక్.  పోషణకు ఆలయ భూమే ఆధారం. తాను వ్యవసాయం చేస్తున్న పొలం తమది కాదంటే ఎలా నమ్ముతాడు?  అలాంటిది ఏకంగా వేలం వేసి కౌలుహక్కులను వేరొకరికి దాఖలుపరిస్తే నిర్ఘాంతపోయాడు.

గత డిసెంబరులో కోతకొచ్చిన పంటను పోలీసులు దగ్గరుండి కౌలుదారులచే కోయించి పంపటంతో ఆ కుటుంబం విలవిల్లాడింది. పంట చేతికిరాకపోవటంతో తిండికి కూడా కటకటలాడారు. పొలంపై ఆశలు వదులుకున్న బోసుబాబు పురుగుమందును ఆశ్రయించాడు. నక్కా ఏడుకొండలు, రెడ్డి వెంకటసుబ్బమ్మ, దూపాటి శివనాగేశ్వరరావు కూడా ఆలయ భూములను ఇతరులనుంచి కొనుగోలుచేసి కోల్పోయారు.

 ప్రభుత్వం అలసత్వంతోనే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు:  డాక్టర్ మేరుగ నాగార్జున
 వామనగుంటపాలెం (అమృతలూరు) : టీడీపీ ప్రభుత్వం అలసత్వంతోనే ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు.   వామనగుంటపాలేనికి చెందిన తాళ్ళూరి బోసుబాబు(65),  చుండూరు మండలం ఆలపాడుకు చెందిన వీర్నపు చెత్తయ్య(55) భౌతికకాయాలను బుధవారం నాగార్జున సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎస్టేట్ భూములను రైతులు పండించుకుంటున్నారని, ఇప్పుడు దేవాలయ భూములని అక్రమంగా లాక్కోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌కు, ఎండోమెంటు ఏపీ, డీసీకి తెలియకుండా వేలం పాటలు ఎలా జరిగాయంటూ దుయ్యబట్టారు. ప్రాణాలు కోల్పోయిన రైతులకు రూ.30 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 ‘ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం’
  విద్యానగర్(గుంటూరు) : ఇద్దరు రైతుల ఆత్మహత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఎస్టేట్ భూములను దేవాదాయశాఖ భూములుగా చూపి సాగు చేసుకుంటున్నవారిని ఇబ్బందులకు గురిచేయటంతో ఆరుగురు రైతులు ఆత్మహత్య యత్నించారని, వారిలో ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. రైతులకు అండగా బుధవారం గుంటూరులోని ప్రభుత్వాసుపత్రి వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

రైతుల కుటుంబాలను ఆదుకోవాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా మాట్లాడుతూ రైతులకు ఆదుకుంటామని చెప్పి ఓట్లు వేయించుకుని, నేడు ఆ రైతుల రక్తాన్ని తాగేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ధ్వజమెత్తారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ 60 ఏళ్లుగా అనుభవిస్తున్న పంటభూములను ప్రభుత్వం లాక్కునేందుకు పన్నాగం పన్నిందన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై వెంటనే హత్యానేరం కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అసభ్య పదజాలంతో దూషించి, రైతులను భయభ్రాంతులకు గురి చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మట్లాడుతూ ప్రభుత్వానికి భూదాహం పట్టుకుందని ఆరోపించారు. రైతుల కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రెండు గంటలకు పైగా రోడ్డుపై ైబైఠాయించి ధర్నా నిర్వహించటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

 మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే  హుటాహుటిన జీజీహెచ్ వద్దకు చేరుకుని నాయకులతో చర్చించారు. మృతుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకుంటే తాము ధర్నాను విరమించబోమని నాయకులు చెప్పారు. కలెక్టర్, అధికారులతో చర్చించి మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో అర్హులైనవారికి ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, భూమిని సాగుచేసుకునే హక్కును కల్పిస్తానని హామీ ఇచ్చారు. 

మరో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా గురించి అధికారులతో చర్చించి తెలుపుతారన్నారు. దీంతో నాయకులు ధర్నాను విరమించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతులమీదుగా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. అనంతరం మార్చురీలో ఇద్దరు రైతులు భౌతికకాయాలను కలెక్టర్, నాయకులు సందర్శించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ లక్షణరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ తదితర రైతు సంఘాల నాయకులు.. రైతుల భౌతిక కాయాలను సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement