సోమశిల జలాల కోసం పోరాడుదాం
రైతులతో ఎంపీ మేకపాటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు: సోమశిల జలాల కోసం పోరాడుదామని రైతులకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆత్మకూరులో బుధవారం వారిని రైతులు కలిశారు. రైతులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో సోమశిల ప్రాజెక్ట్ ఉన్నా ఈ ప్రాంత సాగునీటి అవసరాలు తీరడం లేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు స్పందిస్తూ సోమశిల ఉత్తర కాలువను నేరుగా వెళ్లి పరిశీలిద్దామని, అడ్డంకులు ఏవైనా ఉంటే శుక్రవారం నెల్లూరులో జరిగే సాగునీటి సలహా మండలి సమావేశంలో నేరుగా ప్రస్తావిద్దామని హామీ ఇచ్చారు. దీంతో గురువారం మధ్యాహ్నం సోమశిల ఉత్తర కాలువను పరిశీలించేందుకు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు తరలివెళ్లేందుకు సమాయత్తం కావాలని వారు పిలుపునిచ్చారు. రైతులు అందుకు సమ్మతించారు. గత రెండు,మూడు రోజులుగా ఆత్మకూరు ప్రాంతంలో సాగునీరు పుష్కలంగా అందక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, పంటలు నష్టపోయామని పలువురు రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ‘సీఈ, ఎస్‌ఈ, డీఈతో సోమశిల జలాలు గురించి చర్చించాం. నేరుగా ఐఏబీ సమావేశంలోనే రైతుల బాధలను వెల్లడిస్తాం. ముందుగా సోమశిల ఉత్తర కాలువ స్థితిగతులను తెలుసుకుందాం’ అంటూ రైతులతో ప్రజాప్రతినిధులు అన్నారు.