
ఉదయగిరి: ఉదయగిరి టికెట్ నిర్ణయం పూర్తిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ప్రకారమే ఉంటుందని, ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి విజయం కోసం పనిచేద్దామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆదివారం నెల్లూరులో మేకపాటి నివాసంలో రాజమోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా కోణాల్లో పరిశీలించి చేస్తారని తెలిపారు.
ఎవరికి టికెట్ ఇచ్చినా మేకపాటి కుటుంబం వారికి పూర్తి సహకారం అందిస్తుందని, అందరం కలిసికట్టుగా వైఎస్సార్‌సీపీని గెలిపించాలన్నారు. మరలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసుకునేలా పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. త్వరలో అభ్యర్థి విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ తర్వాత ఉదయగిరిలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని మండలాల నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మాట్లాడి చిన్ని చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుందామని తెలిపారు. ఉదయగిరికి మేకపాటి కుటుంబానికి నలభై ఏళ్ల అనుబంధం ఉందని, చంద్రశేఖరరెడ్డి వ్యవహారంతో కొంత ఇబ్బంది వచ్చిందన్నారు.
అందుకు మేకపాటి కుటుంబం తరపున ఉదయగిరి ప్రజలకు రాజమోహన్‌రెడ్డి క్షమాపణలు చెప్పా రు. మాజీ ఎంపీని కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు రావెళ్ల నాగేంద్ర, పావులూరు మాల్యాద్రిరెడ్డి, నాయకులు అండ్రా బాలగురవారెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, గంగవరపు పుల్లయ్య, గుంటుపల్లి నాగభూషణం, ఏనుగు వెంకటేశ్వరరెడ్డి, ఉండేల సుబ్బారెడ్డి, పెండ్యాల తిరుపతయ్య, బొమ్ము వెంకటరెడ్డి, బోగ్యం విజయ, వెంకటేశ్వర్లు, పి.విజయభాస్కరరెడ్డి, చెన్నారాయుడు, మధు, బాలచంద్ర, వెంగయ్యనాయుడు, రవి, రమేష్ తదితరులు ఉన్నారు.