
సీఎం ప్రయాణిస్తుండగా పూలవర్షం కురిపిస్తున్న మహిళలు
నెల్లూరు(సెంట్రల్): కావలిలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన 3.18 గంటల సేపు సాగింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్‌కు సీఎం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. 11.10 గంటలకు హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు.
తిరిగి 12.51 గంటలకు సభా ప్రాంగణం నుంచి బయలుదేరి 1.07 నిమిషాలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే వేచి ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను పేరుపేరునా పలకరించారు. ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి తమతో మాట్లాడడంతో నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జై జగన్ నినాదాలు
హెలిప్యాడ్ వద్ద నుంచి సభావేదిక వద్దకు సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సీఎంను చూసేందుకు ఆ దారి పొడవునా రోడ్డుకిరువైపులా ప్రజలు పెద్దఎత్తున చేరారు. కాన్వాయ్ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి ప్రతిచోట ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి 13 నిమిషాలకు పైగా సమయం పట్టింది. జగన్‌ను చూసిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ జై జగనన్న అంటూ నినాదాలు చేశారు.