వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తెలుగుదేశం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
ఇప్పటికే కాకాణి చేతిలో రెండు పర్యాయాలు సోమిరెడ్డి ఓటమి
వైఎస్సార్‌సీపీలోకి వెల్లువెత్తుతున్న వలసలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లాలో సర్వేపల్లి నియోజకర్గానికి అనేక ప్రత్యేకతలున్నాయి. విస్తారంగా సముద్ర తీరం ఉంది. వేలామందికి ఉపాధి కల్పిస్తున్న కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు మండలంలో ఉంది. దాని ఆధారంగా అనేక పరిశ్రమలున్నాయి. సర్వేపల్లిలో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉంటాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉంటారని ఎప్పుడో నిర్ణయమైంది. అయితే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారోనని కొద్దిరోజులు ఉత్కంఠ నెలకొంది. దీనికి చంద్రబాబు నాయుడు తెరదించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికే అవకాశం కల్పించారు.
మూడోసారి
పాత ప్రత్యర్థులైన మంత్రి కాకాణి, సోమిరెడ్డిల మధ్య మూడో పర్యాయం పోటీ నెలకొంది. జిల్లాలో చూస్తే పాతకాపుల మధ్య పోటీ సర్వేపల్లిలోనే నెలకొనడం విశేషం. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కాకాణి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి తలపడ్డారు. కానీ కాకాణి విజయం సాధించారు. 14లో 5,500 ఓట్లు, 19లో 14 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడినా సోమిరెడ్డిని చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన పదవిని అడ్డు పెట్టుకుని 2019 ఎన్నికల్లో సర్వేపల్లి బరిలో నిలబడి అస్త్రశస్త్రాలు ప్రయోగించి మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారు.
అదే బలం
కాకాణి సొంత మండలం పొదలకూరు ఆయనకు కంచుకోట. దీనిపై సోమిరెడ్డి మంత్రి హోదాలో ఫోకస్ పెట్టి ఎన్నో రాజకీయ విన్యాసాలు చేశారు. కాకాణి స్వగ్రామం తోడేరులో ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకున్నా తర్వాత వారు సొంత గూటికే చేరుకున్నారు. 2019లో ఎన్ని కుయుక్తులు పన్నినా ఒక్క పొదలకూరు నుంచి కాకాణి సోమిరెడ్డిపై 4,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడు కూడా సోమిరెడ్డి పొదలకూరు మండలంపైనే తన దృష్టిని నిలిపి గోవర్ధన్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
క్యూ కట్టి..
సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టి మరీ వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. వారిని సోమిరెడ్డి నిరోధించలేకపోతున్నారు. దీంతో తమ పార్టీకి చెందిన వారికే కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీ నుంచి వలసలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేగంగా అభివృద్ధి
అధికార పార్టీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా చేశారు. పల్లెల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరిగింది. మౌలిక వసతులు కల్పించారు. పంటలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భూపట్టాల పంపిణీ, చుక్కల భూముల సమస్యల పరిష్కారం, పరిశ్రమల స్థాపన, నాన్‌ఫిషన్‌మెన్ ప్యాకేజీ తదితర పనులను పూర్తి చేశారు. దశాబ్దాల నాటి సమస్యలకు గడప గడపకు మనప్రభుత్వంలో మంత్రి పరిష్కారం చూపారు. దీంతో సర్వేపల్లిలో మరోసారి కాకాణి విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment