ఫలించిన జ్యోతి న్యాయ పోరాటం
జెడ్పీ హైస్కూల్లో వంట సహాయకురాలిగా కొనసాగించాలని తీర్పు
ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖతో విధుల నుంచి తొలగించిన అధికారులు
అధికారుల తీరును తప్పు పట్టిన న్యాయస్థానం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కనుపూరు గ్రామానికి చెందిన జ్యోతి న్యాయ పోరాటం ఫలించింది. జ్యోతినే కనుపూరు ఉన్నత పాఠశాలలో వంట, సహాయకురాలిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి చెంప పెట్టుగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం చిరు ఉద్యోగుల పొట్టకొట్టే చర్యలకు సిద్ధపడింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఏళ్ల తరబడి వివిధ వ్యవస్థల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులను ఎడాపెడా తీసిపడేసి.. ఆయా స్థానాల్లో తమకు కావాల్సిన వారిని నియమించే విధంగా వ్యవహరిస్తోంది.
అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌లు, వీఓఏలు, పాఠశాలల్లో వంట, సహాయకురాళ్లుగా పనిచేసే వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించి, ఆయా పోస్టుల్లో కొత్త వారిని నియమించి ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోస్టును బట్టి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి మరీ వసూళ్లకు పాల్పడినట్లు ఇటీవల బీజేపీ నేత బహిరంగంగా ఆరోపించిన విషయం విదితమే. ఈ క్రమంలో కనుపూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వంట సహాయకురాలిగా పని చేస్తున్న జ్యోతిని విధుల నుంచి స్వచ్ఛందంగా మానుకోవాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారు.
టీడీపీ నాయకుల ఒత్తిళ్లను జ్యోతి లెక్క చేయకపోవడంతో ఆ పోస్టు నుంచి జ్యోతిని తొలగించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. తనకు జరిగిన అన్యాయంపై జ్యోతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖతో వంట సహాయకురాలిగా తొలగించడం అన్యాయమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జ్యోతి వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యే లేఖతో జ్యోతిని తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ, జ్యోతిని తిరిగి యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ పరిణామం సోమిరెడ్డికి చెంపపెట్టులాందటని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలతోనైనా సోమిరెడ్డి కనువిప్పుతో వ్యవహరించాలని సర్వేపల్లి నియోజవర్గ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment