సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులపై పార్టీ బలం పెంచాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు బలవంతంగా ఆ పార్టీ కండువాలు వేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉన్న క్రమంలో ఆ పార్టీ కార్యక్రమాలకు నలుగురిని పిలిచినా వచ్చే పరిస్థితి లేదు.
అంతకంటే ముందు ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సోమిరెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ నేత చినబాబు ‘వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వాళ్లకు ఈ దఫా టికెట్ లేదని’ ప్రకటించడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ రావడంపై అనుమానాలు ఉండగా సరికొత్త డ్రామాకు తెర తీశాడు. ఇప్పటికే మండలస్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకులపై రోజు పక్క పార్టీల నుంచి జనం టీడీపీలో చేరుతున్నట్లు చేయాలని ఒత్తిడి పెంచారు.
వెంకటాచలంలో మండలం టీడీపీ నాయకుల మధ్య అంతర్గతపోరు కొనసాగుతోంది. ఆ పార్టీ నాయకులు సోమిరెడ్డి వద్ద మెప్పు పొందేందుకు బయట నియోజకవర్గాల నుంచి అభిమానులను అద్దెకు తీసుకువచ్చి వెంకటాచలం మండలానికి సంబంధించిన వ్యక్తులుగా పరిచయం చేసి కండువాలు కప్పి టీడీపీలో చేరినట్లు చెప్పుకుంటున్నారు. గత ఏప్రిల్‌లో వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన రాజేంద్ర ఆధ్వర్యంలో వెంకటాచలంలో కార్యక్రమం నిర్వహించి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు వందల మంది టీడీపీలో చేరినట్లుగా సోమిరెడ్డి ప్రకటించి నవ్వుల పాలయ్యారు.
తాజాగా వెంకటాచలం మండలం కాకుటూరులో కొందరికి బలవంతంగా పార్టీ కండువాలు కప్పి వారంతా టీడీపీలో చేరినట్లు ప్రకటించుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. వెంటనే వారంతా వైఎస్సార్‌సీపీ నేత వెంకటశేషయ్య వద్దకు వెళ్లి తాము వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని, సోమిరెడ్డి బలవంతంగా కండువాలు వేశాడని తెలిపారు. ఇలా మరోసారి సోమిరెడ్డి నవ్వుల పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment