రాజ్యాధికారం అందరికీ దక్కాలనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పాన్ని నయా పెత్తందారులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. ఇలా అందరికీ సీట్లు కేటాయించి సామాజిక సమతుల్యతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి పాటిస్తోంది. తాజాగా జిల్లాలో మైనార్టీలకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ నెల్లూరు నగర సీటును కేటాయించడంతో ఓర్వలేని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసిన పార్టీకే పంగనామాలు పెట్టిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పోకడలపై నిన్నామొన్నటి వరకు దుమ్మెత్తి పోస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి తానేనంటూ ప్రకటించుకున్న ఆయన అకస్మాతుగా పార్టీని ఫిరాయించడం వెనుక ఏమి జరిగిందనే అంశం విస్తృత చర్చకు దారితీసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించారు. అయితే పెత్తందారీ పోకడలను అలవర్చుకున్న వేమిరెడ్డికి ఇది నచ్చకపోవడంతో పార్టీ కండువా మార్చారనేది నిర్వివాదాంశం. నెల్లూరు నగర సీటును తమకు కేటాయించడాన్ని సహించలేని వేమిరెడ్డి పార్టీ మారడంపై మైనార్టీలు మండిపడుతున్నారు.
అన్ని వర్గాలకు సముచిత స్థానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల కేటాయింపు సామాజిక సమతుల్యతతో సాగుతోంది. గతంలో మాదిరిగా కాకుండా అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుండటంతో పార్టీని అందరూ తమదిగా భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. ఇది ఓర్వలేని పెత్తందారుల పోకడలు ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కోవలోనే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడుగులు పడ్డాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మైనార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి తానేనని ప్రకటించుకున్న వేమిరెడ్డి ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ తరుణంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో ఆ స్థానాన్ని మైనార్టీలకు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఖలీల్ అహ్మద్ పేరును సీఎం ప్రకటించారు. ఇలా మైనార్టీ వ్యక్తి పేరును ప్రకటించగానే వేమిరెడ్డిలోని అసలు రంగు బయటపడింది. దీన్ని బూచిగా చూపి తనకు పార్టీలో గౌరవం లేదంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కందుకూరులో బీసీ సామాజికవర్గానికి సీటు కేటాయించడం కూడా ఆయనకు రుచించలేదని తెలుస్తోంది.
మండిపడుతున్న మైనార్టీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతోనే జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ పెద్దపీట వేసింది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్‌కుమార్‌కు రెండుసార్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఏకంగా మంత్రిని చేసింది. మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్‌కు మేయర్ పదవిని కట్టబెట్టింది. తాజాగా మరోసారి నెల్లూరు నగర సీటును మైనార్టీలకే కేటాయించారు. తమకు ఎనలేని ప్రాధాన్యమిచ్చి అసెంబ్లీకి పంపేలా చేస్తుంటే.. ఓర్వలేని వేమిరెడ్డి ఆత్మగౌరవమంటూ పార్టీ ఫిరాయించడంపై మైనార్టీ నేతలు భగ్గుమంటున్నారు. వేమిరెడ్డి కుటిల రాజకీయాలను ఛీదరించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment