కోవూరులో బెడిసికొడుతున్న టీడీపీ వ్యూహాలు | - | Sakshi
Sakshi News home page

కోవూరులో బెడిసికొడుతున్న టీడీపీ వ్యూహాలు

Published Tue, Apr 16 2024 12:15 AM | Last Updated on Tue, Apr 16 2024 1:27 PM

- - Sakshi

డబ్బుతో గెలుపు సులభమనుకున్న ప్రశాంతిరెడ్డి

విజయంపై నమ్మకం లేక అంతర్మథనం

రచ్చగా మారుతున్న ప్యాకేజీ రాజకీయాలు

దుమారం రేపుతున్న ఆడియో

పార్టీ శ్రేణుల్లో నానాటికీ పెరుగుతున్న కుమ్ములాటలు

డబ్బుతో ఏమైనా చేసేయొచ్చనే కొందరి అంచనాలు తారుమారవుతున్నాయి. నగదును వెదజల్లి తద్వారా గెలవొచ్చనే టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంచనాలు ప్రజాక్షేత్రంలో తలకిందులవుతున్నాయి. తన విజయం అంత సులభం కాదనే విషయం బోధపడటం.. పైగా వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకోవడం ఆమె వంతవుతోంది.

కోవూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోవూరు నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగదు ప్రలోభాలతో నేతలను టీడీపీలో చేర్చుకోవడం.. దురాయి పేరుతో మత్స్యకార గ్రామాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలను వేమిరెడ్డి దంపతులు ప్రకటించడం.. ఈ విషయాలు బయటకు పొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎక్కడికెళ్లినా సమస్యల స్వాగతం
ప్రచారంలో భాగంగా ప్రశాంతిరెడ్డి ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు వర్గపోరు.. మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఆమె చేతులెత్తేశారు. ఆత్మీయ సమావేశాలు.. ప్రచారాలు.. పార్టీ కార్యాలయాల ప్రారంభం.. ఇలా సందర్భమేదైనా గొడవలు మాత్రం కామన్‌గా మారుతున్నాయి. కోవూరు టీడీపీ సీటును ఆశించి భంగపడిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డి.. ప్రశాంతిరెడ్డి విజయానికి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవమో అర్థం కాని పరిస్థితి. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న కుమ్ములాటలకు వెన్నుపోటు రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది.

అడుగడుగునా ప్రతికూలతలే..
క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూల వాతావరణం లేదు. చంద్రబాబు గత పాలనను ప్రజలు నేటికీ మర్చిపోలేదు. 

రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల ను గతంలో ఆయన మోసగించారు. తాజాగా టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోను ఎవరూ నమ్మడం లేదు. మరోవైపు వలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్‌ ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం బూమరాంగ్‌ అయింది. చంద్రబాబు వ్యూహాలు, గత పాలన టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారాయి.

ఆడియో కలకలం 
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము గెలిస్తే ప్రజల్లో ఉంటామని.. ఓటమిపాలైతే వ్యాపారాలు చూసుకుంటామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే వేమిరెడ్డి దంపతులు గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడియో దుమారంతో వీరిపై నమ్మకం మరింత సన్నగిల్లింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement