
జనసేనను నిర్వీర్యం చేయడంలో టీడీపీ సక్సెస్
పక్కా వ్యూహంతో కుట్ర అమలు
కోవర్టులతో అలజడి రాజేసిన వైనం
దూరమవుతున్న కీలక నేతలు
మొన్న కేతంరెడ్డి.. నేడో..రేపో మనుక్రాంత్‌రెడ్డి
అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఉద్వేగపూరిత ప్రసంగాలతో ఊదరగొట్టే పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని జిల్లాలో టీడీపీ పాదాల చెంత తాకట్టు పెట్టారు. నెల్లూరులో తాను పుట్టి పెరిగానని పదే పదే చెప్పుకొన్న ఆయన చివరికి జిల్లాలో ఆ పార్టీ ఉనికే లేకుండా చేశారు. జిల్లాలో జనసేన జెండానే లేకుండా చేయాలనే తన అజెండాను అమలు చేయడంలో టీడీపీ సఫలీకృతమైంది. ఆ పార్టీని ఎంతో కాలంగా నమ్ముకొని.. పొత్తులో భాగంగా జిల్లాలో ఏదో ఒక స్థానంలో తమకు పోటీ చేసే అవకాశం లభిస్తుందనే ఆశతో ఉన్న నేతలకు ఈ పరిణామాలు మింగుడుపడటంలేదు. ఈ తరుణంలో ఎవరి దారి వారు చూసుకుంటూ గాజు గ్లాసును ఎత్తి పడేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నామమాత్రపు బలం.. ఆపై టీడీపీ అనుసరిస్తున్న అజెండాతో జిల్లాలో జనసేన కకావికలమవుతోంది. పొత్తులో భాగంగా జనసేన బలోపేతమవ్వడమనే మాట అటుంచితే.. మరింత కుదేలైంది. జిల్లాలో టీడీపీకి తన జనసేన పార్టీని పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టి నామరూపాల్లేకుండా చేశారు.
పొమ్మనకుండా.. పొగబెట్టారు..!
జిల్లాలో జనసేన జెండానే లేకుండా చేయాలనే సంకల్పంతో టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి దాన్ని అమలు చేయడంలో సక్సెస్ అయింది. తన అజెండా మేరకు జనసేనలో ఉన్న బలమైన సామాజికవర్గాన్ని పొమ్మనకుండా పొగబెట్టి.. ఆ పార్టీ అడ్రస్ లేకుండా టీడీపీ చేసింది.
ఊహలు తలకిందులు
గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేనకు ఆరు శా తం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్‌ను పెంచాలనే ఉద్దేశంతో పలువురు నేతలు అహర్ని శలూ కష్టపడ్డారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే భావనతో అప్పులు చేసి మరీ పార్టీ కార్యకలాపాలను సాగించారు. పైగా జనసేన కోసం కష్టపడే వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందనే పవన్ కల్యాణ్ ప్రకటనతో ఆ పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. టీడీపీతో పొత్తు తరుణంలో సీట్లు దక్కుతాయని.. ఎక్కడో ఓ చోట తాము పోటీ చేయొచ్చనే ధీమాతో ఉన్న జనసేన నేతల అంచనాలు తలకిందులయ్యాయి.
కోవర్టు ద్వారా విభేదాలు రాజేసి..
జనసేనలో ఉన్న ఓ సామాజికవర్గ నేతలను టీడీపీ టార్గెట్ చేసి వారిని దూరం చేసింది. రానున్న రోజుల్లో జనసేన జెండా కనిపించకూడదనే దిశగా అడుగులు పడుతున్నాయి. తొలుత టీడీపీ నేత నారాయణ తన శిబిరం నుంచి ఓ కోవర్టును జనసేనలోకి పంపి.. సదరు నేత ద్వారా పార్టీలో విభేదాలను సృష్టించారు. అప్పటి వరకు పార్టీ జెండాను మోసి.. కష్టపడి పనిచేస్తున్న నేతలను టార్గెట్ చేసి వారిని ఘోరంగా అవమానించి.. బయటకు పంపేలా చేశారు. ప్రస్తుతం టీడీపీ కోవర్టులనే జనసేన నేతలుగా చెప్పిస్తున్నారు. మరోవైపు కావలిలో జనసేన నేతలు పసుపు కండువా కప్పుకోవాల్సిందేనని టీడీపీ అభ్యర్థి బహిరంగంగానే బెదిరించారు.
ప్రచారానికి దూరం
జిల్లాలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరూ జనసేన కేడర్‌ను అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నారు. కొందరు కనీసం పిలిచి మాట్లాడకపోగా.. మరికొందరు బెదిరిస్తున్నారనే బాధ ఆ పార్టీ నేతల్లో ఉంది. అవమానాలను తట్టుకోలేక నేతలు చివరికి సైడ్ అయిపోయారు. ప్రజలకు మేలు చేసే పార్టీకే ఓట్లేస్తామని జనసేన కేడర్‌తో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు చెప్తున్నారు.
ఒక్కొక్కరుగా గుడ్ బై
ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా జనసేనాని పనిచేస్తున్నారనే అంశాన్ని ఆ పార్టీ కేడర్ కొంత ఆలస్యంగా గ్రహించింది. చివరికి పార్టీ కార్యకలాపాలకు ఒక్కొక్కరుగా దూరమయ్యారు.
► గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులుగా కేతంరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, మనుక్రాంత్‌రెడ్డి పోటీ చేశారు. ఓటమిపాలైనా పార్టీనే నమ్ముకొని భారీగా ఖర్చు పెట్టి కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. టీడీపీతో పొత్తు తరుణంలో, ఈ దఫా త్యాగాలకు పార్టీ కేడర్ సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో త న సీటుకు ఎసరు తప్పదనే ఉద్దేశంతో పార్టీకి కేతంరెడ్డి ముందే గుడ్ బై చెప్పారు.
► నెల్లూరు సిటీ పరిధిలో డివిజన్ల వారీగా పార్టీ కార్యాలయాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి తెరిచి కార్యకలాపాలను విస్తృతం చేశారు. అయితే తాను నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి నారాయణ ప్రకటించడంతో కంగుతిన్న మనుక్రాంత్‌రెడ్డి కనీసం రూరల్ సీటైనా వస్తుందని ఆశించారు. అయితే అక్కడా ఆయనకు శృంగభంగమే ఎదురైంది. వరుస భంగపాట్లతో జనసేనను వీడేందుకు ఈయన సిద్ధమయ్యారు.