టీడీపీ దురాయి దురాగతం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ దురాయి దురాగతం

Published Mon, Apr 1 2024 12:20 AM | Last Updated on Mon, Apr 1 2024 12:50 PM

- - Sakshi

ఓట్లను దురాయికి వేలం వేసిన టీడీపీ నేతలు 

 రూ.80 లక్షలకు ఒప్పందం

 టీడీపీకి ఓటు వేయకుంటే భారీ జరిమానా, గ్రామ బహిష్కరణ

 పచ్చపార్టీ దుస్సాహసం

 అంతర్గతంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు

కోవూరు: ఓట్ల కోసం టీడీపీ బరి తెగించింది. మత్స్యకార గ్రామాల్లో ‘దురాయి’ కట్టుబాటుతో గంపగుత్తగా ఓట్లు వేయించుకునే కుట్రకు తెరతీసింది. ఓటర్ల స్వేచ్ఛాయుత హక్కును కాలరాస్తూ ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు ధిక్కరించే దుస్సాహసానికి తెగబడింది. ‘దురాయి’ పేరుతో రాజకీయ కక్షలకు నిప్పు రాజేస్తోంది. ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ కృష్ణాపురం మత్స్యకార గ్రామంలో ఊరి పెద్దలుగా కాపులు ఉంటారు. వీరిని ప్రలోభపెట్టి ఓట్లను రూ.80 లక్షలకు కొనుగోలు చేయడం మత్స్యకార గ్రామాల్లో అలజడి సృష్టిస్తోంది.

‘దురాయి’ అంటే ?
మత్స్యకార గ్రామాల్లో వివాదాలు, ఘర్షణలు, తప్పులు జరగకుండా, ‘ఎవరైనా తప్పు చేస్తే.. ఆ తప్పును సరిదిద్దేందుకు’ నిర్దేశించుకున్న అసాంఘిక కట్టుబాటు ‘దురాయి’. విద్యకు, విజ్ఞానానికి, సామాజిక చైతన్యానికి దూరంగా ఉన్న రోజుల్లో ఆ పల్లెల్లో ‘దురాయి’ ఆచారంగా సాగింది. ఈ దురాచారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు టీడీపీని కబ్జా చేసినప్పటి నుంచి మత్స్యకార గ్రామాల్లో ఓట్లను ఏకపక్షంగా వేయించుకునే కుట్రలు చేశారు. మత్స్యకార గ్రామాల్లో యువత రెండు తరాలుగా చదువుకుంటూ విద్యావంతులుగా మారారు. దీంతో వారిలో చైతన్యం వెల్లివిరిసింది. దురాయిని క్రమక్రమంగా పక్కన పెట్టేశారు. ఓట్ల విషయంలో ఎవరి ఇష్టప్రకారం వారు వేసుకుంటున్నారు. ఇప్పు డు తెలుగుదేశం పార్టీ తన స్వార్థానికి ‘దురాయి’ని మళ్లీ వాడుకునేందుకు బయటకు తెచ్చింది. ఈ విధానాన్ని ఆ గ్రామంలో కొందుకు అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దురాయితో మళ్లీ గ్రామంలో వర్గ రాజకీయాలు చెలరేగే ప్రమాదం ఉందని ఆ మత్స్యకార గ్రామంతోపాటు మిగతా గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐదేళ్లలో సంక్షేమ పథకాలతో..
కృష్ణాపురంలో 716 ఓట్లు ఉన్నాయి. కేవలం మత్స్యసంపదపై ఆధారపడిన ఆ కుటుంబాలు వేట లేని సమయంలో వ్యవసాయ కూలీ పనులతో జీవనాన్ని సాగిస్తున్నారు. ఎంతో వెనుకబాటుకు గురైన గ్రామస్తులు నాలుగు దశాబ్దాలుగా పొలాలు వారి సాగులో ఉన్నా పట్టాలు లేక, ప్రభుత్వ పథకాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో 33 మంది మత్స్యకారులకు 31.64 ఎకరాల భూమికి అసైన్మెంట్‌ పట్టాలు ఇప్పించి, ఆ భూములకు శాశ్వత హక్కులు కల్పించింది. 40 ఏళ్ల నుంచి కాళ్లరిగేలా తిరిగినా ఏ ప్రభుత్వం చేయని ఈ పనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మత్స్యకారులకు చేసిపెట్టారు.

నుడా నిధులు రూ.75 లక్షలు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య నిధులు రూ.10 లక్షలతోపాటు మరో రూ.85 లక్షలలో గ్రామంలో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. కృష్ణాపురం మత్స్యకారులకు డీబీటీ ద్వారా రూ.5.98 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.3.06 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.35 లక్షలతో ప్రతి వీధికి పైపులైన్‌ వేసి ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా మరో రూ.5 లక్షల ఖర్చు చేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా రూ.25.68 లక్షలతో పీడీ కండ్రిగలో బోరు, మోటారు వేసి సుమారు 4.5 కిలోమీటర్ల మేర నీటిని నడిపి కృష్ణాపురంలోని వాటార్‌ ట్యాంక్‌కి కలిపి మంచినీటికి ఇబ్బందికి లేకుండా చూసిన ఘనత వైఎస్సార్‌సీపీది.

తాజాగా ఏం జరిగిందంటే..
మత్స్యకార గ్రామాల్లో కలహాలు రేపేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ‘దురాయి’ అనే దురాచారాన్ని అడ్డంపెట్టుకుని గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకు కుట్రలు చేస్తోంది. మత్స్యకార గ్రామాల్లో ఓట్లను టీడీపీకి ఏకపక్షంగా వేయించుకునేందుకు తెరతీసింది. ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో ప్రజలతో సంప్రదించకుండా కేవలం గ్రామానికి చెందిన కాపులతో మాట్లాడి ‘దురాయి’ విధించడాన్ని గ్రామస్తులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ కృష్ణాపురంలో శనివారం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో ఆ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించారు. ప్రజలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి వైఎస్సార్‌సీపీని ఆదరించాలని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులందరూ ఎమ్మెల్యేకు తమ సంఘీభావం తెలిపారు.

అయితే రాత్రికి రాత్రే టీడీపీ ఇందుకూరుపేట మండల కన్వీనర్‌ వీరేంద్రనాయుడు, వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన దువ్వూరు కళ్యాణ్‌రెడ్డి ఆ గ్రామ కాపులతో రహస్య ఒప్పందం చేసుకుని ఓట్లు కొల్లగొట్టేందుకు ‘దురాయి’కి ఒప్పించారు. దురాయి ప్రకారం ఎవరైనా తమ ఓటును టీడీపీకి వేయకపోయినా.. అసలు ఓటుకు రాకపోయినా రూ.లక్షల్లో జరిమానా, గ్రామ బహిష్కరణ విధించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామస్తులతో ఎలాంటి సమాచారం లేకుండా కేవలం గ్రామానికి చెందిన కాపులతో ‘దురాయి’ విధించడంపై గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నారు.

ఎన్నికల కమిషన్‌ ఏం చెబుతోందంటే..
ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. ఓట్లను కొనడం రాజ్యాంగ విరుద్ధమంటోంది. అయితే ఎన్నికల కమిషన్‌ ఆంక్షలను ధిక్కరించి టీడీపీ ఏకంగా దురాయి పేరుతో గంపగుత్తగా ఓట్లు కొనేందుకు తెగబడడం చూస్తే ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతారు చేయడమేనని స్థానికులు, రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి. ఒకే పోలింగ్‌ బూత్‌లో ఏకపక్షంగా ఓట్లు పడితే మళ్లీ రీపోలింగ్‌ జరిపే అవకాశం ఉంది. దురాయి పేరుతో ఓటర్లపై ఆంక్షలు విధించినట్లు నిర్ధారణ అయితే అందుకు బాధ్యులైన గ్రామ పెద్దలతోపాటు, ఓట్లు వేయించుకున్న పార్టీ అభ్యర్థిపై ఎన్నికల కోడ్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దురాయి విధించడంపై రాజకీయ పక్షాలు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement