ఉదయగిరి టీడీపీలో వర్గపోరు
కాకర్లకు సహకరించని బొల్లినేని వర్గీయులు
ప్రచారానికి దూరంగా ఉంటూ దెబ్బ తీసేందుకు లోలోన ప్లాన్
ఇంటిపోరుతో సతమతమవుతున్న కాకర్ల
ఉదయగిరి: ఉదయగిరిలో టీడీపీ పరిస్థితి చూస్తే పైకి సాఫీగా కనిపిస్తున్నా లోలోన ఆ పార్టీ నేతలు ఒకరికొకరు కత్తులు దూసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లినేని వెంకటరామారావుకు సీటు ఇవ్వకుండా.. ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కు ఉదయగిరి టికెట్ ప్రకటించడంతో బొల్లినేని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బొల్లినేని తన అనుచరులతో బహిరంగ సమావేశం నిర్వహించి చంద్రబాబు తీరును బహిరంగంగానే విమర్శించి డబ్బుసంచులకు అమ్ముడుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధినేత ఆదేశాల మేరకు బీద రవిచంద్ర బొల్లినేనిని ప్రసన్నం చేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను చేసిన మేలును మరిచి తనకు అన్యాయం చేశారంటూ బొల్లినేని ఆవేదన వ్యక్తం చేసి గత నెల రోజులుగా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. దీంతో బొల్లినేని అనుచరులు కొంతమంది పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా.. మరికొందరు అంటీముట్టనట్లు ఉంటున్నారు.
కుదరని సయోధ్య
బొల్లినేని అధినేత చంద్రబాబును కలవడంతో సమస్య సమసిపోయినట్టే అని పార్టీ క్యాడర్ భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాకర్ల సురేష్‌ను కలిసేందుకు బొల్లినేని ఇష్టపడడం లేదు. ఇటీవల తిరుపతి గెస్ట్‌హౌస్‌లో ఉన్న బొల్లినేనిని కలిసేందుకు కాకర్ల సురేష్ అక్కడకు వెళ్లినా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపంతో వెనక్కి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాకర్ల ఆత్మీయ సమావేశాల పేరుతో మండల కేంద్రాల్లో సభ లు ప్రారంభించగా.. బొల్లినేని లేకుండా తాము సమావేశాలకు రాలేమని కొంతమంది నేతలు చెప్పడంతో సభలు నిర్వహించడం ఆపేశారు. ఓవైపు బొల్లినేని సహకరించకపోవడం.. మరోవైపు నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుండడంతో కాకర్ల వర్గీయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గ్రూపు రాజకీయం
ప్రతి మండలంలో టీడీపీలో రెండు నుంచి ఐదారు గ్రూపులు ఉన్నాయి. వీటిని సమన్వయం చేసుకోవడం ఆ పార్టీ అభ్యర్థి కాకర్లకు తలకు మించిన భారంగా మారింది. దుత్తలూరు మండలంలో బొల్లినేని వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఉన్నారు. వింజమూరులో బొల్లినేని, కాకర్ల, ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపులు ఉన్నాయి. కలిగిరిలో బొల్లినేని వర్గీయులకు, కాకర్ల వర్గీయులకు పొసగడం లేదు. జలదంకి మండలంలో కాకర్ల వర్గీయులు, బొల్లినేని, కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గ్రూపులు ఉండగా.. తాజాగా ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, చేవూరు జనార్దన్‌రెడ్డి వర్గీయులు హడావుడి చేస్తున్నారు. దీంతో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థంకాక కాకర్లకు తల బొప్పికడుతోంది. పైగా ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గ్రూపు మరో సమస్యగా మారింది.
కాకర్లను ఓడించేందుకు ఎత్తులు
కాకర్ల ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే నియోజకవర్గంలో తనకు, తన కుటుంబసభ్యులకు మనుగడ ఉండదని భావించిన బొల్లినేని.. కాకర్లను ఓడించేందుకు పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. పార్టీని విభేదించకుండా, బయటపడకుండా కాకర్లని ఓడించి ఇంటికి పంపే వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం ఉంది. దీంతో ఆయా మండలాల్లో బొల్లినేని వర్గీయులకు పూర్తిస్థాయిలో పెత్తనం అప్పజెప్పకుండా కాకర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో బొల్లినేని అనుచరులు కాకర్లపై మరింత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకర్ల నుంచి పెద్ద మొత్తంలో ప్యాకేజీ వస్తుందని కొంతమంది ఆశించినా.. ఆ పరిస్థితి లేకపోవడంతో గుట్టుచప్పుడు లేకుండా కాకర్లను దెబ్బతీసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఉదయగిరిలో టీడీపీ దుస్థితి చంద్రబాబుకు టెెన్షన్‌గా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment