ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: అప్పుల భారంతో పంట చేనులోనే ఓ రైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని గర్జనపల్లికి చెందిన ఆరేల్లి పోషయ్య (53)అనే దళితుడికి భూమి లేదు. అప్పులు చేసి రెండెకరాల అటవీ భూమిని చదును చేసుకున్నాడు. రెండేళ్లుగా ఇందులో మొక్కజొన్న, వరి సాగుచేస్తున్నాడు. పంటల సాగు, కుటుంబ పోషణకూ అప్పు చేయాల్సి వచ్చింది. ‘అటవీ భూమి సాగు చేస్తున్నావు. కేసు నమోదు చేస్తాం’ అంటూ అటవీశాఖ అధికారుల బెదిరింపులు ఎక్కువయ్యాయి.
దీంతో పోషయ్య గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. మొత్తం రూ. 3లక్షలు అప్పుకావడం, సాగు చేసిన భూమిపై బెదిరింపులు కొనసాగుతుండడం.. అప్పులవాళ్ల వేధింపులు పెరగడంతో జీవితంపై విరక్తి చెందిన పోషయ్య చేనులోనే చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య రాజవ్వ, కుమారులు కృష్ణ, ఆంజనేయులు, కూతుళ్లు రుక్మిణి, అంజవ్వ, ఇందిర ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై రవీందర్ సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నకొమిరలో...
చిన్నకొమిర(ఓదెల): మండలంలోని చిన్నకొమిరలో కల్లెపల్లి మధునయ్య(45) అనే వ్యవసాయ కూలీ మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే గ్రామంలో అశోక్‌రెడ్డికి చెందిన 2ఎకరాల భూమిని మధునయ్య కౌలుకు తీసుకుని పత్తిపంట సాగు చేస్తున్నాడు. ఇటీవల రూ.2 లక్షలు అప్పుకావడంతో కలతచెందిన మధునయ్య ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.పొత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉసురు తీసిన అప్పులు
Published Wed, Sep 25 2013 5:08 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement