7వ వార్డులో స్థలాన్ని ఆక్రమించి బేస్‌మట్టాలు వేసిన దృశ్యం
సాక్షి, మాచర్ల: ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు. ఆ నాయకుడు వాలిపోతాడు.. చుట్టూ కంచె వేసి.. ఆ తర్వాత దర్జాగా అమ్మేస్తాడు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో కౌన్సిలర్ పదవిలో ఉండి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీశాడు. అప్పట్లో అధికారుల కళ్లకు గంతలు కట్టాడు. ఆ కబ్జాల బాగోతాన్ని ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆయన కొనసాగిస్తున్నాడు. మాచర్ల పట్టణంలోని కోట్ల రూపాయల విలువ చేసే 23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్ యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు సిద్ధమైనా రెవెన్యూ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అధికారంలో ఉందని పది సంవత్సరాలు మొదట కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టీడీపీ నాయకుడిగా వ్యవహరించిన మాజీ కౌన్సిలర్ 7వ వార్డులోని పలు చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడు.
ప్రభుత్వ భూమి కనపడితే చాలు ముందు రాళ్లేయటం, ఆ తర్వాత అమ్మేయటం అలవాటుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నాయకుడు దాదాపుగా 10 ఎకరాలను కాజేశాడు. ఆ ప్రభుత్వంలో కౌన్సిలర్‌గా ఉండి తాను ఆక్రమించిన ఇళ్లకు ఇంటి పన్ను పేరుతో ఖాళీ స్థలాలకు పన్ను వేయించాడు. అంతటితో ఊరుకోలేదు. ఇదంతా తన స్థలమేనని వ్యాపారం చేశాడు. తిరిగి కాంగ్రెస్ అధికారం కోల్పోగానే టీడీపీలో చేరాడు. 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందాడు. ఆ తర్వాత 7వ వార్డులోని సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో 3 ఎకరాలు, సాయిబాబా దేవాలయం వెనుక 10 ఎకరాలు, 7వ వార్డుకు వెళ్లే రహదారిలో నాలుగున్నర ఎకరాలను స్వా«ధీనం చేసుకొని రియల్‌ఎస్టేట్ మొదలుపెట్టాడు. ఇంత దర్జాగా వ్యాపారం చేసినా రెవెన్యూ, పురపాలక అధికారులు పట్టించుకోలేదు. అయితే ఆ కౌన్సిలర్ అంతటితో ఆగకుండా తనకు అడ్డం వచ్చిన ఓ వ్యక్తిని హత్య చేయించి కేసులో ఇరుక్కున్నాడు.
హైకోర్టు ఆదేశించినా....
పోలీసులు ఆ వ్యక్తిపై రౌడీషీట్ సైతం ఓపెన్ చేశారు. అయినా ఆక్రమణలను ఆపలేదు. చివరికి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు నెలల క్రితం హైకోర్టు పోలీసులకు ఆదేశాల జారీ చేయటంతో కేసులు నమోదు చేశారు. అయినా ఇప్పటికీ ఆక్రమణలను కొనసాగిస్తూ మూడు రోజులుగా ఖాళీగా ఉన్న స్థలాలలో ట్రాక్టర్ల ద్వారా రాళ్లను తోలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖాధికారులు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు అని చెప్పినా వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది.
ఆక్రమణలను గుర్తించాం
పట్టణంలోని 7వ వార్డులో ఇప్పటికి 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. కొంతమంది ఆక్రమణదారులపై పోలీసులకు సమాచారం ఇ చ్చాం. ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశాం. సాయిబాబా గుడి వెనుకాల 60 శాతం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేశారు. మిగతా భూ ములలో బేస్ మట్టా లు, రాళ్లు వేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
–సాంబశివరావు, ఆర్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment