అయ్యో.. రైతన్నా.. | former died due current shock | Sakshi
Sakshi News home page

అయ్యో.. రైతన్నా..

Published Sun, Jan 5 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

former died due current shock

కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన ఎరుకల మల్లయ్య గతేడాది నవంబర్ 10న పొలంలో విద్యుత్ మోటార్ వద్ద షాక్ తగిలి చనిపోయాడు. మల్లయ్య-రాధమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకులకు భూమి పంచి ఇవ్వగా.. మిగతా రెండెకరాల్లో మల్లయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. మల్లయ్య మృతితో రాధమ్మ పెద్ద దిక్కు కోల్పోయింది. ‘పెనిమిటి పంట కోసం చేసిన రూ.50 వేల అప్పు అట్లనే ఉన్నది. అప్పులోళ్లు ఆగనిత్తలేరు. సర్కారు సాయం పైసా అందలేదు’ అని మల్లయ్య భార్య రాధమ్మ కన్నీటి పర్యంతమవుతోంది. - న్యూస్‌లైన్,
 (కమలాపూర్)
 
 మంకమ్మతోట, న్యూస్‌లైన్ : ఓవైపు వచ్చీరాని కరెంట్.. వచ్చిన కాసేపైనా ఏదో ఒక లోపం.. ఆ లోపాన్ని సరిచేసేందుకు అందుబాటులో ఉండని సిబ్బంది.. మరోవైపు వేలాడుతున్న విద్యుత్ వైర్లు.. రక్షణ లేని సపోర్ట్ తీగలు రైతుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మోటార్ల ద్వారా మడులు తడిపి పంటలను కాపాడుకునేందుకు పొలాల వద్దకు వెళ్తున్న అన్నదాతలను కరెంట్ వైర్లే కాటేస్తున్నాయి. అధికారుల పుణ్యమా అని ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఆర్నెల్లలో సుమారు వంద మంది పొలాల్లోనే శవాలుగా మారారు. అర్ధరాత్రి ఇచ్చే కరెంట్‌కు ఇంటి
 పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, ట్రాన్స్‌కో చేష్టలుడిగి చూస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిస్తున్న అధికారులు, నాయకులకు అనంతరం ఓదార్చేందుకూ మనసు రావడం లేదు. ట్రాన్స్‌కో నిర్లక్ష్యంతో కరెంట్ కాటుకు రైతులు పిట్టల్లా రాలుతున్నా.. వారికి పరిహారం ఇప్పిద్దామన్న సోయి కూడా అధికారులకు రావడం లేదు. వారు ఎలా చనిపోయారో కూడా ధ్రువీకరించడం లేదు. ఆర్నెల్లలో వంద మంది వరకు మృత్యువాతపడినా.. అధికారుల రికార్డుల్లో మాత్రం 37 మందికి మించలేదు. గత రెండు సంవత్సరాల్లో జిల్లావ్యాప్తంగా వందలాది మంది రైతులు కరెంటు కాటుకు బలయ్యారు. విద్యుత్ శాఖ ఫీల్డ్ ఆఫీసర్ నివేదిక ప్రకారం నెల రోజుల్లో పరిహారం అందించాల్సి ఉంది. బాధిత కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను ఇటీవల రూ.2లక్షలకు పెంచారు. అయినప్పటికీ ప్రభుత్వపరంగా పైసా సాయం అందకపోవడంతో బాధిత కుటుంబాలు దిక్కులు చూస్తున్నాయి.
 
 ఆదుకునే చర్యలేవీ?
 లోవోల్టేజీ, సాంకేతిక సమస్యల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. సంబంధిత అధికారులకు సమాచారం అందిం చినా సకాలంలో స్పందించకపోవడంతో రైతులే ప్రాణాలకు తెగించి మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, మోటార్ల వద్ద విద్యుత్‌షాక్‌కు గురవుతున్నారు. సాంకేతిక సమస్యలపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నిండుప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇటీవల ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యం లో రైతుమిత్ర వాహనాలను ఏర్పాటు చేశారు.
 
 టాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా, విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తినా సమాచారం అందిస్తే రైతుమిత్ర వాహనం వచ్చి సమస్య పరిష్కరిస్తుందని అధికారులు ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా రైతుమిత్ర సేవలు అందడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వి ద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యు త్ షాక్‌తో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకోవడంతోపాటు.. భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలంటే మెరుగైన సేవలందించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement