రూ.5లక్షల సొత్తు మాయం
రామచంద్రపురం : ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్న గుర్తించిన దుండగులు లోనికి చొరబడి చోరీకి పాల్పడిన సంఘటన పట్టణంలోని హౌసింగ్ బోర్డులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డులోని శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయం సమీపంలో గల ఇంట్లో మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరిన వీర్రాజు నివాసం ఉంటున్నారు. 15 రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు. ఇంటి వద్ద కాపలాగా ఒక వ్యక్తి ప్రతి రోజు రాత్రి సమయంలో పడుకుంటున్నారు. శుక్రవారం రాత్రి అతడు ఇంటికి రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయం అదే వీధిలో ఉంటున్న ఉప్పలపాటి మాచిరాజు మాజీ ఎంపీపీ వీర్రాజు ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు.
ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్లి చూడగా సామగ్రి చెల్లా చెదురుగా పడి ఉండడంతో అనుమానం వచ్చి స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ బి.రవీంద్రనాథ్, ఎస్సై ఎల్.శ్రీనునాయక్‌లు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. తలుపుల లాక్‌లను బలవంతగా బద్దలు కొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు గమనించారు. ప్రస్తుతం షిర్డీలో ఉన్న వీర్రాజుతో స్థానికులు ఫోన్లో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో సుమారు రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటితో పాటుగా ఇంటి ఆవరణంలో ఉన్న కారును కూడా దొంగలు పట్టుకుపోయారు.
కారుతో కలిసి సుమారుగా రూ. 5 నుంచి రూ. 6 లక్షల విలువైన సొత్తును అపహరణకు గురైనట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీర్రాజు వచ్చిన తరువాత గానీ ఇంట్లో దొంగిలించబడిన వస్తువుల పూర్తి సమాచారం తెలియదని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. సుమారు ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు మద్యం తాగి ఇంట్లోకి చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ నుంచి క్లూస్‌టీం సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. పట్టణానికి చెందిన గరిగిపాటి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ఎంపీపీ ఇంట్లో చోరీ
Published Sun, May 24 2015 1:22 AM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM
Advertisement
Advertisement