సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేసానుపల్లి, దాచేపల్లి, కొండమోడుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన లైమ్‌స్టోన్(సున్నం రాయి) అక్రమ తవ్వకాల వ్యవహారంలో పోలీసులు తనను నిందితుడిగా చేర్చి, అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా యరపతినేని తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. లైమ్‌స్టోన్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఇందులో పిటిషనర్ యరపతినేని నిందితుడు కాదని తెలిపారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు పిటిషనర్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసు జారీ చేసి, అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పోలీసులను నిరోధించాలని చూస్తున్నారు
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. భారీ మొత్తంలో లైమ్‌స్టోన్‌ను కొల్లగొట్టారన్న ఆరోపణలు యరపతినేనిపై ఉన్నాయని తెలిపారు. ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పోలీసులు చేస్తున్న పనిని చేయకుండా వారిని నిరోధించాలని యరపతినేని కోర్టును కోరుతున్నారని వివరించారు. ఇలాంటి పిటిషన్లను న్యాయస్థానాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసుల్లో న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ను ఉల్లంఘిస్తూ ఏవైనా చర్యలు తీసుకుంటే అప్పుడు పిటిషనర్ కోర్టుకు రావొచ్చని, కేవలం భయాందోళన ఆధారంగా కోర్టుకు రావడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏజీని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment