సాక్షి, గుంటూరు: మంత్రులు ట్రాక్టర్లు ఎక్కి ఇనుప నాగళ్ళతో పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు రైతుల గుండెల్లో గునపాలను దించుతున్నట్లున్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 33 వేల ఎకరాల రైతుల భూములను రూపాయి ఖర్చు లేకుండా సమీకరించామని ప్రపంచమంతటా డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబుకు చెక్కుల పంపిణీ ఎందుకు చిక్కులు తెచ్చిపెడుతోందని ప్రశ్నించారు.
సమీకరించామని చెప్పుకుంటున్న భూముల యజమానుల్లో పదిశాతం కూడా చెక్కులు తీసుకొనేందుకు ముందుకు రాకపోవటం వెనుక రైతుల గుండెకోత ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. రైతులు కార్యాలయాలకు రాకపోవటంతో నాయకులు, అధికారులు వారి ఇళ్లకు వెళ్లి బతిమాలి మరీ చెక్కులు అందజేస్తున్నారని ఆర్కే ఎద్దేవా చేశారు. ఎలాగోలా రైతులను ఒప్పించి సంతకాలు పెట్టించుకొంటే తన లక్ష్యం నెరవేరుతుందని మంత్రి నారాయణ ఇక్కడే మకాం వేసి మంత్రాంగం నడుపుతున్నారన్నారు.
ఈ ఏడాది చెక్కులు ఇస్తున్న నారాయణ ప్రతి ఏడాదీ ఇలాగే అందరికీ చెక్కులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. అనధికారిక రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును తయారు చేసే పనిలో పడ్డారని, మరెందరో రైతులను మభ్యపెట్టాల్సిన గురుతర బాధ్యతను చంద్రబాబు ఆయనకు అప్పగించారని తెలిపారు. రుణాలు మాఫీ కాక హైద రాబాద్ చుట్టూ తిరుగుతున్నట్లుగానే వచ్చే ఏడాది నుంచి కౌలు చెక్కుల కోసం రైతులంతా నారాయణ కాలేజిల గేట్ల ముందు పడిగాపులు కాయాలా అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్ళ పోస్ట్ డేటెడ్ చెక్కులు లేదా కాలావ్యవధి బాండ్లను రైతులకు ఇప్పుడే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు కౌలు చెక్కులతో పాటు రైతుకూలీలకు రూ. 2,500 చొప్పున భృతి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కౌలు రైతులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ వృత్తుల వారి గతి ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్ళవరకు ఎన్నికలు లేవన్న ధైర్యం తో నియంతృత్వ నిర్ణయాలకు తెగబడుతున్న చంద్రబాబు అండ్ కోకు న్యాయస్థానాలు బుద్ధి చెబుతాయని ఆర్కే హెచ్చరించారు.
రైతుల గుండెల్లో గునపాలు
Published Sun, Apr 19 2015 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement