హిందూపురం ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీస్తున్న కలెక్టర్ గంధం చంద్రుడు, చిత్రంలో జేసీ డిల్లీరావు
సాక్షి, హిందూపురం: కరోనా పాజిటివ్ కేసుల నేప«థ్యంలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు హిందూపురంను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కర్ఫ్యూ స్థాయిలో లాక్‌డౌన్ పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. నిబంధనలు సైతం మరింత కఠినతరం చేస్తున్నట్లు వెల్లడించారు. హిందూపురంలో మూడురోజులుగా మాకాం వేసిన కలెక్టర్ ఇప్పటికే పలు దఫాలుగా వైద్యాధికారులు, రెవెన్యూ, మున్సిపల్ ఇతర శాఖ అధికారులతో పాటు మత పెద్దలు, పుర ప్రముఖులతో సమావేశమయ్యారు. (ఓ నాన్న.. నీ మనసే వెన్న)
అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని రానున్న నాలుగురోజులు ‘పురం’ పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలెవరూ బయటకు వచ్చేందుకు వీలు లేదన్నారు. రెడ్‌జోన్‌తో పాటు అన్ని ప్రాంతాల్లోని వారికి నిత్యావసర వస్తువులు, పాలు, సరుకులు, మందులన్నీ ఇళ్ల వద్దకే చేరేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం సాయంత్రం జేసీ డిల్లీరావు, సబ్ కలెక్టర్ నిషాంతితో కలిసి హిందూపురం ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాతా శిశు వైద్యశాలలోని వార్డులను, స్వైన్‌ఫ్లూ వార్డులను, ఓపీ నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులను అడిగి తెలుసుకున్నారు.
కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం తీసుకోవాలని ఇన్‌చార్జి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పట్టణంలో ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏయే సేవలు అందుతున్నాయో కలెక్టర్ ఆరా తీశారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ ప్రసాద్ బాబు, ట్రైనీ ఐఎఫ్‌ఎస్ అధికారి చైతన్య, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాజిటివ్ బాధితుల్లో గుజరాతీయులే ఎక్కువ
జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో గుజరాత్‌వాసులే అధికంగా ఉన్నారని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘పురం’లో ఉంటున్న గుజరాత్‌కు చెందిన 24 మంది, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున మొత్తం 26 మంది కరోనా బారిన పడ్డారన్నారు. హిందూపురంలో మొత్తం 45 కేసులు నమోదు కాగా.. 12 మంది కోలుకొని ఇంటికి చేరారన్నారు. ఇక హిందూపురానికి చెందిన పాజిటివ్ కేసుల్లో నాలుగు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందని, అందువల్లే బాధితులంతా కోలుకుంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment