నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని ఆమంచర్ల సమీపంలో అక్టోబర్ 11వ తేదీన దళితనాయకుడు బిరదవోలు చిరంజీవి అలియాస్ ఆమంచర్ల చిరంజీవి హత్యలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఆయన వెల్లడించారు. గురువారం రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు దారితీసిన పరిస్థితులను ఎస్పీ వివరించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చిరంజీవి ఒక రాజకీయపార్టీకి మద్దతు పలికారు.
వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగకు చెందిన దొడ్ల శీనయ్య కొంతకాలం క్రితం తన అత్తగారి ఊరు ఆమంచర్ల పంచాయతీ గోటువారికండ్రిగలో నివాసం ఉంటున్నాడు. ఇతను స్థానికంగా రాజకీయంగా ఎదగాలని నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే శీనయ్య, అతని బంధువు కూకటి చెంచయ్యతో చిరంజీవికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. చిరంజీవి మద్దతు పలికిన అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు. గోటువారికండ్రిగ చెరువులో మట్టిని తరలించే విషయమై వీరి మధ్య ఘర్షణ జరిగింది. చిరంజీవి తమకు ప్రతి విషయంలో అడ్డు తగులుతున్నాడని, ఇతడిని ఎలాగైనా హతమార్చాలని శీనయ్య, చెంచయ్య భావించారు. చిరంజీవిపై వ్యతిరేకత ఉన్న ఆమంచర్లకు చెందిన బిరదవోలు పెంచలయ్యను తమతో కలుపుకున్నారు. శీనయ్యకు పరిచయం ఉన్న వేదాయపాళెంకు చెందిన పాతనేరస్తుడు కొండ్రెగుల సురేష్‌ను తమకు సహకరించాలని కోరారు.
చిరంజీవిని అంతమొందించేందుకు పధకం రూపొందించారు. నిత్యం నగరం నుంచి ఇంటికి వెళ్లేందుకు కొత్తూరు వైపు చిరంజీవి వెళుతుంటాడని గమనించిన వీరు కొత్తూరు వద్ద అక్టోబర్ 11వ తేదీ రాత్రి కాపు కాశారు. నెల్లూరు నుంచి రాత్రి 8.45 గంటల సమయంలో ఒంటరిగా మోటారు సైకిల్‌పై ఆమంచర్లకు వెళుతున్న చిరంజీవిని వెంబడించారు. ఆమంచర్ల సమీపంలోని ఊటగుంట వద్దకు వచ్చేసరికి చిరంజీవిని అడ్డగించారు. దీంతో చిరంజీవి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటాడి తమ వెంట తెచ్చుకున్న చిన్న బరిసెతో విచక్షణా రహితంగా చిరంజీవిని పొడిచారు. దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభ్యం కాకుండా హత్య చేసిన వ్యక్తులు జాగ్రత్త పడ్డారు. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి కేసును దర్యాప్తు చేశారు. హత్యకు దారితీసిన కారణాలను అన్ని కోణాల్లో పరిశీలించారు. అనుమానితులను స్టేషన్‌కు తీసుకువచ్చి తమదైన రీతిలో విచారించడంతో నిందితులు నిజం ఒప్పుకున్నారు. హత్యకు ఉపయోగించిన చిన్న బరిసెను, మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
శివారు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం : నగర శివారు ప్రాంతమైన కొత్తూరు, ఆమంచర్ల పరిసర ప్రాంతాల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ రామకృష్ణ అన్నారు. నేరాల అదుపునకు పోలీసులు కృషి చేయాలని సూచించారు. ఆమంచర్ల చిరంజీవి హత్యకేసు మిస్టరీని ఛేదించిన రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డిని, సహకరించిన కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ డీఎస్పీ బాలవెంకటేశ్వరరావు, సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై వెంకట్రావ్ పాల్గొన్నారు.
దళితనేత హత్యకేసులో నలుగురి అరెస్ట్
Published Fri, Nov 1 2013 4:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement