- చికిత్స కోసం వచ్చిన బాలిక అకస్మాత్తుగా మృతి..
- మృతదేహాన్ని ఇంటికి తరలించమంటూ విలపించిన తల్లి, తాత
- చందాలు వేసుకుని సాయం చేసిన స్థానికులు
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ బాలిక అకస్మాత్తుగా మృతిచెందింది. అయితే మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు చేతిలో డబ్బు లేకపోవడంతో తల్లి, తాత నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వారి దీనావస్థను చూసి స్థానికులు స్పందించి మానవతా దృక్పథంతో చందాలు వేసుకుని బాలిక మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు. పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటనను చూసిన పలువురి కళ్లు చెమర్చాయి.
మండవల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన మద్దాల శ్రీనివాసరావు, రమణ దంపతుల కుమార్తె కళ్యాణి(13) ఏడో తరగతి చదువుతుంది. బాలిక 20 రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో గుడివాడ తీసుకొచ్చి ఏలూరు రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తల్లి రమణ, తాత బుధవారం మరోసారి ఇక్కడకు తీసుకొచ్చారు.
పట్టణంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి తాడు వేయించారు. ఆటోలో తిరిగి వస్తుండగా మున్సిపల్ కార్యాలయం సమీపంలో అందులోనే బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని చెప్పారు.
దీంతో ఏజీకే పాఠశాల పక్క గేటు వద్ద మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఊరికి తీసుకెళ్లేందుకు చిల్లిగవ్వ లేదని తల్లి, తాత విలపించారు. స్థానికులు స్పందించి చందాలు వేసుకున్నారు. ఆటో మాట్లాడి రూ.200 ఆయిల్ కొట్టించారు. బాలిక కుటుంబీకులకు మరో రూ.700 ఇచ్చి మృతదేహాన్ని ఆటోలో పంపి మానవత్వాన్ని చాటుకున్నారు.