ఇందిరమ్మ జీప్లస్2 గృహాలు
పేదల ఇళ్లను అడ్డుపెట్టుకుని కాసుల పంట పండించుకుంటున్నారు.. మౌలిక వసతుల కోసం మంజూరైన నిధులు బొక్కేయాలని చూస్తున్నారు.. ప్రారంభోత్సవం పేరుతో అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేటలో గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమార్కుల దందాపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిలకలూరిపేట: గృహకల్ప ఇళ్లలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గూడు లేని పేద, దిగువ మధ్యతరగతి వారి కోసం నిర్మించిన గృహాలూ వారి దోపిడీకి వరప్రదాయనిగా మారాయి. మరోవైపు తాగునీరు, పక్కా రోడ్లు వంటి మౌలిక వసతులు సమకూర్చకుండానే గృహసముదాయానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి ప్రారంభోత్సవం నిర్వహించటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.
ఇళ్లు పూర్తయినా...
2006లో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం సమీపంలో ఎన్‌ఆర్‌టీ రోడ్డు పక్కన సొంత ఇళ్లు లేని వారి కోసం రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా అపార్ట్‌మెంట్ల తరహాలో మూడు బ్లాకులుగా 72 గృహాల నిర్మాణం ప్రారంభించారు. లబ్ధిదారు వాటాగా రూ.8250, ప్రభుత్వ సబ్సిడీ రూ.10 వేలు, బ్యాంకు రుణం రూ.74,250గా నిర్ణయించి ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అయితే తలుపుల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అదే ప్రాంగణంలో 2008లో ఇందిరమ్మ ఇళ్లు జీ ప్లస్ 2 ప్రాతిపదికన ఎనిమిది బ్లాకులుగా 192 గృహాలు నిర్మించేందుకు అనుమతి లభించింది. వాటిని పేద, దిగువ మధ్యతరగతి ఆర్యవైశ్యులకు కేటాయించారు.
అయితే బ్యాంకు రుణాలు అన్ని ఇళ్లకూ లభించకపోవటంతో ఒక్కో బ్లాకుకు 24 ఇళ్ల చొప్పున 120 ఇళ్ల నిర్మాణం శ్లాబుల వరకు పూర్తయి ఆగిపోయింది. మరో 72 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. వీటిలో ఇళ్ల నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.28 లక్షలుగా నిర్ణయించగా లబ్ధిదారు వాటాగా మొత్తం 192 మంది రూ.20 వేల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని అప్పటి ప్రభుత్వమే కేటాయించింది.
వైఎస్సార్ మరణంతో గృహ నిర్మాణం మధ్యలో నిలిచిపోవటంతో రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ జీ ప్లస్ 2 లబ్ధిదారులు కలిసి బాపూజీ పౌరసేవా కేంద్రంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు, పాలకుల చుట్టూ అనేక పర్యాయాలు తిరిగారు. అనంతరం రూ.3.85 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో రాజీవ్ గృహకల్ప 72 ఇళ్లు, ఇందిరమ్మ జీ ప్లస్ 2కు సంబంధించిన 120 ఇళ్లు వెరసి మొత్తం 192 ఇళ్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి ఇవ్వాల్సి ఉంది.
వసూళ్ల పర్వం ఇలా...
లబ్ధిదారులే ఒక సంఘంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి కోసం కృషి చేయగా, నిధులు మంజూరైన అనంతరం లబ్ధిదారు కూడా కాని టీడీపీ పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు, మంత్రికి అనుంగు అనుచరుడైన వెల్లంపల్లి రవిశంకర్ అధ్యక్షుడు గృహ సముదాయం పేరును ఆదర్శ గృహకల్ప, ప్రత్తిపాటి నగర్‌గా మార్చేశారు. గృహ ప్రవేశాలకు ఖర్చులు అవుతాయంటూ 192 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.5 వేలు చొప్పున చెల్లించాలని చెప్పారు. సొమ్ము ఎందుకు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు ప్రశ్నించటంతో ఒక్కొక్కరు రూ.2500 చొప్పున చెల్లించాలని అందరికీ ఫోన్ మెసేజ్‌లు పెట్టి మరీ వసూలు చేశారు.
బ్యాంకు రుణం ఇవ్వకపోయినా...
జీ ప్లస్ 2 గృహాలకు సంబంధించి 120లో 96 గృహాలకు మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. మిగిలిన 24 ఇళ్లకు రుణాలు మంజూరు కాలేదు. రుణాలు మంజూరైన 96 మంది వన్‌టైం సెటిల్‌మెంట్‌గా ఒక్కొక్కరు రూ.26 వేల చొప్పున ఆయా బ్యాంకులకు ఇప్పటికే చెల్లించేశారు. రుణం మంజూరుకాని 24 ఇళ్లు కూడా అంతకు ముందే శ్లాబు దశ వరకు పూర్తయి ఉండటంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి.
దీంతో 96 మంది లబ్ధిదారులు బ్యాంకుకు రూ.25 వేలు చెల్లించిన విధంగా తమకూ చెల్లించాలని ఆదర్శ గృహకల్ప అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న మంత్రి అనుచరుడైన టీడీపీ నాయకుడు వెల్లంపల్లి రవిశంకర్ డిమాండ్ చేస్తున్నాడని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తం 24 మంది వద్ద నుంచి రూ.6 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇలా అక్రమంగా వసూలు చేసిన డబ్బు ఎవరి కొంగున ముడిపడతాయన్నది జగమెరిగిన సత్యమేనని మండిపడుతున్నారు.
మౌలిక వసతులేవీ?
ఆర్భాటంగా ప్రారంభించిన ఆదర్శ గృహకల్పలో మౌలిక వసతులు సమకూరలేదు. మంచినీటి పైపులైన్ కూడా ఏర్పాటు చేయలేదు. పక్కా రోడ్లు నిర్మించలేదు. విద్యుత్ పనులు పూర్తికాలేదు. దీనిపై లబ్ధిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డబ్బు కట్టమంటున్నారు
జీ ప్లస్ 2 గృహ సముదాయంలో బ్యాంకు రుణం లేకుండా ఇల్లు వచ్చింది. బ్యాంకు రుణం తాలూకు డబ్బులు తమకు చెల్లించాల్సిందిగా వెల్లంపల్లి రవిశంకర్ అడుగుతున్నాడు. అసలు రుణం మంజూరుకాకుండా డబ్బులు ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వ శాఖల రసీదు ఉంటే కడతానన్నాను.
– కొత్త వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు
తాళాలు ఇవ్వలేదు
ప్రారంభ ఖర్చులకని రూ.2500 అడిగారు. నేను మసాలా బండి వేసుకొని జీవనం వెళ్లదీస్తాను. డబ్బులు ఇవ్వలేనన్నాను. దీంతో రవిశంకర్ నాకు తాళాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బులు చెల్లిస్తేనే ప్లాటు తాళాలు ఇస్తామంటున్నారు.
– కె.వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు
డీడీ చెల్లించాం
జీ ప్లస్ 2లో ఇంటి కోసం నా భార్య జయలక్ష్మి పేరున రూ.20 వేలు డీడీని 2008లో చెల్లించాం. మాకు అప్పట్లోనే ప్రభుత్వం స్థల కేటాయింపు పత్రం ఇచ్చింది. అయితే మాకు ప్లాటు రాలేదు. ఇళ్లు నిర్మించని 72 మంది జాబితాలో మా పేరు ఉంది. మా డబ్బు, ఇంటి స్థలం ఏమైనట్టు?
– పోలిశెట్టి సాంబశివరావు, లబ్ధిదారుడు
Comments
Please login to add a commentAdd a comment