దరఖాస్తులు స్వీకరిస్తున్న కియాన్ సిబ్బంది
పెనుకొండ రూరల్: కరువు పీడిత ‘అనంత’లో నెలకొల్పుతున్న కియా కార్ల పరిశ్రమ నిరుద్యోగుల్లో ఆశలుæ రేపుతోంది. అందులో ఉద్యోగాలంటే భారీ వేతనాలు ఉంటాయని, జీవితంలో స్థిరపడవచ్చని ఎంతోమంది విద్యావంతులు భావిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పెనుకొండ మండలం అమ్మవారుపల్లి సమీపంలో ఏర్పాటయ్యే కియా పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వమే చూస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే నిరుద్యోగుల అవసరాలను గుర్తించి, వారిని నిలువు దోపిడీ చేసేందుకు కొన్ని సంస్థలు తెగించాయి.
కియా కార్ల పరిశ్రమతోపాటు అనుబంధ సంస్థలైన యూంగ్ చాంగ్, కుక్ బూ తదితర కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ‘కియాన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ’ బోర్డు పెట్టింది. ఏ కేటగిరీ ఉద్యోగాలు.. ఎంతమంది అవసరమవుతాయి అనే వివరాలు తెలపకుండానే దరఖాస్తుల స్వీకరణకు తెర తీసింది. ఈ ప్రకటనకు ఆకర్షితులై ఇప్పటి వరకు నాలుగు వేలమందికి పైగా నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఆ ఏజెన్సీ వారికి అందజేశారు. అసలు కియా అనుబంధ సంస్థలు ఏర్పాటు కాకముందే, కనీసం వాటి నుంచి టెండర్లు రాకుండానే నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి ఇలాంటి సంస్థలపై విచారణ చేసి నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
బోగస్ సంస్థలను నమ్మొద్దు
అమ్మవారిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కియాన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ బోగస్ సంస్థ. నిరుద్యోగులు అలాంటి సంస్థలను నమ్మి మోసపోవద్దు. కియా పరిశ్రమలోనే కాదు వాటి అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు వెబ్‌సైట్ నుంచే వెలువడుతాయి. సదరు సంస్థపై విచారణ చేపడతాం. – రామమూర్తి, ఆర్డీఓ, పెనుకొండ
Comments
Please login to add a commentAdd a comment