► సెక్రటేరియట్ ఉద్యోగి ఘరానా దందా
► పాస్‌ల కోసం డిపాజిట్ల పేరుతో బురిడీ
సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడి సెక్రటేరియట్‌లో కేటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఓ ఉద్యోగి పలువురిని బురిడీ కొట్టిస్తున్నారు. ఏకంగా తన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయించుకుని ఆ తరువాత పత్తా లేకుండా పోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పేరు చెబుతూ మాయ చేస్తున్నారు. ఫోన్ల ద్వారానే బోల్తా కొట్టిస్తున్న ఈ ఘరానా మోసగాడి ఉదంతం ఇదిగో ఇలా ఉంది...
విజయవాడలోని ఓ కేటరింగ్ సర్వీసు యజమానులకు కొన్నిరోజుల క్రితం ఒకరు ఫోన్ చేశారు. తనని తాను సెక్రటేరియట్‌లోని బీ సెక్షన్‌లో పనిచేసే త్రివిక్రమ్‌గా పరిచయం చేసుకున్నారు. ‘సెక్రటేరియట్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ నెల 17, 18, 19 తేదీలలో మూడురోజులపాటు సెమినార్ ఉంది... అందుకు కాఫీ, టిఫిన్లు, భోజనాలు సరఫరా చేయాల్సి ఉంటుంది’అని తెలిపారు. ‘టీడీపీ ఎమ్మెల్యే’ మీ కేటరింగ్ పేరు సూచించారు. అందుకే మీకు ఫోన్ చేశాం’అని కూడా అన్నారు. దాంతో ఆ కేటరింగ్ యజమానులు నిజమేనని నమ్మారు. ‘కేటరింగ్ కాంట్రాక్టు కావాలంటే మీకు, మీ వాహనాలు సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు పాస్ ఉండాలి.
అందుకు మీరు బ్యాంకు ఖాతాలో రూ.11,600 చెల్లించండి. ఆ బ్యాంకు రశీదు నంబర్ మాకు వాట్సాప్‌లో పంపండి. అప్పుడు మీకు సెక్రటేరియట్‌లో ప్రవేశానికి పాస్ ఇస్తాం. అనంతరం సెక్రటేరియట్‌కు వస్తే కాంట్రాక్టు ఖాయం చేస్తాం’అని తెలిపారు. మర్నాడు మరొకరు జానకీరామయ్య అనే ఆయన కూడా ఫోన్ చేసి తాను సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు. త్రివిక్రమ్ అనే సెక్రటేరియట్ ఉద్యోగి చెప్పడంతో తాను ఫోన్ చేస్తున్నానని అన్నారు. కేటరింగ్ కాంట్రాక్టు కావాలంటే సెక్రటేరియట్ పాస్ కోసం రూ.11,600 చెల్లించాలని చెప్పారు. ఆంధ్రాబ్యాంకు ఖాతాలో (నంబర్ 165910100030956)లో నగదు డిపాజిట్ చేయమని చెప్పారు. వాస్తవానికి ఆ బ్యాంకు ఖాతా నేలపట్ల రాకేష్ అనే పేరున ఉంది.
కానీ ఇదేమీ పెద్దగా పట్టించుకోకుండా ఆ కేటరింగ్ సర్వీసు యజమానులు ఆ బ్యాంకు ఖాతాలో రూ.11,600 చెక్కును తమ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డిపాజిట్ చేశారు. ఆ విషయాన్ని తమకు ఫోన్‌చేసిన వారికి చెప్పారు. దానిపై ఆయన స్పందిస్తూ ‘అసలు చెక్ ఎందుకు వేశారు. నగదు వేయాలి కదా’అని అన్నారు. మరోసారి నగదు రూ.11,660 డిపాజిట్ చేయమని చెప్పారు. దాంతో కేటరింగ్ సర్వీసు యజమానులు నిజమేనని నమ్మి మరోసారి రూ.11,660 నగదును ఆ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. అంటే మొత్తం మీద 23,260 చెల్లించారు.
నగదు డిపాజిట్ చేసిన విషయాన్ని కేటరింగ్ సర్వీసు యజమానులు త్రివిక్రమ్‌కు ఫోన్ చేసి చెప్పారు. విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్దకు వస్తే సెక్రటేరియట్ పాస్‌లు ఇస్తామని ఆయన తెలిపారు. దాంతో కేటరింగ్ ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అదిగో వస్తాను ఇదిగో వస్తాను అంటే అక్కడే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు. కానీ ఆయన రానేలేదు. సాయంత్రం ఫోన్లో అందుబాటులోకి వచ్చి బుధవారం నేరుగా సెక్రటేరియట్‌కు వస్తే పాస్‌లు ఇస్తామ న్నారు.
దాంతో బుధవారం వెలగపూడి వెళ్లి సెక్రటేరియట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరీక్షించారు. కానీ త్రివిక్రమ్ రానేలేదు. కొన్నిసార్లు ఫోన్లో అందుబాటులోకి వచ్చిన ఆయన తరువాత తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దాంతో తాము మోసపోయామని కేటరింగ్ సర్వీసు యజమానులు గుర్తించారు. తమలాగే నగరానికి చెందిన మరో కేటరింగ్ సర్వీసు యజమానులు కూడా మోసపోయారని తెలుసుకున్నారు.
కొసమెరుపు ఏమిటంటే.... త్రివిక్రమ్, జానకీరామయ్య పేర్లతో వచ్చిన ఫోన్ నెంబర్లను ట్రూకాలర్‌లో పరిశీలిస్తే ఆ రెండు కూడా రాకేష్ అనే పేరు తోనే ఉన్నాయి. అంటే రాకేష్ అనే వ్యక్తే త్రివిక్రమ్, జానకీరామయ్యల పేర్లతో ఫోన్ చేసి బురిడీ కొట్టించారు. తన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయించుకుని మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది.