స్థానికులకు తిరుమలేశుని ప్రత్యేక దర్శనం
తిరుపతి : స్థానికులకు శుభవార్త. ఇకపై నెలలో ఓ మంగళవారం తిరుమల, తిరుపతి, తిరుచానూరు వాసులకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. దీన్ని ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వేంకటేశ్వర స్వామి దర్శనంలో తమకూ ప్రత్యేక కోటా కల్పించాలని మూడు దశాబ్దాలుగా స్థానికులు కోరుతున్న విషయం తెలిసిందే. దీనికి ఆరు నెలల క్రితం టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. నెలలో ఒకసారి అయిదువేల మందికి ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించాలని తీర్మానించింది.
ఇందులో భాగంగా తొలుత తిరుమల, తిరుపతి, తిరుచానూరు వాసులకు ప్రయోగాత్మకంగా టికెట్లు కేటాయించి పరిశీలించనున్నారు. 4వ తేదీ మొదటి దశలో వెయ్యిమంది స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం 2వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర, కంప్యూటర్ ఫోటో సేకరించి టికెట్లు ఇస్తారు. స్థానికులు తమ ఆధార్ గుర్తింపు కార్డును కౌంటర్ వద్ద చూపించాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన స్థానికులకు రూ.300 టికెట్ల భక్తుల క్యూలో దర్శనానికి అనుమతిస్తారు. దీనిపై టీటీడీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాక ఈ సంఖ్యను అయిదువేలకు పెంచనుంది.