ఇష్టారాజ్యంగా ఇసుక తోడుతారా! | free lance sand! | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా ఇసుక తోడుతారా!

Published Sat, Feb 14 2015 2:03 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

ఇష్టారాజ్యంగా  ఇసుక తోడుతారా! - Sakshi

ఇష్టారాజ్యంగా ఇసుక తోడుతారా!

కడప కార్పొరేషన్: జిల్లాలో ఇష్టం వచ్చినట్లుగా ఇసుక క్వారీలకు అనుమతులిచ్చి నీటి ఎద్దడి ఏర్పడేలా చేయవద్దని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా కమలాపురం నియోజకవర్గంలో చెరువుకిందపల్లె, ఓబులంపల్లె, అనిమెల ఇసుక రీచ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల ఆయా ప్రాంతాలలో ఉన్న తాగునీటి స్కీంలు ఎండిపోయి నీటిఎద్దడి ఏర్పడే అవకాశముంద ని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పగా, రాయచోటి నియోజకవర్గంలో రోళ్లమడుగు వద్ద ఇసుకక్వారీని రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చెన్నూరు సమీపంలోని ఓబులంపల్లె వద్ద ఏర్పాటు చే స్తున్న ఇసుక క్వారీ వల్ల కడప నగరప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా ఫిర్యాదు చేశారు.
 
  ఆ రీచ్‌ను రద్దు చేయకపోతే   నగర పాలకవర్గమంతా అక్కడే కూర్చొంటామని అధికారులను హెచ్చరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇసుక రీచ్‌లకు అనుమతిచ్చేటప్పుడు అధికారులు వాస్తవ పరిస్థితులను అధ్యయం చేసి ఎక్కువ మందికి మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి కొందరికి ఆదాయం చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేయవద్దని సూచించారు. ఇష్టానుసారంగా ఇసుకక్వారీలకు అనుమతిస్తే తాగేందుకు నీరుండదని హెచ్చరించారు. భూగర్భ జల శాఖ అధికారుల నుంచి క్వారీలకు అనుకూలంగా నివేదిక వస్తేనే అనుమతి ఇవ్వాలన్నారు.
 
 లేనిపక్షంలో తాను ప్రయివేటు సంస్థలచే సర్వే చేయించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అంతవరకూ తేవద్దని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ శ్రీనువాసులుకు సున్నింతంగా హెచ్చరిక చేశారు. సోమశిల బ్యాక్ వాటర్ స్కీం కింద తెచ్చిన పైపులు ఒట్టిపోతున్నాయని, కడప, ప్రొద్దుటూరు, ట్రిపుల్ ఐటీలకు నీరిందించే ఈ పథకం ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ నిధులు రూ. 5 కోట్లు తాగునీటి పనులకే ఖర్చు చేస్తున్నా ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ వల్ల మేలు జరిగే పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదని అసంత్పప్తి వ్యక్తం చేశారు. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇందుకు అన్ని చోట్లా చేస్తున్నామని ఎస్‌ఈ సమాధానమివ్వగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఎక్కడ చేశారో స్పష్టంగా చెప్పాలని, అవాస్తవాలు చెప్పవద్దని నిలదీశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఇసుక, ఎర్రచందనం, నీటిని అమ్ముకొంటూ వ్యాపారం చేస్తోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనంతరం ఎస్‌ఈ స్పందిస్తూ తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరగా, రూ.1.90 కోట్లు మంజూరు చేసిందని సమాధానమిచ్చారు. మరో రెండు కోట్లు విడుదల చేయిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. రూ.3900 కోట్లతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు 24 గంటలు తాగునీరు సరఫరా చేసేలా వాటర్ గ్రిడ్‌లో ప్రతిపాదించామన్నారు. అంత బడ్జెట్ ప్రభుత్వం విడుదల చేస్తుందా అని జగన్ అధికారులను ప్రశ్నించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పంచాయితీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన కరెంటు చార్జీలను ప్రభుత్వమే చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భారమంతా స్థానిక సంస్థలపై వేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
 
 ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపుకోవాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 890 కీ.మీల మేర 314 రోడ్లు నిర్మించడానికి రోడ్ గ్రిడ్ కింద రూ.193 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని పంచాయితీరాజ్ ఎస్‌ఈ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, డీసీసీబి ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement