ఉచితం.. అనుచితం
ఉచిత విద్యుత్‌ను నీరుగారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(రాజ్‌విహార్): వర్షాలు సమృద్ధిగా కురిశాయి.. బోర్లు, బావులు నిండాయి.. పంటలు సాగు చేసుకుందామంటే విద్యుత్ కనెక్షన్ దొరకదు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికే దిక్కులేదు.. కొత్తవి ఇవ్వలేం బాబోయ్ అంటున్నారు విద్యుత్ అధికారులు. ‘ రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు.. అధికారంలోకి వస్తే వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. వ్యవసాయానికి ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తాం.. ప్రత్యేక బడ్జెట్ పెట్టి అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తాం’ అని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటుతున్నా రైతు సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అర్హులైన రైతులకు కొత్త కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసుకొని ఏడాది గడిచినా కనెక్షన్లు అందక జిల్లాలో 12,122 మంది రైతులు నిరీక్షిస్తున్నారు. గతంలో రైతు సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచిత విద్యుత్ (త్రీఫేజ్) అందించారు. జిల్లాకు 2004లో రూ.39.74 కోట్లతో 5,085 కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రతి ఏటా కోటా పెంచుతూ రెండున్నర ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 1.02 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. సాధారణంగా ప్రతి ఏటా జనవరి- ఫిబ్రవరి నెలల్లో పెండింగ్ దరఖాస్తులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయాల్సిన కోటాను కోరుతూ జిల్లా అధికారులు సీఎండీకి ప్రతిపాదనలు పంపుతారు. ఈ ఏడాది అలాగే చేశారు. ఏప్రిల్ నెలలో కోటా విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు దీని గురించి పట్టించుకోవడం లేదు. కోటా విడుదల ఆగిపోయి ఇప్పటికి ఆరు నెలలు గడిపోయినా ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.