
కోనసీమ గుండెలపై ఆరని బ్లో అవుట్
అటూ ఇటూ పచ్చటి పంటపొలాలు, అరటి, కొబ్బరితోటలతో అలరారే కోనసీమలో గ్యాస్ పైపులైన్లు గుండెలమీద కుంపటిలా ఉన్నాయి. పదేపదే ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నా, అధికారులు మాత్రం శాశ్వత చర్యలు చేపట్టిన పాపాన పోవట్లేదు. ఈమధ్యే కొన్నిసార్లు పైపులైన్ లీకేజి వచ్చింది. అయినా దాన్ని పట్టించుకోకపోవడం వల్లే మామిడికుదురు మండలం నగరం వద్ద తాజా ప్రమాదం కూడా జరిగింది. ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను పేలడం వల్లే ఇంత భారీ ప్రమాదం సంభవించింది. గతంలో లీకేజి వచ్చినా కూడా మొత్తం పైపులైనును పరిశీలించాల్సింది పోయి.. కేవలం అక్కడికక్కడ మాత్రమే మరమ్మతులు చేసి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇక ప్రస్తుత ప్రమాదంలో మంటలను కొంతవరకు అదుపులోకి తెచ్చారు. మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. దాదాపు 20 మీటర్ల మేర పైపులైన్ పగిలిపోయింది. 200 కొబ్బరిచెట్లు మంటల్లో మొదలు దగ్గర్నుంచి పూర్తిగా కాలిపోయాయి. సమీపంలో ఉన్న ఇళ్లు కూడా కాలిపోయాయి. ఒకే ఇంట్లోని ముగ్గురు సజీవంగా దహనమయ్యారు. కొబ్బరిచెట్లు కాలిపోవడం, ఇళ్లపై కూడా ప్రభావం ఉండటంతో ఈ ప్రాంతమంతా భయానకంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదం సంభవించడంతో ఏం జరిగిందో తెలిసేలోపే అంతా అయిపోయింది. గాయపడిన వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని రాజోలు ఆస్పత్రికి తరలించారు.
1993లో మామిడికుదురు మండలం కొమరాడలో తొలిసారిగా బ్లోఅవుట్ సంభవించింది. ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్ పాశర్లపూడి 19 స్ట్రక్చర్ పరిధిలో 1995లో అల్లవరం మండలం దేవర్లంకలో సంభవించింది. ఈ బ్లో అవుట్ రావణాకాష్టంలా రగులుతూ 65 రోజుల పాటు అందరినీ అష్టకష్టాల పాలు చేసి, చివరకు విదేశీ నిపుణుల సహకారంతో అదుపులోకి వచ్చింది. 1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో బ్లోఅవుట్ సంభవించి దానంతట అదే ఆరిపోయింది. 2005 సెప్టెంబర్‌లో పాశర్లపూడి స్ట్రక్చర్‌లోని తాండవపల్లిలో మరోసారి బ్లో అవుట్ సంభవించి కోనసీమ వాసుల గుండెలపై కుంపటి చిచ్చురేపింది.