సాగు నీటి కోసం రైతుల ఘర్షణ
వెంకటాచలం : కనుపూరు కాలువ కింద వరి సాగు చేస్తున్న రైతులు సోమవారం సాగునీటి కోసం ఘర్షణ పడ్డారు. కనుపూరు, చవటపాళెం, కసుమూరు, కురిచెర్లపాడు, వెంకటకృష్ణాపురం రైతులు 200 మందికి పైగా కొమ్మలపూడి బ్రాంచ్ కాలువ వద్దకు చేరుకుని తమ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ముందుగా సాగునీరు తమ కే కావాలంటూ వాగ్వాదం పడ్డారు. ఒక దశలో ఘర్షణ పడటంతో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ షేక్ రహమతుల్లా, ఇరిగేషన్ అధికారులు బాల సుబ్రహ్మణ్యం, వీరాస్వామి, ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని అన్ని గ్రామాల రైతులతో చర్చించారు.
ప్రతి గ్రామానికి నీటి తీరువాలు పెట్టి సమస్యను పరిష్కరించారు. రైతులు మాట్లాడుతూ సాగు నీరు లేక వరినాట్లు పూర్తిగా ఎండి పోతున్నాయన్నారు. డీఈ సమీవుల్లా సూచన మేరకే ఈ ఏడాది వరి సాగు చేశామని, లేదంటే ఈ ఏడాది సాగు విరమించుకునే వారమన్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈ వచ్చి తమ సమస్య పరిష్కరించాలని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఇరిగేషన్ సిబ్బంది రైతులకు సర్ది చెప్పి పంపివేశారు.