న్యూస్‌లైన్ నెట్‌వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహం కారణంగా కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన ‘తుఫాన్’ చలన చిత్ర ప్రదర్శనకు అవరోధం ఏర్పడింది. సినిమా విడుదలైన శుక్రవారం గ్రామీణ జిల్లాలోని వివిధ కేంద్రాల్లో ప్రదర్శనకు ఎదురుదెబ్బ తగిలింది. అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, యలమంచిలి, అరకు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచే సమైక్య వాదులు థియేటర్ల వద్ద మోహరించారు.
పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ సినిమా ప్రదర్శనను అడ్డుకునే ధ్యేయంతో ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి చిరంజీవి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని, పదవికి రాజీనామా చేయడం లేదని, అందుకే తాము ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తమకు సహరించారని రామ్ చరణ్ అభిమానులను, థియేటర్ల యాజమాన్యాలను కోరారు. దాంతో అభిమానులు థియేటర్ల వెలుపలికి వచ్చేశారు. యజమానులు కూడా సినిమా ప్రదర్శనను నిలిపేశారు. ఒకటి రెండు చోట్ల సిని మాను ఆలస్యంగా ప్రారంభించారు. మొత్తం మీద చాలా చోట్ల శుక్రవారం ప్రదర్శన సాధ్యం కాలేదు. ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోలేదు.
అభిమానులపై లాఠీ ఝళిపింపు
నర్సీపట్నం రూరల్: తుఫాన్ చిత్రం విడుదల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. చిత్రప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శుక్రవారం పట్టణ సీఐ ప్రసాదరావు సీఆర్‌పీఎఫ్ బలగాలను శ్రీకన్య సినీ కాంప్లెక్స్ వద్ద మోహరింపజేశారు. ఉదయం 8గంటలకే రామ్‌చరణ్‌తేజ్ అభిమానులు అధిక సంఖ్యలో సినిమా చూసేందుకు తరలివచ్చారు. మూకుమ్మడిగా వారు సినిమా కాంప్లెక్స్ ప్రాంగణంలోకి కు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ చిత్ర ప్రదర్శనను నిలిపివేయడంతో రామ్‌చరణ్ అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. పోలీసులు మధ్యాహ్నం 12గంటల వరకు సినిమాకాంప్లెక్స్ ఆవరణలోనే పహారా కాశారు.
ఒకరోజు వాయిదా
అనకాపల్లి అర్బన్: తుఫాన్ చిత్రం విడుదల శుక్రవారం నిలిచిపోయింది. ఇక్కడి వెంకటేశ్వ ర, పర్తిసాయి, షిరిడిసాయి థియేటర్లలో ఈ చి త్రాన్ని ప్రదర్శించాల్సి ఉంది. సమైక్యాంధ్ర జే ఏసీ సూచన ప్రకారం చిత్ర ప్రదర్శనను ఒక రో జు వాయిదా వేసుకుంటున్నట్టు నిర్వాహకులు, రామ్ చరణ్ అభిమానులు తెలిపారు. శనివా రం నుంచి యథావిధిగా ప్రదర్శిస్తామన్నా రు.
నినాదాలు, బైఠాయింపు
పాయకరావుపేట: తుఫాన్ ప్రదర్శనను ఉద్యోగులు, ఉపాధ్యాయుల జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. ఉదయం మోర్నింగ్ షో సమయానికి వీరు ర్యాలీగా చిత్ర మందిర్, సూర్య థియేటర్ల వద్దకు వచ్చి బైఠాయించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకని చిరంజీవి కుమారుడి సినిమా ప్రదర్శనను నిలిపేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులు థియేటర్ల నుంచి వెలుపలికి రావాలని కోరడంతో వారు తలవొగ్గారు. అయితే ఆందోళన తర్వాత మళ్లీ ప్రదర్శన ప్రారంభించారు. రెండు థియేటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు.
ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల ఆందోళన
మాడుగుల: తుఫాన్ సినిమా ప్రదర్శనను మాడుగులలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. స్థానిక కనకరత్న థియేటర్ వద్ద ఆర్టీసీ కార్మికులు, జేఏసీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. సోనియాకు, కెసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను నిలువరించారు.
అరకులో నిరసన
అరకులో తుఫాన్ ప్రదర్శనను ఎన్జీవో, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు అడ్డుకున్నారు. జ్యోతి మహాల్‌లో శుక్రవారం ఉదయం ఆటను నిలిపివేశారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, సమైక్యాంధ్ర పోరాటంలో పాల్గొనాలని నినాదాలు చేశారు.
వాల్‌పోస్టర్ల దహనం
యలమంచిలి/యలమంచిలి రూరల్: తుఫాన్ సినిమా ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. పట్టణంలోని తులసీ, సీత చిత్రమందిర్‌లలో విడుదలైన సినిమాను ఆపడానికి ఆందోళనకారులు ఉదయం 10 గంటలకే థియేటర్‌లకు చేరుకున్నారు. ఉదయం ఆట ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. వాల్‌పోస్టర్‌లను చింపేసి తగులబెట్టారు. సమైక్యవాదుల నిరసనలతో సినిమా థియేటర్ యాజమాన్యం ఉదయం ఆట ప్రదర్శనను నిలిపివేసింది.
తొలిరోజు నిలిచిన ‘తుఫాన్’
Published Sat, Sep 7 2013 4:07 AM | Last Updated on Sun, Jul 14 2019 1:57 PM
Advertisement
Advertisement