
ఎక్కడి ఉద్యోగులు అక్కడే..
సర్వీసు రిజిస్టర్‌లో పేర్కొన్న
జిల్లా ప్రకారం స్థానికత
ఆప్షన్లకు నెలరోజుల గడువు
30న కమలనాథన్ కమిటీ భేటీలో ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు
ఆంధ్రాలో 3,000 మంది.. తెలంగాణలో 4,000 మంది ఎక్కువ
హైదరాబాద్: ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు కమలనాథన్ కమిటీ సిద్ధంగా ఉంది. తమ ప్రాంతానికి చెందినవారిని తమ రాష్ట్రానికే కేటాయించాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఇదే వైఖరి అవలంబిస్తే సీమాంధ్రకు చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించడం వల్ల కమలనాథన్ కమిటీకి ఉద్యోగుల పంపిణీ సులభతరం కానుంది. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులో గుర్తించడానికి.. సర్వీస్ రిజిస్టర్‌లో ఏ జిల్లాకు చెందినవారో రాసి ఉంటుందని, దానిప్రకారం స్థానికత నిర్ధారిస్తే సరిపోతుందనేది అధికారుల భావన. ఫలితంగా స్థానికతపై తకరారు తొలగిపోతుందని అధికార వర్గాలంటున్నాయి.
సూపర్ న్యూమరరీ పోస్టుల సృష్టి తప్పదు..
ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పై, మధ్యస్థాయి పోస్టుల్లో 3,000 మంది ఎక్కువగా ఉంటారని, అలాగే తెలంగాణకు కిందిస్థాయిలో ఎక్కువమంది ఉద్యోగులతో మొత్తం 4,000 మంది అధికంగా ఉంటారని అధికార వర్గాలు చెప్పాయి. ఎక్కువగా ఉన్న ఉద్యోగులకోసం రెండు రాష్ట్రప్రభుత్వాలు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడంతోపాటు ఖాళీ పోస్టుల్లోనూ నియమించవచ్చునని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
30న కమలనాథన్ కమిటీ భేటీ...
ఏ ప్రాంతంవారిని ఆ ప్రాంతానికి కేటాయించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే కమలనాథన్ కమిటీ జిల్లాల స్థానికత ఆధారంగా ఎవరు ఆప్షన్ ఎక్కడ ఇస్తే అక్కడకు కేటాయించేలా ముసాయిదా మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఈ నెల 30న జరిగే సమావేశంలో ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయాలనే పట్టుదలతో కమలనాథన్ ఉన్నారు. ఆరోజు ముసాయిదా మార్గదర్శకాలు ఖరారైతే మరుసటిరోజు ఇరు రాష్ట్రాలకు చెందిన వెబ్‌సైట్లలో వాటిని ఉంచుతారు. వాటిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించడానికి పది రోజుల గడువిస్తారు. తర్వాత జూలై నెలాఖరుకు తుది మార్గదర్శకాలను కమిటీ రూపొందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదానికి పంపుతుంది. మొత్తం పంపిణీ ప్రక్రియను ఆగస్టు నుంచి ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా పూర్తిచేయాలనేది కమిటీ భావన.