సాక్షి, కడప: ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. స్వచ్ఛందంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యమంలో పూర్తి స్థాయిలో భాగస్వాములవుతున్నారు. 61 రోజులుగా సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పటికీ ఇప్పుడు ఉద్యమం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం చూపే సర్పంచులు, వార్డు మెంబర్లు దీక్షలు చేసి సమైక్య తీర్మానాలు ఆమోదించి సమైక్య నినాదాన్ని ఢిల్లీకి బలంగా వినిపించారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో కడపలో డీసీసీ బ్యాంకు ఎదుట సహకార సంఘాల అధ్యక్షులు, డెరైక్టర్లు, మహిళలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు ఇలా అందరూ ఒక్కతాటిపై చేరి సామూహిక దీక్షలు చేపట్టి సమైక్య శంఖారావాన్ని పూరించారు.
కడప నగరంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. డీసీసీ బ్యాంకు ఎదుట చేపట్టిన సహకార సమరం సామూహిక దీక్షలకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలి రావడంతో దీక్షలు విజయవంతమయ్యాయి. డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, జీఎం సహదేవరెడ్డి, సహకార అధికారి చంద్రశేఖర్, సహకార కళాశాల ప్రిన్సిపాల్ గుర్రప్పతోపాటు సహకార సిబ్బంది, అధికారులు కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
జమ్మలమడుగులో తెలుగు పండితులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ముద్దనూరు పాత బస్టాండులో యుద్ధభేరి సభను నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడం విశేషం. సభాప్రాంగణం సమైక్య నినాదాలతో హోరెత్తింది. ఈ సభకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డిలు తమ సంఘీభావాన్ని తెలిపారు.
పులివెందులలో ఎన్జీఓలు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు. రిలే దీక్షల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటలో వెంకటాంపల్లె, వరదాయపల్లెకు చెందిన గ్రామస్తులు వైఎస్సార్ సీపీ నేతలు కాలయ్యనాయుడు, సోమయ్యనాయుడు ఆధ్వర్యంలో 60 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
ప్రొద్దుటూరులో నాగాయ్యపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత షరీఫ్ ఆధ్వర్యంలో 16 మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అటవీశాఖ సిబ్బంది, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
బద్వేలులో రాష్ట్రం విడిపోతే ఎడారే....కలిసుంటే హరితాంధ్రప్రదేశ్ అంటూ ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ పటాన్ని రోడ్డుపై వేసి ప్రదర్శన నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పోరుమామిళ్లలో ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు 16 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి రాజకీయ జేఏసీ, ఉద్యోగ జేఏసీ, ఆర్యవైశ్య సంఘం తమ మద్దతును తెలిపాయి. ఉపాధ్యాయులు బైకులతో మానవహారం ఏర్పాటు చేశారు. పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చింతంనగర్‌కు చెందిన పిల్లలు పట్టణంలో సోనియా దిష్టిబొమ్మను ఊరేగిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
మైదుకూరులో పూల అంగళ్ల యజమానులు, టీ హోటళ్ల వారు పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. విచిత్ర వేషధారణలు, చక్కభజనలతో సమైక్య నినాదాన్ని హోరెత్తించారు.
రాయచోటి పట్టణంలో జేఏసీ, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు గొడుగులు చేతబట్టి వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
అలుపెరగని పోరు
Published Mon, Sep 30 2013 2:36 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement